((Sivaram Prasad Bikkina….)) మేము ఎదుర్కొన్నామండీ ఈ సమస్య. మీరు కావాలంటే ఈ సమాచారం షేర్ చేయొచ్చు కూడా.! మా సమీప బంధువుల అమ్మాయికి డెలివరీ ముందు రెగ్యులర్ గా చూసే గైనకాలజిస్ట్ కాజువల్ గా చేయించిన రాపిడ్ టెస్ట్ తో కొవిడ్ పాజిటివ్. డెలివరీ చేయను పొమ్మంది. జిల్లా అంతా ఎంక్వయిరీ చేస్తే… ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి తప్ప ఎక్కడా కొవిడ్ పాజిటివ్ లేడీకి డెలివరీ చేయొద్దని ప్రభుత్వం నిబంధనలు పెట్టినట్టు తేల్చారు.
ప్రభుత్వాసుపత్రి ప్రసవం అంటేనే భయం పట్టుకుంది అమ్మాయికి. భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతను ఎంతైనా పెట్టుకుంటా ప్రత్యామ్నాయ ఏర్పాటు చూడమంటే… ఒక డాక్టర్ మిత్రుని ద్వారా సంప్రదిస్తే ఒక ప్రయివేటు ఆసుపత్రిలో సిజేరియన్ చేస్తాం… ఏ బిల్లూ… సంతకాలూ… రిపోర్ట్ లూ ఉండవు… 5 లక్షలు మినిమం అనుకుని రమ్మన్నారు.
బిల్ పెరగొచ్చు తప్ప తగ్గదన్నారు. మోనోక్లోనల్ కాక్ టైల్ ఇంజెక్షన్ కే ఒక లక్ష అవుతుందని హడావుడి మొదలు పెట్టేసారు. ఎప్పుడొస్తున్నారంటూ హడావుడి? అమ్మాయిలో ఎటువంటి అనారోగ్య లక్షణాలూ లేవు. ప్రయివేటు ఆసుపత్రిలో చేరేందుకే సిద్దపడి, ఎందుకైనా మంచిదని ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇచ్చి 24 గంటలు వెయిట్ చేసాం. డెలివరీకి నాలుగు రోజుల టైం ఉంది కాబట్టి ఆగగలిగాం. బై గాడ్ గ్రేస్ …. నెగిటివ్ వచ్చింది టెస్ట్.
Ads
మొదటి గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి ఈ రిపోర్ట్ చూపిస్తే… అప్పుడు… ఇదేంటీ… ఇదేంటీ… అంటూ ముక్కీ… మూలిగీ జాయిన్ చేసుకుని మూడురోజుల తరవాత సిజేరియన్ చేసింది. ఇప్పుడు తల్లీ బిడ్డా క్షేమం. మూడునెలలు అవుతోంది ఇది జరిగి… మెడికల్ మాఫియా ఎంత బలమైనదో నాకు ప్రత్యక్షంగా అనుభవం అయ్యింది ఆ ఘటనతో.
అంతకు ముందు 12 సంవత్సరాలు ప్రముఖ చానల్లో జిల్లా స్థాయి జర్నలిస్ట్ గా ఉన్నా నాకు తెలవలేదు. దాంతో రెండేళ్ళ క్రితం మా నాన్నగార్కి జరిగిన హార్ట్, బ్రెయిన్, ఊపిరితిత్తుల వరస ఆపరేషన్లపై… అనంతర వైద్యంపై నాకు అనేక అనుమానాలు ముసురుకున్నాయి ఇప్పుడు. మా కుటుంబం సర్వనాశనం అయ్యింది. మా నాన్నగారు మంచాన పడగా… మేం అందరం మానసికంగా … పరిస్థితుల ప్రభావంతో వచ్చే ఇతర సమస్యలతో సఫరౌతున్నాం.
గత రెండేళ్ళలో వైద్యపరంగా నేను పడ్డ నరకం నాకు ఆ రంగం అంటేనే ఏహ్యభావం పుట్టించింది. హాస్పిటల్ ఫోబియాతో బాధపడుతున్నా. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ కు వెళ్ళాలంటేనే వాంతి వచ్చినట్టూ… కడుపు దేవుతున్నట్టూ ఉంటోంది. వెధవ వైద్యం కంటే చావడమే మేలనే నిస్ఫృహలో పడిపోయాం మా ఫ్యామిలీ.
మొండిగా చెబుతున్నా సర్… చస్తే… చస్తాం… ఉంటే ఉంటాం అని మా ఇంట్లో ఇద్దరు ముసలివాళ్ళతో సహా ఎవరం వేక్సిన్ సింగిల్ డోస్ కూడా వేసుకోలేదంతే. మాకు పథకాల బెంగ లేదు కాబట్టి బెదిరింపుల గొడవ లేదు. విమానం ఎక్కే స్థాయి… అవసరం రెండూ లేవు. మా అవసరాలకు ఎక్కడికెళ్ళినా సొంత వాహనంలో ప్రయాణం. అంతే సర్… (ఏడాది క్రితం పోస్టు ఇది… ఎందుకో మళ్లీ షేర్ చేయాలనిపించింది… ఇలాంటి కథలు కోకొల్లలు…)
Share this Article