విజయ్ దేవరకొండ… సినిమా రిలీజ్ అయ్యీకాకమునుపే తన మీద నెగెటివ్ క్యాంపెయిన్ జరుగుతున్న తీరును చెప్పుకున్నాం కదా… పాపం, వీడి (విజయ్ దేవరకొండ) మీద ఏమిటీ కుట్రలు అని బాధపడ్డాం కదా.,. తీరా సినిమా చూశాక ‘వీడి’కేమైంది అసలు అనుకునే పరిస్థితే ఉంది… అసలే వరుస ఫ్లాపులతో కెరీర్ కిందామీదా పడుతున్న సిట్యుయేషన్‌లో పాపం ఇలాంటి సినిమా ఎందుకు చేశాడు అని తాజాగా జాలిపడేట్టుగా ఉంది…
ఎక్కడో విజయే చెప్పినట్టు గుర్తు… కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దిల్ రాజు సాయం చేశాడని… కావచ్చు, దానికి ప్రతిగా విజయ్ కొన్ని డేట్స్ ఇచ్చి ఉంటాడు, ఎలాగూ విజయ్‌కు మంచి స్టార్‌డం ఉంది కదా ఏదో ఒకటి గబగబా తీసేస్తే పోలా అనుకుని, తన హిట్ సినిమా గీతగోవిందం తరహాలోనే ఓ సినిమా తీసి పెట్టాలని దర్శకుడు పరుశురాంకు పురమాయించి ఉంటాడు… అప్పుడెప్పుడో చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాను వందోసారి చూస్తున్న సదరు దర్శకుడు అదే మూడ్‌లో ఆ బాపతు కథే అర్జెంటుగా రాసుకుని, రీళ్లు చుట్టేసి ఉంటాడు…
పనికిమాలిన అన్నయ్యలు, కుటుంబాన్ని ఉద్దరించే తమ్ముడు గారు… పైసలున్న హీరోయిన్… మన తెలుగు సినిమాలకు ఇంతకు మించి కథ ఉండాలా ఏం అనుకున్నట్టుంది… ఫస్టాఫ్ కొన్ని సరదా బిట్స్‌తో ఎలాగోలా నెట్టుకొచ్చిన దర్శకుడికి సెకండాఫ్‌లో ఏం తీయాలో, ఏం చెప్పాలో తోచనట్టుంది పాపం… ఎటెటో తీసుకుపోయి, ఎక్కడో వదిలేశాడు ప్రేక్షకుడిని…
Ads
విజయ్, మృణాల్ జంట బాగుంది… కానీ అలా మురిసిపోయే కథ లేదు… హీరోయిన్ కేరక్టరైజేషనే సరిగ్గా లేదు… దీనికితోడు పాటలు, సంగీతం బాగా లేవు… ల్యాగ్ సరిచేయాల్సిన ఎడిటర్ కూడా తన పని మరిచిపోయినట్టున్నాడు… అక్కడక్కడా ఒకటీరెండు డైలాగులు తప్ప ఎక్కడా వర్కవుట్ కాని కామెడీ… ప్చ్, గీతగోవిందం దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు ఈ ‘ఇందూగోవర్ధనం’ సినిమా…
విజయ్ గానీ, దిల్ రాజు గానీ అసలు సినిమా కథను విన్నాకే వోకే చేశారా అనే డౌటొస్తుంది… సెకండాఫ్ అమెరికాలో కథ నడిపించిన విధానం మొత్తం విసుగు తెప్పిస్తుంది… పైగా న్యూయార్క్‌లో ధవళ మహిళలు విజయ్ వెంటపడే ఎపిసోడ్ కూడా చిరాకే… సినిమా గురించి ఇంతకుమించి చెప్పుకోవడం కూడా అనవసరం… ఈమాత్రం దానికి థియేటర్ దాకా వెళ్లడం కూడా పర్సుకు బొక్కే… విజయ్ వీర ఫ్యాన్స్‌కు కూడా సినిమా బాగుందని చెప్పడం ఇబ్బందికరమే… (ఈ సక్కదనానికి కొత్త దర్శకులకు చాన్సిస్తే బడ్జెట్ లెక్కలు వర్కవుట్ కావు వంటి భారీ డైలాగులు దేనికి విజయ్..?)
వరుస హాలీడేస్… పండుగ వాతావరణం… కావల్సినన్ని థియేటర్లు… తప్పకుండా ఓ హిట్ కొట్టాల్సిన తరుణంలో విజయ్ మరోసారి చతికిలపడ్డాడు… మొత్తానికి టిల్లూ గాడి పంట పండినట్టే… జొన్నలగడ్డ సిద్ధూ సినిమాకు మరింత స్టడీ వసూళ్లు వచ్చే చాన్సుంది ఇప్పుడు… థియేటర్ దాకా రప్పించుకునే వేరే సినిమాలు ఏవీ మార్కెట్‌లో లేవు కదా…!
Share this Article