Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇచ్చట వానపాములకు చేపల్ని ఎర వేస్తారు… కాదంటే మర్యాద దక్కదు…

December 8, 2022 by Rishi

గద్దలను కొట్టి కాకులకు పెట్టుటనే సంక్షేమరాజ్య విధానమందురు. ఇచట దొరికిన వాడే మేకకు గడ్డిగా మారు పులి. ఇచట చేపలను ఎరగా వానపాములకు వేస్తారు…!

స్వచ్ఛభారత్ ఏడేళ్ల క్రితమే పురుడు పోసుకున్నా, కానుపు ఇంకో డెబ్బయ్యేళ్లైనా జరగదు.



పావుగంట సాధన చేస్తే యేసుదాసును మించిన గాయకుణ్ని చేస్తానని నత్తివాడిని ఏలినవారు నమ్మిస్తారు. యేసుదాసును సాధన మానుకొమ్మని ఉత్తర్వులు జారీ చేస్తారు. ధిక్కరిస్తే సమన్యాయం అంటూ యేడు ఊచలు లెఖ్క పెట్టిస్తారు…!

రైతు బజార్లో ప్రభుత్వం వారు ఉల్లిగడ్డల్ని రేషన్ లో అమ్ముతారు. ఆధార్ కార్డు మాండేటరీ. రైతులు స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ గా అభివృద్ధి చెందుతారు. మెట్రో కోసం రోడ్లను తవ్వేస్తారు. పాలు ప్యాకెట్ల నుండి వస్తాయని దున్నపోతు వ్యవస్థ పిల్లలకు నేర్పిస్తుంది..!



అమెరికా సామ్రాట్టులు చెప్పారని 1980 లలో గంజాయిని నిషేధిస్తారు. ఆ ప్రభువులే చెప్పారని పరిమిత వినియోగానికి పరిమితులిస్తారు. ఆ గంజాయిని వాడేవాళ్లను శివసేన అధికారంలో ఉన్నచోట కంగనా కిచకిచలాడిందని, అర్ణబ్ అరిచాడని లోపలేస్తారు. ఉత్తరప్రదేశ్ లో అదే గంజాయి పీలుస్తున్న సాధుసంత్ మహరాజులను పైకిమోస్తారు. జీయెస్టీ, ఇతరపన్నులతో కుర్రకుంకలకు గంజాయిని సరఫరా చేయబోయే శుభతరుణాలు త్వరలో రాబోతున్నాయి..!

మన భారతావని రెండు పార్టీల వ్యవస్థగా మారబోతోంది. అధికారంలో బీజేపీ, ప్రతిపక్షంగా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ శాశ్వతంగా స్థిరపడబోతున్నాయి. విజయశాంతి ఇకపై పార్టీ మారకపోవచ్చు. అన్యమతాల వివాహాలు రద్దవుతున్నట్టే అన్యకులాల వివాహాలు కూడా రద్దు కావచ్చు…!

Ads



దక్షిణ భారతదేశంలో ముందుముందు రాబోయే అసంతృప్తిని ఉత్తర భారత దేశం మందబలంతో ఆణచివేయవచ్చు. ఇక్కడి పన్నులతో అక్కడి షోకులు ఇంకా పెరుగుతాయి. తద్వారా చరిత్ర పునరావృతం కాబోతోంది. నెహ్రూ, ఇందిరల భారతరత్న పురస్కారాలను కేంద్రం వెనక్కి తీసుకోవచ్చు. సాహిత్య, నాటక, విద్యా సంస్థల్లో వామపక్ష భావజాలం మెల్లమెల్లగా అంతరిస్తుంది..!

లీటరు పెట్రోలు ఐదువందలకూ; క్వార్టరు మందు ఆరువందలకూ అమ్ముతూ ఉచిత కరెంటూ; రూపాయక్కిలో బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. నాణ్యమైన విద్యా వైద్యాలకోసం ప్రభుత్వ పాఠశాలలూ, ఆసుపత్రులూ మూసివేయబడతాయి..!



ఉచిత గొర్రెల పంపిణీ పథకం ద్వారా కిలో మటన్ వెయ్యి రూపాయలకు దొరుకుతుంది..!

వెనిజులా ఇండియా భాయీభాయీ అంటారు. రామరాజ్యం స్థాపిస్తామంటూ, శ్రీలంక వైపు అడుగులేస్తారు..!

అమ్మో ఒకటో తారీఖనే నిట్టూర్పు మాట గతస్మృతి అవుతుంది. ఏదో ఒక తారీఖున జీతమొస్తే చాలు దైవమా అంటూ ఉద్యోగులు ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తారు…!



NPA GDP కన్నా పెద్దదై ప్రభువుల హయాంలో శకుని నవ్వును విసర్జిస్తుంది..! విస్సన్నపేటని వింబుల్డన్ గా అభివృద్ధి చేస్తామంటూ నమ్మబలుకుతారు. కేత్లావత్ నాయక్ తాండా దాకా మెట్రో కొనసాగిస్తామంటారు..!

స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా లో మాదిరిగా రైతుకు ప్రభుత్వం పూర్తి భరోసాగా ఉంటుంది. రైతుకు కొత్త చట్టం వల్ల గరిష్ఠ మద్దతు ధర సులాగ్గా వస్తుంది. రైతులు ప్రభుత్వబంధు పథకం మొదలెడతారు..!

ఆ తర్వాత కాంబోడియా కి వెడతారు..!

అచ్ఛేదిన్ వస్తాయి..!

#ఎఫ్బీమెమొరీ

— By….. Gottimukkala Kamalakar

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions