ఒకడు పెళ్లాం పోరుపడలేక ముసలితల్లిని నగరంలోని ఓ బిజీ సెంటర్ తీసుకెళ్లి, అక్కడ విడిచేసి వస్తాడు… కాటకలిసిపోయిన ముసలిప్రాణం ఏమైందో ఎవడికీ తెలియదు… మరో ముసలితల్లిని మరో కొడుకు స్టోర్‌రూంలో ఉంచితే, స్నానపానాలు లేక, బయటికి వెళ్లేది లేక, చిక్కీ చిక్కీ అక్కడే హరీ అన్నది… ఒకడు స్మశానంలో వదిలేసి వస్తాడు… ఒకడు బండరాయితో మోది హతమారుస్తాడు… ఎన్ని వార్తలు…
ముందే అనుకున్నాం కదా… ప్రపంచంలో మనిషిని మించిన దుర్మార్గ జంతువు లేదు… అనుబంధం ఆత్మీయత అంతా ఓ బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం అని అప్పట్లో ఎవరో సినీకవి అన్నాడు కదా… అక్షరసత్యం… మనిషి తన స్వార్థం కోసం ఎవరినైనా వదులుకోగలడు… పెళ్లయ్యాక మనిషికి ‘మోస్ట్ అన్‌వాంటెడ్ బర్డెన్’’ గా కనిపించేది ఫస్ట్ ముసలి తల్లిదండ్రులే…
మొన్నటి వార్త అనుకుంటా… ‘‘నాగర్‌కర్నూల్ జిల్లా, పెంట్లవెల్లి మండల కేంద్రం… ఆలస్యంగా బయటికి వచ్చింది ఈ క్రైమ్… కేశంపోగుల కృష్ణయ్య, గోవిందమ్మలకు రవితేజ, ఉదయకుమార్ అనే కొడుకులు… ముగ్గురు ఆడపిల్లలు కూడా…
Ads
మంగళవారం ఊళ్లో పెద్ద దేవర్లపండుగ జరిగింది… ఆరోజు మధ్యాహ్నం ఇంట్లో ఏదో విషయంలో చిన్న గొడవ చోటుచేసుకుంది… దాంతో కృష్ణయ్య అలిగి, ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు… వెతగ్గా వెతగ్గా చవుట చెరువు దగ్గర కనిపించాడు… అప్పటికే మద్యం తాగి మంచి కరెంటు మీద ఉన్నాడు… జరిగిందేదో జరిగింది, ఇంటికి పోదాంరా అన్నారు కొడుకులు, ఆయన ససేమిరా అన్నాడు… మళ్లీ కాసేపు గొడవ…
నాకు మద్యం పోయించు, ఇంటికి వస్తాను అంటాడు అప్పటికే కరెంటు మీదున్న తండ్రి, చిరాకెత్తిన కొడుకులు చెరువును ఈ వైపు నుంచి ఆవైపుకు ఈదు, తాగినంత పోయిస్తాం అన్నారు… మత్తులో ఉన్న ఆ తండ్రి సరేనంటూ ఈదడం ప్రారంభించాడు… తాగిన మత్తులో ఉన్నవాడికి స్టామినా ఏముంటుంది..? సగం దూరం పోయేసరికి సత్తువ క్షీణించి మునిగిపోతున్నాడు… ఆ దశలో కాపాడాల్సింది పోయి కొడుకులు వీడియో తీసుకున్నారు ఫోన్‌లో… తరువాత ఏమీ తెలియనట్టు వెళ్లి పండుగ సందడిలో ఖుషీ చేసుకున్నారు…
మరుసటిరోజు సాయంత్రం వరకూ రాకపోవడంతో భర్త ఆచూకీ గురించి గట్టిగా నిలదీసింది కొడుకులను… అప్పుడు ఆ వీడియో చూపించారు కొడుకులు… ఆమె షాక్… నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది… నిజానికి ఇది ఒకరకంగా హత్యే… లీగల్‌గా, టెక్నికల్‌గా కొడుకుల చేతులకు నెత్తురు అంటకపోవచ్చు, కానీ నిజానికి చంపేసింది వాళ్లే… ఈ వార్తను సాక్షి ఎక్కడో జిల్లా పేజీలోనో వేసి చేతులు దులుపుకుంది… ఇందులో మానవీయ కోణం లేదా..? అన్నింటికీ మించి తాగుడు వల్ల దుష్ప్రభావం వివరించే సామాజిక ప్రయోజనం లేదా..? ఎందుకంత నిరాసక్తత..? ప్చ్, మీడియాలో పెరుగుతున్న ఈ ఇన్‌సెన్సిటివిటీని ఏమనాలి..? అదీ ఆ కొడుకుల వీడియోలాంటిదే…!!
Share this Article