ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ నాయకులు, అనుబంధ విభాగాలు, అనుబంధ మీడియా, ప్రచారం వెనుక అధ్యయనం అనేది ప్రధానంగా కనిపించేది… విషయాల్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవడం, పాలకుడి లైన్ ఏమిటో తెలుసుకుని, సరైన గణాంకాలతో విమర్శ పెట్టడం..! అలాంటిది నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఎవడితోపడితే వాడితో దోస్తీ, పెద్ద పార్టీలకు తోకలుగా మారిపోవడం కమ్యూనిస్టు పార్టీల దుర్గతి…
కేసీయార్‌తో దోస్తీ కుదరగానే, టరమ్స్ బాగా సంతృప్తికరంగా అనిపించగానే… ఎర్రదండు గవర్నర్ ఇంటి మీదకు దండయాత్రకు వెళ్లింది… అవసరమా..? తెలంగాణలో అదొక్కటే సమస్యా..? నిజంగా జనాన్ని వేధిస్తున్న సమస్యలు పట్టవా..? పడితే కేసీయార్ ఓ పట్టుపడతాడు కదా, భయం… దోస్తీ చెడిపోతే దెబ్బతింటామనే ఆందోళన… అన్నీ అచ్చు ఆ పార్టీ కార్యదర్శి నారాయణ చేష్టలు, మాటల్లాగే…
ఎప్పుడో ఓసారి అనుకోకుండా సీపీఐ పత్రిక విశాలాంధ్ర ఓపెన్ అవుతుంది… అలా మళ్లీ చదవబడ్డాను… వీళ్లు మరింత దిగజారిపోయారు అనేది స్పష్టంగా అర్థమైంది… జస్ట్, వాళ్ల బ్యానర్ స్టోరీ చూడగానే..! ‘పెరిగిన ధరలు- తగ్గిన రేషన్’ అని హెడింగ్… పక్కనే జగన్ సర్కారు రేషన్ వాహనం… ఇంట్రస్టింగు సబ్జెక్టు కదా, ప్రతి సర్కారు ప్రజాపంపిణీని భ్రష్టుపట్టించారు కదా, వీళ్లేం రాశారబ్బా అని చదవడం మొదలుపెడితే… దరిద్రం…
Ads
మోడీని తిట్టాలి, కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారును తిట్టాలి… అదొక్కటే… జగన్ రేషన్ వెహికిల్ ఫోటో పెట్టి, ఎవరో కమ్యూనిస్టు డొల్ల మేధావి రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఇది… ప్రైవేటు చేతుల్లోకి నిల్వలు పోవడం వల్ల, ప్రభుత్వ గోదాములు వెలవెలపోతున్నాయని రాశారు, వోకే, దానికీ పేదలకు అందని సరుకులకూ లింకేమిటి..? ప్రైవేటు చేతుల్లో నిల్వలు ఉన్నా ఆ సరుకులు ఎఫ్‌సీఐవే కదా… పీడీఎస్‌కు ఇవ్వబోం అని ప్రైవేటు వాళ్లు తాళాలు వేసుకున్నారా..?
నిజానికి ఇప్పుడు పేదలకు కావల్సింది చౌక రేట్లకు వంటనూనెలు, పప్పులు… సామాన్యుడి పౌష్టికాహార స్థాయిని నిర్దేశించేవి అవే… అయితే వీళ్లది ఎంత ఘోరమైన విశ్లేషణ అంటే… గోధుమల సేకరణ సరిగ్గా జరగడం లేదట, ఆ నిల్వలు అడుగంటాయట, దాంతో గోధుమలకు బదులు నాసిరకం బియ్యం ఇస్తున్నారట, విధిలేక మార్కెట్‌లో అధికధరలకు పేదలకు గోధుమల్ని, పిండిని కొనుక్కుంటున్నారట… నిజానికి బియ్యం బదులు గోధుమల్నే ఎక్కువగా కొంటున్నారు, ఇదేం వివక్ష అని కదా తెలుగు రాష్ట్రాల గగ్గోలు…
అసలు గోధుమలు ఇస్తే నాణ్యమైన సరుకా..? బియ్యం ఇస్తే అది నాసిరకమా..? ఇదేం సూత్రీకరణ..? గత ఏడాది నాటికి 419 లక్షల టన్నుల గోధుమలు నిల్వ ఉంటే, ఇప్పుడు 210 లక్షల టన్నులకు పడిపోయాయట… నూరుశాతం క్షీణత అని రాసేశారు… రాసిన వాళ్లకు, అచ్చేసిన వాళ్లకు మొక్కాలి… నూరుశాతం క్షీణత అంటే జీరోకు పడిపోవడం కాదా..? సరళంగా చెప్పాలంటే సగమే ఉన్నాయని మళ్లీ తదుపరి వాక్యంలోనే వివరణ… ఎక్కణ్నుంచి వచ్చారుర భయ్…
నిజానికి ఉండాల్సిన పరిమాణంలోకన్నా ఎక్కువ నిల్వలు ఉండటం, తరుగు, ఎలుకలు, పందికొక్కులు, గోదాముల అసమర్థ నిర్వహణ ఒక సమస్య… అవి తగ్గాలి… ఆహారభద్రతకు సరిపడా ఉంటే చాలు… వీళ్లేమో నిల్వలు లేవు అని ఏడుపులు, శోకాలు… మన పంపిణీ వ్యవస్థకు సరిపడా నిల్వలున్నాయా లేదానేది చూడాలి…
నిజానికి మార్కెట్‌లో జనానికి నిత్యావసరాల లభ్యత, రేట్లు ఎలా ఉన్నాయో చూడాలి… అవీ అందించాలి… రాజకీయ ప్రయోజనాల కోసం జనాభాను మించి రేషన్ కార్డులు ఇచ్చారు… వేరే సరుకులు ఇవ్వలేరు, జస్ట్, బియ్యం… ఆ పంపిణీ గురించి చెప్పాలంటే మళ్లీ అదో విషాదం… ఇంతకీ మోడీని తిట్టే వార్తకు జగన్ రేషన్ వాహనం ఫోటో ఎందుకు పెట్టారయ్యా మహాశయా…! ఐనా ఎవడూ చదవని యాడ్స్ పేరిట వందల కోట్ల ప్రజాధనం ఖర్చు పెడుతున్నావ్ కదా జగనూ, వీళ్లకూ నాలుగు యాడ్స్ పడేయవచ్చుకదా…!
Share this Article