Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

విజయనగర సామ్రాజ్య వైభవోజ్వల కీర్తి పతాక… హంపి (పార్ట్-1)

February 12, 2023 by M S R

History- Hampi: విజయనగర సామ్రాజ్య వైభవోజ్వల కీర్తి పతాక హంపీ తెలియనివారుండరు. విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో పెనుకొండ కోశాధికారి విరుపణ్ణ పర్యవేక్షణలో నిర్మితమయిన లేపాక్షి ఒడిలో పాతికేళ్ళపాటు పెరిగినవాడిని. లేపాక్షిలో మాట్లాడే రాళ్లు, నడిచే రాళ్లు, వేలాడే రాళ్లు, పాడే రాళ్లు, ఆడే రాళ్లు, వెంటాడే రాళ్ల మధ్య తిరుగుతూ పెరిగినవాడిని. అలాంటి లేపాక్షి సృష్టికర్త అయిన విజయనగరం- హంపిని చాలా ఆలస్యంగా చూసినందుకు సిగ్గుపడుతూ… యాభై మూడేళ్ల వయసులో మొన్న తొలిసారి హంపీకి వెళ్లాను.

విజయనగర రాజుల చరిత్ర, హంపీ వైభవం గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల నిండా అనంతమయిన సమాచారం ఉంది. హంపీని చూసిన నా ఆనందానికి, ఆశ్చర్యానికి, తన్మయత్వానికి మాటలు చాలవు. ఊహ తెలిసినప్పటినుండి హంపీ ప్రేమలో పడడానికి మా లేపాక్షి శిల్ప కళ; మా నాన్న నాకిచ్చిన ఈ పుస్తకాలు కారణం.

Ads

1. హంపీ క్షేత్రం (కొడాలి వేంకటసుబ్బా రావు)
2. పెనుకొండ లక్ష్మి(పుట్టపర్తి నారాయణాచార్యులు)
3. మేఘదూతం(పుట్టపర్తి నారాయణాచార్యులు)
4. రాయలనాటి రసికత(రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ)
5. రాయలనాటి రసికతా జీవనము(పుట్టపర్తి నారాయణాచార్యులు)

ఇవికాక తరువాత టూకీగా చదివిన తిరుమల రామచంద్ర ‘హంపీ నుండి హరప్పా దాకా’, ‘కృష్ణదేవరాయలు’ అనువాద గ్రంథం ఇతర పుస్తకాలు మరింత ఆసక్తిని పెంచాయి.

కొడాలి, పుట్టపర్తి, రాళ్లపల్లి, విశ్వనాథ లాంటి తెలుగు సాహితీ మేరునగధీరులు హంపీ గురించి చెప్పిన కథనాల ముందు…నాలాంటి వారు హంపీ గురించి చెబితే సూర్యుడి ముందు దివిటీ పెట్టినట్లు ఉంటుంది. వారి స్థాయి భావనా పటిమ, భాషా నైపుణ్యం, అనేక చారిత్రిక గ్రంథాల అధ్యయనం నాకు లేదు కాబట్టి…వారి కళ్లతోనే నేను హంపీని చూశాను. వారు అక్షరీకరించిన క్రమంలోనే హంపీలో తిరిగాను. వారేమి చెప్పారో అదే చెప్తాను. ఇందులో మెరుపులు ఉంటే వారివి; లోపాలు ఉంటే నావి.

Hampi Kshetram

తారీఖులు, దస్తావేజుల మీద నాకంత శ్రద్ధ లేదు. ఎప్పుడో ముప్పయ్ ఏళ్ల కింద పోటీ పరీక్షలకు చదివిన చరిత్రే తప్ప… తరువాత అంత తదేకంగా చరిత్ర పుస్తకాలు చదవలేదు. కాబట్టి తెలుగు సాహిత్యంలో వెలుగుతున్న హంపీ నాకు ఎలా కనిపించింది అన్న విషయానికే పరిమితమవుతాను. ఇందులో కొన్ని తేదీలు, ప్రస్తావనలు, సంఘటనలు అటు ఇటు ఉండవచ్చు. నాది సాహితీ దృష్టి కాబట్టి…ఇందులో ఎక్కడయినా చరిత్ర తడబడితే క్షమించగలరు.

ఒక్క వ్యాసంలో హంపీ ఒదగదు. కాబట్టి ఒక సీరియల్ లా అనేక భాగాలతో రాయదలుచుకున్నాను. ఏ రెఫెరెన్స్ ఎక్కడి నుండీ తీసుకున్నానో ఎక్కడికక్కడే చెప్తాను. కొడాలి, పుట్టపర్తి లాంటి పెద్దల పద్యాలు ఈతరానికి నేరుగా అర్థం కావు కాబట్టి వారి హృదయాన్ని వచనంలో నాకు అర్థమయినంతవరకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఆ పద్యాలు తెలియాలి కాబట్టి సందర్భాన్ని బట్టి యథాతథంగా పేర్కొంటాను.

Hampi Kshetram

అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా చూస్తున్న హంపీ గొప్పదో? అక్కడికి వెళ్లకుండానే ‘హంపీ క్షేత్రం’ కావ్యంలో కొడాలి అక్షరాలతో ఆవిష్కరించి…చూపించిన హంపీ గొప్పదో? తేల్చుకోలేని ఉక్కిరి బిక్కిరి నాది. తెలుగులో హంపీ గురించి ఇంకే రచన కొడాలి దరిదాపుల్లోకి కూడా రాలేదు. 1904 లో పుట్టిన కొడాలి 1932 లో మరణించారు. బతికిన 28ఏళ్ల కాలంలో ఒక మెరుపులా వెలిగారు. తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. మచిలీపట్నంలో విద్యార్థిగా ఉండగా కాలేజీ హాస్టల్ పిల్లలకు బయటివారికి మధ్య గొడవయితే…మడత మంచం ఇనుప చువ్వ చేతబట్టి…హాస్టల్ గేటు మూసి…నాలుగు వందల మంది రౌడీలను అడ్డుకున్న ఒకే ఒక్కడు కొడాలి అని విశ్వనాథ సత్యనారాయణ పొంగిపోయి ప్రశంసగా ప్రత్యేకంగా హంపీ క్షేత్రం ముందుమాటలో చెప్పారు.

తనమానాన తను సంధులు, సమాసాలు చెప్పుకునే సగటు పరమ సాత్విక పంతులు కాదు కొడాలి; కండబలం, గుండె బలం కల గట్టి మనిషి కాబట్టే…విజయనగర రాజుల కత్తి పదునులో తనను తాను ఊహించుకుని రాసిన కావ్యం హంపీ క్షేత్రం అని విశ్వనాథ అనన్యసామాన్యమయిన సర్టిఫికెట్ ఇచ్చారు. అలాంటి హంపీ క్షేత్రం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని…కొడాలి ఎక్కడ ఏమి చెప్పారో…అక్కడ ఆ పద్యాలను చదువుకుంటూ…హంపీ తిరిగాను. మిమ్మల్ను కూడా అలా నా వెంట హంపీకి తీసుకెళ్లాలని నా ప్రయత్నం. పదండి పోదాం రాళ్లు నోళ్లు విప్పి తమ చరిత్రను తామే చెప్పుకునే విజయనగర వీధుల్లోకి. విజయనగర కీర్తి పతాక ఎగసిన విను వీధుల్లోకి.

రేపు:-
హంపీ వైభవం-2
“శిలలు ద్రవించి ఏడ్చినవి”

-పమిడికాల్వ మధుసూదన్… 99890 90018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions