ఈమధ్య కొన్ని ఆసక్తి కలిగించే కేసులు పోలీసుల వద్దకు వస్తున్నయ్, వింటున్నం, చదువుతున్నం కదా… పైపైన చదివితే ఇదీ అలాగే అనిపిస్తుంది… కానీ దీంట్లో మనకు మనస్సు చివుక్కుమనిపించే అంశం ఉంది… ముందుగా విషయం చెప్పుకుందాం… బెంగాల్లో బిర్భూమ్ (వీరభూమ్) అనే ఓ పల్లెటూరు… అక్కడ భుబన్ బద్యాకర్ (భువన్) ఓ వీథివర్తకుడు… పచ్చి పల్లికాయ (వేరుశెనగ)ను హోల్‌సేల్‌గా కొనుక్కుని, తేలికపాటి మోపెడ్‌పై వేసుకుని ఊళ్లు తిరుగుతూ అమ్ముకుంటూ ఉంటాడు… డబ్బుల్లేకపోతే విరిగిపోయిన సెల్ఫోన్లు, వాడకుండా పక్కన పడేసిన గిల్టు పట్టీలు, జూకాలు గట్రా తీసుకుని కూడా పల్లీలు ఇచ్చేస్తుంటాడు…
పల్లీలమ్మా పల్లీలు అని అరుస్తూ తిరగకుండా… సొంతంగా ఓ పాట కట్టాడు, అంటే ఓ మంచి ట్యూన్ క్రియేట్ చేశాడు… అందులోనే ‘‘పల్లీలమ్మా పల్లీలు, పచ్చి పల్లీలు, వేయించినవి కావు, ఉడికించినవి కావు.., సెల్ ఫోన్ ఉందా సరే సరే, కాళ్ల పట్టీలున్నయా సరే సరే, నమ్మండమ్మా ఇవి పచ్చి పల్లీలు’’ అనే అర్థమొచ్చేలా పదాలు పేర్చి పాడుతూ జనాన్ని పిలిచేవాడు… ఏదో తన వృత్తి, తన కడుపు కోసం తన్లాట… సరే, బాగుంది… ఈ పాట రిథమ్ బాగుండి, ఎవరో ఓ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రికార్డ్ చేసి, పోస్ట్ చేశాడు… మనకు తెలుసు కదా కొన్నిసార్లు కొన్ని పాటలు హఠాత్తుగా వైరల్ అయిపోతుంటయ్… అందులో భావంతో పనిలేదు…
Ads
ఆ రిథమ్ పట్టేసుకుంటుంది మనల్ని… అప్పుడప్పుడూ కొన్ని తెలుగుపాటలు ఇలాగే తెగ వైరల్ అయిపోతుంటయ్ చూస్తున్నాం కదా… అలాగే ఈ పల్లీల పాట (బాదమ్ దాదా బాదమ్ కచ్చా బాదమ్) కూడా ఒక్కసారిగా హల్చల్ క్రియేట్ చేసింది… అదే పాటను బోలెడు మంది యూట్యూబ్, రీల్ వీడియోలు చేసేసి వైరల్ చేసుకున్నారు… ఎక్కడ చూసినా ఇదే సాంగ్… కొందరు రీమిక్స్ చేశారు… ఒక రీమిక్స్ వీడియోకు పదిలక్షల వ్యూస్… కొన్నింట్లో యానిమేషన్ యాడ్ చేశారు… ఒకటీరెండు వీడియోల్లోకి ఫన్ కోసం సీఎం మమతను కూడా తీసుకొచ్చేశారు… తనకొచ్చిన పేరుతో, సెలబ్రిటీ హోదాతో భువన్ హేపీగా ఏమీ లేడు… చిరాకెత్తుతోంది తనకు… ఎందుకంటే..?
ఎవరెవరో ఇంటికొస్తున్నారు, పాడు పాడు అంటున్నారు, రికార్డ్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, దాన్ని రకరకాలుగా రీమిక్స్ చేసి, మిలియన్ల వ్యూస్ పొంది లక్షలు సంపాదిస్తున్నారు, నాకేం ఒరిగింది, ఖాళీ చేతులు తప్ప అంటున్నాడు… కొందరు ప్రబుద్ధులైతే ఏకంగా ఆ పాటకు పేటెంట్ హక్కులు మావే అని వాదిస్తున్నారట తమ వీడియోల్లో… నిజమే కదా మరి… అందరూ వాడేసుకునేవాళ్లే తప్ప ఒక్కడూ రూపాయి ఇవ్వలేదు… నిజానికి పాటకు హోల్‌సేల్ సొంతదారు భువనే… దాంతో దుబ్రాజ్పూర్ పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టేశాడు… ఆ వీడియోలన్నీ తీసేయించాలి, అందరి మీద చర్యలు తీసుకోవాలి అని కేసు… #Isupportbhuban, #badamdadabadam వెంటనే బీజేపీ ఎమ్మెల్యే అనూప్ సాహా తన ఇంటికి వెళ్లి సర్కారు సాయం వచ్చేలా చేస్తాను బ్రదర్ అని హామీ ఇచ్చాడు… హామీయే కదా… దాందేముంది ఇచ్చేస్తే పోలా… ఆ వెంటనే టీఎంసీ నేతలు వెళ్లి, మేమున్నాం బ్రదర్ అని భుజం తట్టారు… సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది కానీ జేబులోకి రూపాయి రాలేదు, ఈ హడావుడి లేకపోతే నాలుగు ఊళ్లు తిరిగి, కాసిన్ని పల్లికాయలు అమ్ముకునేవాడిని కదా అని బాధపడుతున్నాడు… అంతే కదా మరి…!!
Share this Article