.
Nàgaràju Munnuru ….. == మూడవ ప్రపంచ యుద్ధం రాబోతుందా? ==
అమెరికా వెనిజులా మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుడిని బంధించి సంకెళ్లు వేసి అమెరికాకు ఒక ఖైదీలా తరలించిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు ఇంకో కొత్త గీత దాటింది.
Ads
అమెరికా దళాలు వెనిజులాకు చెందిన చమురు నౌకలను అడ్డగించి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాయి, వాటిలో రష్యాకు చెందిన నౌకలు కూడా ఉన్నాయి.
అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది, కానీ చాలాకాలం తర్వాత మొదటిసారిగా, ఇది ఇకపై కాగితంపై ఆర్థిక ఒత్తిడి కాదు. ఇది భౌతికమైనది. ఇది ప్రత్యక్షమైనది. ఇది సముద్రాలపై జరుగుతోంది.
అదే సమయంలో, యుఎస్ మరియు నాటో దళాలు యూరప్ అంతటా తమ సైనిక కార్యకలాపాలను పెంచుతున్నాయి. జెట్ విమానాలను సిద్ధం చేసి, సైనిక బలగాలను అప్రమత్తంగా ఉంచుతున్నారు. అధికారికంగా, దీనిని “సంసిద్ధత” అని అంటారు. వాస్తవానికి, ఏదో తప్పు జరిగే అవకాశం కోసం దేశాలు సిద్ధమవుతున్నప్పుడు ఇది జరుగుతుంది.
మూడేళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్ మీద సైనిక చర్యకు దిగిన తర్వాత అమెరికా రష్యా మీద అనేక ఆర్థిక ఆంక్షలు విధించడమే కాకుండా నాటోలోని యూరప్ దేశాలు రష్యా నుండి చమురు కొనకుండా చేసింది. ట్రంప్ ఇదే ఒత్తిడి రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ మీద కూడా చూపిస్తున్నాడు. అదేసమయంలో వెనిజులా చమురు రష్యాకు మాత్రమే కాకుండా, చైనా, ఇతర యుఎస్ ప్రత్యర్థులకు కూడా నిశ్శబ్ద ప్రత్యామ్నాయ మార్గాలలో ఒకటిగా మారింది.
ఇప్పుడు వాషింగ్టన్ ఆ కుళాయిని బిగిస్తోంది. వెనిజులా చమురు ఎగుమతులను అణచివేసి, భౌతికంగా దానిని అమలు చేయడం ద్వారా, అమెరికా కారకాస్‌ను శిక్షించడమే కాదు. అది మాస్కో, దాని భాగస్వాములను మరొక దిశ నుండి పిండేస్తోంది.
ఉక్రెయిన్‌లో సుదీర్ఘమైన, ఖరీదైన యుద్ధంతో ఇప్పటికే కుంగిపోయిన రష్యాను ఒక మూలలోకి నెట్టివేస్తున్నారు. యుద్ధం కారణంగా రష్యా ఆర్థికంగా బలహీన పడింది, దాని ప్రత్యామ్నాయాలు తగ్గిపోతున్నాయి.
ఈ సందర్భం బాంబులు, క్షిపణుల వినియోగం కోసం తొందరపడటం కాదు. ఇది చాలా క్యాలిక్యులేటెడ్ విషయం. సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడికి గురి చేయడం.
ఇది నెమ్మదిగా ఊపిరాడకుండా చేయడం.
ఇది భౌగోళిక రాజకీయ చెక్‌మేట్ వ్యూహం.
ఈ జియో పాలిటిక్స్ చదరంగంలో నేరుగా రాజును కొట్టే బదులు, ఒక్కో పావును ఆట నుండి తొలగించడం ద్వారా ఆడబడుతుంది.
ఆంక్షల ద్వారా ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం.
నిధులను ఫ్రీజ్ చేయడం. ఇంధన మార్గాలను మూసివేయడం. సహకరించే మిత్రదేశాలను ఒత్తిడికి గురి చేయడం. అప్పుడు రష్యాను బలవంతంగా చర్చలకు ఒప్పించడం. అదికూడా అమెరికా కండిషన్స్ ప్రకారం.
ఇది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్న జియో పాలిటిక్స్ చదరంగ బోర్డు.
రష్యా ఇప్పటికే తన చమురు ట్యాంకర్ల స్వాధీనం చట్టవిరుద్ధమని, పైరెట్ చర్య అని పేర్కొంది. భాషకు మరింత పదును పెడుతోంది. ఒత్తిడి పెరిగిపోతుంది. తప్పటడుగు వేసే అవకాశం పెరుగుతోంది.
అమెరికా లక్ష్యం రష్యా, చైనాలను చెక్‌మేట్ చేయడం, అమెరికన్ నిబంధనలపై పుతిన్‌తో చర్చలు జరపడం. కానీ పెద్ద యుద్ధాలు సాధారణంగా ఇలాగే ప్రారంభమవుతాయి. ఎవరో వాటిని కోరుకుంటున్నందుకు కాదు. చాలా మంది శక్తివంతమైన నాయకులు తమ పంతం నెగ్గించుకోవడం కోసం, ఒక్క అడుగు వెనక్కి వేయడానికి ఒప్పుకోక పోవడం వలనే. ఏదో ఒకరోజు వీళ్లలో ఎవరో ఒకరు తప్పుడు అంచనా వేసి చర్యకు దిగుతారు.
3వ ప్రపంచ యుద్ధం అనివార్యమా? కాదు.
కానీ ప్రస్తుతం ప్రపంచం ప్రమాదకరమైన దశలో ఉందా? ఖచ్చితంగా.
పుతిన్ గతంలో కంటే బలహీనంగా ఉన్నాడు. ఉక్రెయిన్ యుద్ధం రష్యా సైనికులను, డబ్బును, ఆయుధాలను, రాజకీయ పరపతిని దహించి వేసింది. అమెరికాకు ఇది స్పష్టంగా తెలుసు. అందుకే ఒత్తిడి తగ్గడానికి బదులుగా పెరుగుతోంది.
లక్ష్యం తక్షణ విధ్వంసం కాదు. మొత్తం చదరంగం బోర్డును తగలబెట్టకుండా రాణిని లొంగిపోయేలా చేయడమే లక్ష్యం.
జ్ఞానం గెలుస్తుందని ఆశిద్దాం.
ఎందుకంటే…. గొప్ప శక్తులు ఒకరి పరిమితులను మరొకరు పరీక్షించుకోవడం ప్రారంభించినప్పుడు, ప్రపంచం సాధారణంగా మూల్యం చెల్లిస్తుందని చరిత్ర మనకు చాలాసార్లు చూపించింది. సంఘటనలు ఓడల నుండి క్షిపణులకు మారిన తర్వాత, ఎవరూ ప్రేక్షకులుగా మిగిలిపోరు.
ఇప్పుడు ఇదంతా అమెరికా, రష్యా మీద ఆధారపడి ఉంది, వారు సరిగ్గా ఆడితే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే జరగబోయేది ఊహకు అందని నష్టం…..
Share this Article