అదేదో పాత సినిమా… పెళ్లికి అందరినీ పిలిచి, వాళ్ల సమక్షంలో ఎలా ఒక్కటయ్యామో… అదేరకంగా విడాకులకు కూడా అందరినీ పిలిచి, అందరికీ చెప్పి, అందరి సాక్షిగా విడిపోదాం అని హీరోయిన్ వాదించి, ఒప్పించి, ఫంక్షన్ పెడుతుంది… ఇంట్రస్టింగు పాయింట్… పొద్దున్నే ఈనాడులో ఓ వార్త చదివాక అదే గుర్తొచ్చింది…
ఆ వార్త ఏమిటంటే..? జార్ఖండ్, రాంచీలో ప్రేమ్ గుప్తా అనే ఓ తండ్రి… గత ఏడాది ఏప్రిల్‌లో తన బిడ్డ సాక్షి గుప్తాకు ఉన్నంతలో బాగా ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు… అల్లుడి పేరు సచిన్ కుమార్… తీరా పెళ్లయ్యాక కొన్నాళ్లకు ఆమెకు వేధింపులు మొదలయ్యాయి… పైగా అంతకుముందే తనకు పెళ్లయిందనీ తెలిసింది…
ఐనాసరే, పెళ్లయిపోయింది కదా, ఇప్పుడేం చేయగలం..? ముందే తెలిస్తే బాగుండేది, ఏదో సర్దుకుపోవడమే అనుకున్నాడు ఆ తండ్రి, బిడ్డ కూడా అలాగే అనుకుంది… ఇక వీళ్లతో ప్రాబ్లం లేదనుకున్న అల్లుడు ఇంకా రెచ్చిపోయాడు… ఆమె భరించలేకపోయింది… ఏదైతే అదైంది, వీడితో తెగతెంపులే బెటర్, అవసరమైతే జీవితాంతం ఒంటరిగా ఉంటాను అనుకుని, తండ్రికి తన నిర్ణయం చెప్పింది…
Ads
ఆ తండ్రి మందలించలేదు, అక్కడే ఎలాగోలా బతికెయ్ అని చెప్పలేదు… కుటుంబసభ్యులందరికీ చెప్పాడు… ఆ వేధింపుల భర్తను వదిలేయడమే బెటర్, ఎప్పుడైనా తిక్కరేగి సాక్షిని ఏమైనా చేసే ప్రమాదం కూడా ఉందని అందరూ ఆమె విడాకుల నిర్ణయాన్ని సమర్థించారు, స్వాగతించారు… ఐతే రహస్యంగా ఎందుకు వచ్చేయడం..? మనం ఏదో తప్పుచేసినట్టు..? అసలు తప్పు ఆ అల్లుడిది, ఐనా విడాకులు తీసుకోవడం ఏమైనా నేరమా..? అనుకున్నారు ఆ కుటుంబసభ్యులు…
ఇంకేముంది..? టైమ్ చూసి, నీకు పెద్ద దండంరా బాబూ, మళ్లీ నా జీవితంలోకి రాకు, మర్యాద దక్కదు అని చెప్పేసింది ఆమె… టపాసులు కాలుస్తూ, మేళతాళాలతో, ఊరేగింపు తీసి మరీ ఆమెకు తిరిగి పుట్టింట్లోకి స్వాగతం పలికారు ఆ కుటుంబసభ్యులు… ఆడ పిల్లకు కుటుంబం మద్దతు, గౌరవం ఇలా ఉండాలని ఆ చుట్టుపక్కల వారూ అనుకున్నారు… ఆమె విడాకులకు కోర్టులో కేసు దాఖలు చేసింది… ఈ వార్త ఇక్కడితో సమాప్తం…
https://fb.watch/nLkpqb_nPr/?mibextid=Nif5oz
నిజమే కదా… ఆ తండ్రి అభిప్రాయం సరైనదే అనిపిస్తోంది… ఒకసారి అల్లుడు మంచివాడు కాదని తెలిశాక, ఇక ఆ కాపురం చక్కబడే సిట్యుయేషన్ కనిపించక, పైగా రాబోయే రోజుల్లో వాడేం చేస్తాడో తెలియని స్థితిలో ఎంచక్కా పెళ్లిచేసి ఎలా పంపించాడో, అలాగే కాలరెగరేసి, మరోరకం బారాత్‌తో (అంటే గుడ్‌బై బారాత్, డైవోర్స్ బారాత్) అట్టహాసంగా తన ఇంటికి తెచ్చేసుకున్నాడు… బిడ్డా, నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చాడు…
అవును, మగబిడ్డలాగే ఆడబిడ్డ కూడా… ఇద్దరూ బిడ్డలే కదా… ఒక్క ఆడబిడ్డనే గుదిబండగా భావిస్తే ఎలా..? ఇంకేదో పెద్ద నష్టం జరిగాక ఏడ్చే బదులు, వాడు కట్టిన పుస్తెను వాడి మొహాన కొట్టి, ఇంటికి తెచ్చేసుకోవడం బెటరే కదా… ఈనెల 15న జరిగిన ఈ విడాకుల ఊరేగింపును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ తండ్రి… గుడ్… విడాకులు మంజూరీ కాగానే బంధు, మిత్రగణానికి విందు కూడా ఏర్పాటు చేస్తాడేమో…!!
Share this Article