Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డబ్బు పొగరుతో… కనిపించిన ప్రతి ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకున్న చిరంజీవి…

May 19, 2023 by M S R

Bharadwaja Rangavajhala……..   ఇంకో బందరు డైరక్టర్ గురించి….. డెబ్బై దశకంలో తెలుగు తెర మీద ఓ క్రియేటివ్ డైరక్టర్ మెరిసాడు. తీసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే ముద్ర వేశాడు.

ఇప్పటికీ ఆయనేమైపోయాడనే వెతుకులాట సాగుతోందంటేనే ఆయన ప్రభావం ఏమిటో అర్ధమైపోతుంది.

ఇంతకీ ఆ డైరక్టర్ ఎవరనేగా మీ అనుమానం.

Ads

పూర్తి పేరు ఈరంకి పురుషోత్తమ శర్మ.

తెర పేరు మాత్రం ఈరంకి శర్మ.

ఈరంకి శర్మది మచిలీపట్నం.

తండ్రి వెంకటశాస్త్రి, అన్న గోపాలకృష్ణ మూర్తి ఇద్దరూ ఆర్టిస్టులే కావడంతో ఫిఫ్టీస్ లోనే సినీ పరిశ్రమ పబ్లిసిటీ విభాగంలోకి ప్రవేశించారు.

పబ్లిసిటీ ఈరంకి ఆర్ట్స్ అని అప్పట్లో చాలా సినిమాల్లో కనిపిస్తుంది.

శర్మ కూడా అన్నతో పాటు మద్రాసు చేరాడు. ఎమ్వీఎస్ రామారావు చిన్నమ్మ కథతో ఆఫీస్ అసిస్టెంట్ గా జీవితం ప్రారంభించి అసిస్టెంట్ డైరక్టర్ గా ఎదిగాడు.

బాలచందర్ తీసిన అంతులేని కథ తదితరాలకు శర్మ అసిస్టెండ్ డైరక్టరుగా పన్జేశారు .

ఆఫీస్ అసిస్టెంట్ గా సినీ జీవితం ప్రారంభించిన ఈరంకి శర్మ ఆ తర్వాత ఎడిటింగ్ విభాగంలోకి మారారు.

ఎడిటింగ్ విభాగంలో సుమారు నలభై చిత్రాలకు పనిచేశారు.

మనసు మాత్రం డైరక్షన్ మీదే ఉండేది.

ఇంతలో బాలచందర్ దర్శకత్వంలో జెమినీ వారు భలే కోడళ్లు చిత్రం అనౌన్స్ చేశారు.

ఆ సినిమాకు బాలచందర్ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోయారు శర్మ.

ఈ అనుబంధం చాలా కాలమే కొనసాగింది. అంతులేని కథలో జయప్రద లీడ్ రోల్ చేయడానికి కూడా కారణం శర్మే.

బాలచందర్ తో పాటు తాపీ చాణక్య లాంటి డైరక్టర్ల దగ్గర కూడా అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు ఈరంకి శర్మ.

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చేగొండి హరిబాబు నిర్మాణతలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం బంగారు తల్లికి అసిస్టెండ్ డైరక్టర్ గా పనిచేశారు శర్మ.

మదర్ ఇండియా రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి ఆదరణే పొందింది.

బంగారు తల్లి నిర్మాణం సమయంలో నిర్మాత చేగొండి హరిబాబుతో ఏర్పడిన పరిచయం ఈరంకి శర్మ కెరీర్ ను టర్న్ చేసింది.

హరిబాబుతో అనుబంధం చాలా కాలం కొనసాగింది. వీరి కాంబినేషన్ లో దాదాపు మూడు చిత్రాలు రూపుదిద్దుకున్నాయి.

ముఖ్యంగా ఈరంకి శర్మను డైరక్టర్ ను చేసింది చేగొండి హరిబాబే.

సినిమా పేరు చిలకమ్మ చెప్పింది.

బంగారు తల్లి, కృష్ణవేణి సినిమాల తర్వాత చలసాని గోపీ భాగస్వామ్యంలో గోపీకృష్ణా ఇంటర్ నేషనల్స్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న చిలకమ్మ చెప్పింది దర్శకుడుగా ఈరంకి శర్మ తొలి చిత్రం.

బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం నిజల్ నిజమాగిరాతుకు రీమేకే చిలకమ్మ చెప్పింది. నిజానికి ఈ చిత్రం విజయా నాగిరెడ్డి తీయాలనుకున్నారు.

బాలచందర్ బిజీ కావడంతో ఆ అవకాశం ఈరంకి శర్మకు దక్కింది.

తొలి చిత్రం కావడంతో బాలచందర్ పర్యవేక్షణ అని వేసుకున్నారు.

చిలకమ్మ చెప్పింది ఒరిజినల్ తమిళ్ మూవీలో కమల్ హసన్ చేసిన పాత్రను తెలుగులో రజనీకాంత్ చేయడం విశేషం.

ఇది తెలుగులో రజనీకాంత్ చేసిన రెండో చిత్రం. హీరోగా మాత్రం తొలి చిత్రం.

లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని తనను తాను అణచుకునే అమ్మాయి పాత్రలో సంగీత నటించింది. రజనీ సంగీత కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అద్భుతంగా పండాయి.

చిలకమ్మ చెప్పింది తో ఒక మంచి తెలుగు దర్శకుడు దొరికాడని నిర్మాతలు ఆనందించారు.

