.
ముళ్ళపూడి వారు హేమమాలిని, జయలలిత గార్ల విషయాలలో చేసిన జడ్జిమెంట్లూ ఆపై పడిన శిక్షలు చూద్దాం.
ముందు హేమమాలిని గారి గురించి. తేనెమనసులు సినిమాకి హీరోయిన్లుగా కొత్త అమ్మాయిలు కావాలని, ఆ సినిమా దర్శకులు ఆదుర్తి సుబ్బారావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారినీ, విద్వాన్ విశ్వం గారినీ, కెమెరామాన్ సెల్వరాజు గారిని కలిపి ఒక త్రిసభ్య కమిటీ వేసి, సరదా పడుతున్న అమ్మళ్లని ఇంటర్వ్యూలు చెయ్యమని పంపించారు.
Ads
వీళ్ల పని సెలక్షన్ కోసం వచ్చే అమ్మాయిలని ‘ చూడడం, మాట్లాడించడం, ఫొటోజెనిక్ గా ఉన్నారా లేదా ‘ అని చెప్పడం. ఈ పరీక్షల కోసం చాలామంది అమ్మాయిలను చూసారు, కమిటీకి ఎవరూ నచ్చడం లేదు. ఎప్పటికప్పుడు ‘ నెక్స్ట్ ‘ అని పిలుస్తుండేవాళ్లు. ఈ కార్యక్రమంలో, అనూహ్యంగా, హై కమాండ్ సెలక్షన్ కమిటీ వాళ్లు, హేమమాలిని, జయలలితలను కూడా చూసారు.
వీరిద్దరూ పనికిరారని ఈ కమిటీ రూలింగ్ ఇచ్చేసింది. అప్పటి హేమమాలిని తరువాత డ్రీం గర్ల్ లాగా లేదు. సెలక్షన్ సమయంలో సన్నగా చీపురుపుల్లలా చిటికిన వేలంత వున్నట్లు అనిపించింది కమిటీకి.
హేమమాలిని, వాళ్లకు రేకు గ్లాసులలో టీ యిస్తుండగా, వాళ్ళ అమ్మ చెప్పింది కూడా, ఏమని..? ‘ ఛాన్సు ఇస్తే, ఆపిల్సూ, బత్తాయి రసం ఇచ్చి పుష్టిగా చేస్తాం మా అమ్మాయిని అని… ‘ ఊహూ.. కమిటీ ససేమిరా అన్నది.
తరవాత్తరవాత, హేమమాలిని అంచెలంచెలుగా ఎదిగి యువహృదయాలు కొల్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే !
ఇక జయలలిత విషయానికొస్తే, ఆమెకు కొద్దిగా మెల్లకన్ను వున్నదని, ఆమె ప్రొఫైల్ ని సెల్వరాజు గారు పక్కన పెడదామన్నారు. సరే అన్నది బృందం. తరువాత ఆమె అటు సినీ రంగాన్నీ, రాజకీయ రంగాన్నీ కుదుపులు కుదిపి, యేలిపారేసిన సంగతీ మనకందరికీ తెలుసు.
అలా అనుకుంటే యిలాంటి తప్పులు పరిశ్రమలో కొత్త కావు. సావిత్రి గారు సినిమాలకి పనికిరారని ఎల్వీ ప్రసాద్ గారు అనలేదా ! రావు గోపాలరావు గారి కంఠం సినిమాలకి పనికిరాదని ఆయనని సౌండ్ ఇంజనీర్లు ఒప్పుకోలేదు కదా ! ఇక తప్పక ఆయనను తీసుకోవాల్సి వస్తే, ఆయన పాత్రకి డబ్బింగు కూడా వేరే వారితో చెప్పించారు.
అంతెందుకు శ్రీశ్రీ గారి ‘ మహా ప్రస్థానం ‘ కవితను భారతి పత్రిక తిరస్కరించలేదూ ! ఇహ విషయానికి వస్తే, ఆ సెలక్షన్ లో తిరస్కరింపబడిన పది సంవత్సరాలకు, రమణ గారు హేమమాలిని చేత జడ్జిమెంటు చెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పాండవ వనవాసం తీసిన నిర్మాతతో కలిసి రమణ గారు వెళ్లి హేమమాలిని నటించబోయే ఒక హిందీ చిత్రానికి కథ చెప్పవలసి వచ్చింది. రమణ గారు కొంచెం కథ చెప్పగానే, ఆమె కుర్చీలో వెనక్కి చెరబడి, ‘ మిస్టర్ రమణా ! మీరు చెబుతున్న కథకు ఫలానా ఇంగ్లీషు నవల ఆధారం గదా ! , మీరు అందులో నాకు లాయర్ వేషం ఇద్దామనుకుంటున్నారు కదా ! ‘ అన్నది, హుందాగా.
