టోల్ అన్న మాట ఇంగ్లీషులో ఎలా పుట్టింది అని చర్చించడానికి ఇది ఇంగ్లీషు భాషోత్పత్తి శాస్త్ర పాఠం కాదు.
noun:-
1. a charge payable to use a bridge or road.
2. the number of deaths or casualties arising from a natural disaster, conflict, accident, etc.
Ads
verb:-
charge a toll for the use of (a bridge or road).
నామవాచకంగా అయితే టోల్ గేట్ దగ్గర వసూలు చేసే సొమ్ము అని ఒక అర్థం. ఏదయినా ప్రమాదాల్లో, ఉపద్రవాల్లో మృతుల సంఖ్య అని టోల్ కు రెండో అర్థం. అదే టోల్ క్రియా పదంగా కూడా పనిచేస్తుంది అని తెలుసుకుంటే చాలు. ఇంతకంటే టోల్ భాషా పరిజ్ఞానం టోల్ గేట్ల దగ్గర పనిచేయదు. టోల్ గేట్ల దగ్గర కండబలం, కర్ర పెత్తనం, మొండితనం, బండతనం పనిచేస్తే పనిచేయవచ్చు కానీ- టోల్ విషయ పరిజ్ఞానం ఎంతమాత్రం పనిచేయదు.
నా వృత్తిలో భాగంగా హైదరాబాద్- విజయవాడ మధ్య నిరంతరాయంగా తిరుగుతూ ఉండాలి. హైదరాబాద్- విజయవాడ మధ్య విమాన ప్రయాణం కంటే కాలినడకన త్వరగా చేరుకోవచ్చు అన్న ఎరుక మొదట్లోనే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. బస్సులు, రైళ్లు కొంత నయం. దాదాపుగా నాది కారు ప్రయాణం. పంతంగి నుండి కీసర దాకా వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు నాలుగు టోల్ గేట్ల దగ్గర నాకు కలిగిన అనుభవాలే అందరికీ కలగాలని నేను కోరుకోవడం లేదు.
భారత రాష్ట్రపతితో మొదలుపెట్టి ఎవరెవరికి టోల్ మినహాయింపు ఉందో కిలోమీటరు ముందునుండే బోర్డులు గుడ్డివారికి సైతం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ లిస్టులో నేను లేను. ఈ జన్మకు ఉండాలని కోరుకోవడం లేదు. టోల్ గేట్లు ఉన్న రోడ్లమీద తిరిగినా తిరగకపోయినా కారున్న ప్రతివారు ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే కాబట్టి ముందుగానే మనం భారత ప్రభుత్వ ఉపరితల రవాణా శాఖ ఆధ్వర్యంలోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు పూర్వజన్మల్లో రుణపడి ఉన్న డబ్బు కట్టి ఉంటాం. ఫాస్ట్ ట్యాగ్ ఉంటే టోల్ గేట్లలో నిరీక్షణ తప్పుతుందన్న భ్రమ కల్పించారు. ఇప్పటిదాకా ఒక్కసారయినా నాలుగు టోల్ గేట్లలో ఫాస్ట్ ట్యాగ్ పనిచేసి నిరీక్షణ తప్పిన సందర్భం నాకు ఎదురు కాలేదు.
టోల్ గేట్ల దగ్గర వాతావరణం, అక్కడి సిబ్బంది బాడీ లాంగ్వేజ్, వారి నోటి భాష మీద నాకు అనేక అభ్యంతరాలు, భయాలు ఉన్నాయి. భారత రాష్ట్రపతినయినా నేను ధిక్కరించి, నా చేతి కర్రతో నిలువరించగలను అనే అంతులేని అజ్ఞానంతో కూడిన కండబలం వల్ల వచ్చిన మూర్ఖత్వం మూర్తీభవించిన మనుషులు అక్కడ కాపలాగా ఉంటారు. మనం అప్పుడే అయిదు బ్యాంకులు కొల్లగొట్టి, పది ప్రమాదాలు చేసి, పాతిక మర్డర్లు చేసి తప్పించుకుని పారిపోతున్న కరడుగట్టిన ప్రొఫెషనల్ నేరస్థుల్లా వారి కంటికి కనపడతాం. వాడి చేతి దుడ్డు కర్రతో సకల వాహన ప్రపంచాన్ని శాసించగలుగుతాడు. ఫాస్ట్ ట్యాగ్ ఉంది కదా? అయినా మ్యానువల్ గా పంపుతున్నారెందుకు? అని నేను చాలాసార్లు ప్రశ్నించాను. మ్యానువల్ గా వెళ్లకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాల్సి ఉంటుందన్న కరకు సమాధానంతో నా దారిన నేను వెళ్లిపోతుంటాను. యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నవారికి క్షమాభిక్ష పెట్టి మధ్యలో వదిలేస్తున్నంత దయతో వాడు దయదలిస్తే ఒక్కో వాహనం టోల్ దాటి బయటపడుతూ ఉంటుంది.