బాలచందర్ తరహా కథలతోనే కాదు.

బాలచందర్ టెక్నీషియన్స్ తోనే శర్మ సినిమాలూ రూపొందేవి.

శర్మ డైరక్ట్ చేసిన సినిమాలన్నిటికీ ఎమ్మెస్ విశ్వనాథనే సంగీతం అందించారు.

అలాగే మిగిలిన టెక్నీషియన్లూ… బాలచందర్ ప్రభావం ఆ రేంజ్ లో ఉండేది శర్మ గారి మీద.

రంజిత్ మూవీస్ బ్యానర్ మీద సినిమాలు తీస్తున్న రంజిత్ కుమార్ ను చిలకమ్మ చెప్పింది సినిమా ఎట్రాక్ట్ చేసింది.

ఈరంకి శర్మ డైరక్షన్ లో లోబడ్జట్ లో అర్ధవంతమైన సినిమా తీయాలనుకున్నారు.

పెళ్లి కాని ఆడపిల్లను ఈ సంఘం ఎలా వేధిస్తుందో తెలియచెప్పే చిత్రం నాలాగా ఎందరో.

దాదాపు బాలచందర్ తరహా కథ కథనాలతో సాగుతుందీ చిత్రం.

ఈ సినిమాకు ఉత్తమ చిత్రంతో సహా మొత్తం ఎనిమిది నందులు రావడం విశేషం.

నాలాగా ఎందరో అవార్టులతో పాటు కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబట్టింది. ఈ సినిమా తర్వాత శర్మ డైరక్ట్ చేసిన సినిమా కుక్కకాటుకు చెప్పుదెబ్బ.

ఈ సినిమా కూడా శర్మకు మంచి పేరే తెచ్చింది. చిరంజీవితో అప్పటికే బాలచందర్ ఇది కథ కాదు తీసి ఉన్నారు.

దాదాపు అందులో పోషించిన కారక్టర్ తరహాలోనే కుక్కకాటుకు చెప్పు దెబ్బ కూడా సాగుతుంది.

డబ్బులున్నాయనే పొగరుతో కనిపించిన ప్రతి ఆడపిల్ల జీవితంతోనూ చెలగాటాలాడే దుర్మార్గుడిగా చిరంజీవి నటించారు.

నిజానికి ఆ సినిమాలో విలన్ చిరంజీవే.

తను పాడుచేసిన ఓ అమ్మాయి చేతిలో హతమైపోయే పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించడం విశేషం.

అదే చిరంజీవిని ఓ ఉదాత్తపాత్రలో చూపిస్తూ సీతాదేవి తీశారు శర్మ.

సుజాత అన్న పాత్రలో చిరంజీవి మెప్పించారు.

93 ఏళ్ల వయసులో చెన్నై మైలాపూర్ లో కొడుకు దగ్గర ఉంటూ రెండేళ్ల క్రితం కన్నుమూశారు ఈరంకి శర్మ.

సీత హీరోయిన్ గా ఎయిటీస్ లో వచ్చిన అగ్ని పుష్పం దాదాపు శర్మ ఆఖరి చిత్రం.

అది కూడా చేగొండి హరిరామజోగయ్య తీసిన చిత్రమే.

ఆ తర్వాత ఎందుచేతో శర్మ వైపు నిర్మాతలు చూడలేదు.

చిన్న సినిమాకు నిర్మాతల వైపు నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు.

రజనీకాంత్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈరంకి శర్మ చివరి రోజుల్లో మైలాపూర్ లో ఓ అద్దె ఇంట్లో కాలక్షేపం చేశారంటే ఆశ్చర్యమే.

పైగా అప్పటికి విజయ్ టీవీలో పనిచేస్తున్న కొడుకు జీతం మీద ఆధారపడి జీవితం గడపాల్సి రావడం బాధాకరం.

హైద్రాబాద్ ఫిలిం నగర్ ఏర్పాటు సందర్భంలో స్థలం తీసుకోమని చాలా మంది హితులు చెప్పినా శర్మ పెడచెవిన పెట్టారు.

తొమ్మిది పదులు దాటేసిన వయసులో కూడా కుర్ర దర్శకులకు మెళకువలు చెప్పేవారు శర్మ.

అలాగే స్క్రిప్ట్ కరక్షన్స్ చూసేవారు.

చివరి రోజుల్లో కూడా తనలో ఇప్పటికీ దర్శకత్వం వహించాలనే తపన తగ్గలేదనేవారు శర్మ.

2018 ఏప్రిల్ నెల్లో ఆయన కన్నుమూశారు. చెన్నైలోనే అంత్యక్రియలు చేశారు.

అలా మచిలీపట్నంలో మొదలైన ప్రయాణం చెన్నపట్టణంలో ముగిసింది.

వంశీ తొలిచిత్రం మంచుపల్లకి సినిమాకు నిర్మాతలు ముందు అనుకున్న దర్శకుడు ఈరంకి శర్మ.

అయితే కొన్ని ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల వంశీతో చేసేశారు.

ఈరంకి శర్మ దగ్గరకు ఆ మద్య ఓ తెలుగు పేపర్ రిపోర్డరు ఇంటర్యూ కోసం వెడితే మాత్రం ఇంకా నేను తెలుగువాళ్లకి గుర్తున్నానా అని ఆశ్చర్యపోయారట.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions