వాట్సప్ వార్తల గ్రూపుల్లో కనిపించింది ఈ వార్త… ముందుగా ఈ వార్త చదవండి… ‘‘హ్యాట్రిక్ హీరో.. ముచ్చటగా మూడో పెళ్లి..! శుభ లేఖలు పంచి.. దగ్గరుండి మూడవ పెళ్లి జరిపించిన మొదటి భార్య & రెండో భార్య..!!
అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీ కించూరు గ్రామం. అక్కడ సాగేని పండన్న.. పార్వతమ్మ ను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు.. అలా ఇద్దరు భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఏనాడు ఎటువంటి కుటుంబ కలహాలు లేకుండా ఆ ఇద్దరు భార్యలు భర్తను చక్కగా చూసుకుంటున్నారు.
అయితే.. అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్న పండన్న.. లక్ష్మీ అనే మరో యువతిపై మనసు పారేసుకున్నాడు. ఆమెది జి.మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామం. లక్ష్మీని ఇష్టపడ్డ విషయం.. తనను ఎంతగా ప్రేమించే ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండన్నను ప్రోత్సహించారు.
Ads
ఆ ఇద్దరు భార్యలే స్వయంగా..!!
దీంతో, ఇక పండన్న వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకొని తమ జీవితం లోకి ఆహ్వానించాలని అనుకున్నాడు. అంతే.. ఆ ఇద్దరు భార్యలతో రాయబారం పంపాడు. పెద్దలు కూడా అంగీకరించడంతో.. లక్ష్మీని పండన్నకు ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక.. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.
ఇంటింటికి వెళ్లి.. ఆహ్వానాలు అందించి…
పండన్నకు తల్లిదండ్రులు లేరు.. దీంతో, ఇద్దరు భార్యలే అతనికి సర్వస్వం. వాళ్లు కూడా అదే స్థాయిలో పండన్నను ప్రాణానికి మించి చూసుకుంటున్నారు. ఇక పెళ్లి పెద్దలు కూడా వాళ్ళిద్దరే అయ్యారు. శుభ లేఖల్లో కూడా.. ఆ ఇద్దరు భార్యలే అందరిని ఆహ్వానిస్తున్నట్టు ముద్రించారు. ఇంటింటికి వెళ్లి శుభ లేఖలను పంచారు. బంధు మిత్రులను ఆహ్వానించారు. ‘మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ.. నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన.. అంటూ ఆ ఇద్దరు భార్యలు సాగేని పార్వతమ్మ, సాగేని అప్పలమ్మ..’ అంటూ శుభ లేఖను ముద్రించి ముగించారు.
సందడిగా విందు, వినోదం..
జూన్ 25 ఉదయం 10 గంటలకు కించూరులో వివాహం జరిగింది. నవ వధువు లక్ష్మీ తరపు బంధువులు, మూడో పెళ్లి చేసుకుంటున్న పండన్న బంధు మిత్రులు, గ్రామ పెద్దలు కూడా వివాహానికి హాజరయ్యారు. అదే స్థాయిలో విందు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కలిసి గ్రాండ్గా పండన్న లక్ష్మీల వివాహాన్ని జరిపించారు. సంసారం సుఖ సంతోషాలతో సాగి పోవాలని ఆశీర్వదించారు…
నిజంగా ఇంట్రస్టింగే… మామూలుగా సవతినే ఓ భార్య అంగీకరించదు… అలాంటిది ఇద్దరు భార్యలు కలిసి తమ మొగడికి దగ్గరుండి మూడో పెళ్లి చేయడం విశేషమే… గ్రామపెద్దలు, బంధుగణం, అక్కడి సమాజం ఎలా యాక్సెప్ట్ చేసిందో పక్కన పెడితే… మూడో పెళ్లాంగా అడుగుపెట్టడానికి ఆ అమ్మాయి ఎలా అంగీకరించింది..? ఎలా ఇష్టపడింది..?
చట్టం ఈ బహుభార్యత్వాన్ని ఎలా ఆమోదించింది..? అసలు రెండో పెళ్లినే చట్టం ఒప్పుకోదు… సరైన కారణాలుండి, అనుమతి తీసుకుంటే తప్ప… అలాంటిది ఇప్పుడు మూడో పెళ్లి… అందుకే డౌటొచ్చింది… అసలు ఈ వార్త నిజమేనా అని..! అసలు ఈ పండన్న వృత్తి ఏమిటి..? ఏమో, కొంత అదనపు సమాచారం కోసం ప్రయత్నించినా దొరకలేదు, కానీ వార్త నిజమే అన్నట్టుగా ఈనాడు న్యూస్ సైటులో కూడా ఈ వార్త కనిపించింది… https://www.eenadu.net/telugu-news/districts/alluri-sitharama-raju-news/708/124121507
Share this Article