టోల్ ఎంతకాలం కట్టాలి? అన్నది అర్థరహితమయిన ప్రశ్న. రోడ్డు అశాశ్వతం. టోల్ గేటే శాశ్వతం అన్న టోల్ జ్ఞానం ఉంటే చాలు. వేసిన రోడ్డు పొడవు, వెడల్పు ఎంత? దానికయిన ఖర్చు ఎంత? వసూలయ్యే టోల్ రుసుము మొత్తం ఎంత? ఎన్ని యుగాలు మనం టోల్ కడితే- ఆ రోడ్డుకయిన ఖర్చుతో సమానం? అన్నవి ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ మళ్లీ పుట్టినా చెప్పలేని టోల్ ఇన్ఫినిటీ నంబర్ లెక్కలు.
1990 ప్రాంతాల్లో నా జీతం నెలకు ఎనిమిది వందలు. తరువాత పద్నాలుగు వందలు. ఆపై చాలాకాలం నాలుగు వేల అయిదు వందలు. పిఎఫ్ , ఈఎస్ఐ పోను చేతికి నాలుగు వేల వంద రూపాయలు వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్- విజయవాడ రాకపోకలకు నెలకు అయిదు వేల రూపాయలవుతోంది. సంవత్సరానికి అరవై వేలు. పదేళ్లకు ఆరు లక్షలు. 1998 లో పది లక్షలు పెడితే అద్భుతమయిన అపార్ట్ మెంట్ వచ్చింది. ఈ లెక్కన హైదరాబాద్- విజయవాడ రహదారిమీద నా హక్కు ఎంత? నా వాటా ఎంత? అన్నది జిఎమ్మార్ వారు చెబుతారా? హైవే అథారిటీ వారు చెబుతారా? ఉపరితల శాఖ చెబుతుందా?
టోల్ ట్యాక్స్ కట్టినందుకు ఏయే సేవలకు మనం అర్హులమో చెబుతూ నమస్తే తెలంగాణ ఒక వార్త ప్రచురించింది. నిజమే. పన్నులు కడుతున్నప్పుడు మనకు ఆ సేవలు పొందే హక్కు ఉంటుంది. అయితే- ఈ వార్తలో చెప్పినట్లు టోల్ గేట్ల వారినుండి ఈ సేవలు పొందినవారెవరయినా ఉంటే చెప్పండి. వారిని దర్శించుకుని ధన్యుడిని అవుతాను. లేదా ఈ సేవలను టోల్ గేట్ల నుండి ఇక బేషరతుగా పొందుతాం అని చెప్పగలిగిన వారుంటే చెప్పండి. వారి ధైర్యాన్ని అభినందిస్తాను.
పెద్దలతో పనిచేస్తున్నా నేను ఎంత చిన్నవాడినో నాకు క్లారిటీ ఉంది. అప్పుడప్పుడు పెద్దలతో ప్రయాణిస్తుంటాను. వారికి కుడి ఎడమల ముందు వెనుక గన్లు ఉంటాయి. గన్ మెన్లు ఉంటారు. టోల్ గేట్ కాపలావాడి కర్ర కంటే తుపాకీ గొప్పది కాబట్టి ఆ సమయాల్లో వాడు మారు మాట్లాడకుండా, వాహనాన్ని ఆపకుండా పంపుతూ ఉంటాడు. ప్రజాస్వామ్యంలో ఉన్న లోగుట్టు, బ్యూటీ అదే. తుపాకీ దగ్గర అన్ని చట్టాలు, న్యాయాలు, ధర్మాలు ఆగిపోతాయి! లేదా వివిఐపి స్టిక్కర్ బండికి ఉండాలి.
ఒకసారి ఆ భాగ్యం కూడా నాకు కలిగింది. నాలాగే అతనో వ్యాపారి. ఒక ప్రజాప్రతినిధి స్టిక్కర్ కారు అద్దానికి ఉంది. ఆ ప్రయాణమంతా ఆ ప్రతినిధికి ఇతను ఎలా బంధువో ఆరా తీయడానికే సరిపోయింది. ప్రతినిధి చిన్నాన్న కూతురు, ఇతని భార్య అన్నదమ్ముల పిల్లలు. వేలువిడిచిన మేనమామ కాలుగడిగిన అసలుమామ తోకతొక్కిన తాచుపాము బీరకాయ పీచుకు పొట్లకాయ పాదుకు పూచిన వెర్రి వేపకాయ చుట్టరికమేదో తనకు తెలిసిన భాషలో చెప్పాడు కానీ- పేపర్ మీద వరుసగా రాసుకున్నా ఇప్పటికీ ప్రతినిధికి- ఇతడికి చుట్టరికమేమిటో కనుక్కోలేకపోయాను. ఇక కనుక్కునే ఉద్దేశమూ లేదు.
రహదారులు మన నాగరికతకు చిహ్నాలు.
అందులో అంతర్భాగమయిన టోల్ గేట్లు కూడా మన నాగరికతకు నిలువెత్తు చిహ్నాలు!
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article