‘ మూలం అదే కానీ, నేను చాలా డెవలప్ చేశాను మేడం ! ‘
‘ నేనూ ఆ పని మీదే వున్నాను. ఆ నవలని కాపీ కొట్టి మావారు ధర్మేంద్ర, నేనూ సినిమా చేస్తున్నాం. అంచేత, ఇంకో కథ చూసుకుని రండి. ‘ అని రమణగారి వైపు కనీసం చూడకుండా, నిర్మాత వైపు తిరిగి చెప్పింది హేమమాలిని.
పదేళ్ల క్రితం జరిగిన అజ్ఞానపు జడ్జిమెంటు గురించి చెప్పాలనుకున్న రమణ గారికి, ఆమె చుట్టూ వున్న అయిదారుగురు సెక్యూరిటీ బౌన్సర్లను చూసి, ధైర్యం చాలక, వెనక్కు తగ్గారు. అది నిజంగా అజ్ఞానపు జడ్జిమెంట్, ఎందుకంటే, తేనెమనసులు సినిమా బాగా ఆడినా, ఆ కమిటీ సెలెక్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్లు సుకన్య, సంధ్యారాణి తరువాత రాణించలేదు కదా !
ఇక తన కళ్ళతో బేరీజు వేసి సెలెక్ట్ చేసిన ఆదుర్తి గారి హీరోలలో, అదే కృష్ణ, రాంమోహన్ల మీద కూడా సినీ పండితులు తప్పుడు విశ్లేషణలు చేసారు. అట్లకాడలా వున్న కృష్ణకి అదే మొదటి, ఆఖరు సినిమా అనీ, అమాన్ దస్తాలో గూటంలా దిట్టంగా, దేవానంద్ పూర్ రెలిటివ్ లా వున్న రామ్ మోహన్ పరిశ్రమని ఏలేస్తాడనీ జోస్యం చెప్పారు. కానీ జరిగింది అందరికీ తెలుసు.
ఇక హేమమాలిని దగ్గర జరిగినట్టే రమణ గారికి జయలలిత దగ్గర కూడా శిక్ష పడింది. ఆ సెలక్షన్ జరిగిన 25 ఏళ్ళ తరువాత, జయలలిత గారు ముఖ్యమంత్రిగా వున్న ఒక నందీ అవార్డుల సభలో, ‘ పెళ్ళిపుస్తకం ‘ సినిమాకి, నిర్మాతగా, మాటల రచయితగా రెండు నంది అవార్డులు అందుకున్న రమణ గారు, అవి ఆమె నుండి స్వీకరించే సమయంలో,
( ఒక్కొక్కటి సుమారు 20 కిలోల బరువు వున్నది. ) ఆమె వాలంటీర్ సహాయంతో, ఆ నందులను రమణ గారి చేతుల్లో వుంచబోయింది. ఎదురు చూడని అంత బరువుకు, అవి అందుకున్న రమణ గారు తూలి కొంచెం ముందుకు వంగి, ఆవిడ పాదాల మీద పడబోయి తమాయించుకున్నారు.
రమణ గారు తన పాదాలకు మొక్కుతున్నారని అపోహపడిపోయి, ఆమె వద్దూ వద్దని వారిస్తున్నది. పక్కనే వున్న సెక్యూరిటీ గార్డు రమణ గారు ఏదో, హత్యా ప్రయత్నం చేస్తున్నారేమో అని భ్రమపడి, తుపాకిని షూట్ చేసే పొసిషన్లోకి తీసుకున్నాడు. ఇదంతా అరక్షణంలో జరిగిపోయింది.
మెల్లగా లేచి, రమణ గారు, ‘ బరువు … ‘ అని గొణిగారు. ఆమె నవ్వింది. ఆమె నవ్వగానే ధైర్యం వచ్చి, ‘ నేను మీ చిత్రాలకు కధలు రాసాను. ‘ అని అనేసారు రమణ గారు. అందులో ‘ కధానాయకుడు ‘ సినిమా ముఖ్యమైనది, మూడు భాషలలో విజయఢంకా మోగించింది. తెలుగు, తమిళంలో జయలలితే కధానాయిక. జయలలితకు కథ రాసిన ఇంకో సినిమా ‘ ఆస్తిపరులు. ‘ అదికూడా హిట్. అయితే అందులో కథకుడిగా రమణ గారి పేరు రాలేదు… (- గండవరపు ప్రభాకర్)
Share this Article