.
పుర్రెలో పురుగు మెసులుతూనే ఉంటుంది… అవును, దాని పేరు బనకచర్ల..! కేసీయార్‌కు కాళేశ్వరంలాగా బనకచర్లను ఓ ఏటీఎం ప్రాజెక్టుగా చేపట్టాలని చంద్రబాబు ఆశపడ్డాడు…
కేసీయార్ క్యాంపు దీన్ని గాయిగత్తర లేపి, పొలిటికల్‌గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి, చంద్రబాబుకు గురుదక్షిణ అనీ, అందుకే దాన్ని అనుమతిస్తున్నాడు అనీ, ఢిల్లీలో సంతకాలు చేశాడనీ నానా గగ్గోలు (తనకు అన్ని విషయాల్లో అలవాటైనట్టుగానే) పెట్టింది…
Ads
తీరా ఏమైంది..? ఆ ప్రతిపాదిత 80 వేల కోట్ల బనకచర్లకు పన్నెండు ముళ్లు వేసింది తెలంగాణ ప్రభుత్వం… అవి విప్పుకోవడం తెలియలేదు చంద్రబాబుకు… ఠాట్, నామీద ఆధారపడి నడుస్తోంది మోడీ సర్కార్, మోడీ మెడలు వంచి, తలపై కత్తులు వేలాడదీసి మరీ అనుమతులు సాధిస్తాం అనుకున్నాడు… కానీ రేవంత్ పెట్టిన చిక్కుముళ్లతో కేంద్రం కూడా బాబూజీ, ఐసా నై చల్తా అనేసింది… దాంతో ఇక రెండో ప్రతిపాదనకు వెళ్లాడు…
కాస్త తక్కువ ఖర్చుతో… (60 వేల కోట్లు)… కానీ సంకల్పం అదే… వృథాజలాల పేరిట గోదావరి నీటిని వాడేసుకోవడం… పేరుకు రాయలసీమకు జలప్రయోజనం… గోదావరి టు పెన్నా అనుసంధానం… దానికి ఆర్ఎఫ్‌సీ టెండర్లు కూడా పిలిచాడు… సొంత క్యాంపు నుంచి కూడా విమర్శలొచ్చాయి… అదొక నిరర్థక ప్రాజెక్టు అని… ఇప్పుడు హఠాత్తుగా ఆ టెండర్లు రద్దు చేశాడు…
పాపం కొందరు చంద్రబాబు వెనక్కి తగ్గినట్టే జనవ్యతిరేకతకు జడిసి, ఇతర రాష్ట్రాల చిక్కులకు వెరచి అనుకున్నారు… అదే రాశారు కూడా… కానీ తప్పు… పుర్రెలో పురుగు మెసులుతూనే ఉంది… అసలు ఆ టెండర్ల రద్దు కథ వేరు… తను మూడో ప్రతిపాదనకు, అంటే మరిన్ని మార్పులతో మోడీ దగ్గరకు వెళ్లబోతున్నాడు… అదీ అసలు కారణం…
ఇదీ తక్కువ ఖర్చేమీ కాదు… 50 వేల కోట్లు… (ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది ఆ వివరాలను ఈరోజు)… కానీ తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల చుట్టూ వేసిన అష్టదిగ్బంధనం ముగ్గు నుంచి బాబు కలల, కాసుల ప్రాజెక్టు బయటికి రాలేకపోవచ్చు… ఎందుకంటే..?
ఇదీ పోలవరం నుంచే నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువకు తరలిస్తారట, అక్కడి నుంచి నల్లమలసాగర్‌కు చేరుస్తారట… అంటే, సేమ్ గోదావరి నీరు, సేమ్ పోలవరం అనుబంధ ప్రాజెక్టు, సేమ్ బేసిన్ మార్పు, సేమ్ పర్యావరణ ఇష్యూస్… అంటే, ఇది చేపడితే ఎగువ రాష్ట్రాలకు కృష్ణా నీటిలో వాటాలు ఇవ్వాలి, కనీసం 80 టీఎంసీలు…
అసలు సాగునీటి పరిభాషలో వృథాజలాల ప్రాజెక్టులు అనేదే లేదు… అనుమతులు రావు, అనుమతుల్లేనిదే రుణాలు రావు… కేంద్రం పేరుకు జాతీయ ప్రాజెక్టుగా చెప్పిన ఆ పోలవరం డబ్బులే సరిగ్గా ఇవ్వడం లేదు, మొదటి దశ (తక్కువ ఎత్తు, తక్కువ ముంపు)కే పరిమితం అనే ఆలోచనలో ఉంది… మరిక ఈ బనకచర్ల బాబు చెప్పిన మూడో దశకు సై అంటుందా..? ఐనా సరే… బాబు ప్రయత్నిస్తూనే ఉంటాడు… అవసరమైతే నాలుగో ప్రతిపాదనకూ సై, జై..!!
Share this Article