చేజేతులా చెడగొట్టుకోవడం అంటే ఇదే..! నిజానికి హీరో సూర్య ఈ సినిమాను ఒప్పుకోవాల్సింది కాదు… మరి ఎందుకు ఈ కథను ఎంచుకున్నాడో తెలియదు… కెరీర్‌కు బురద పూసుకోవడం అంటారు దీన్నే… సూపర్ పాపులారిటీ ఉంది.., జైభీమ్, ఆకాశం నీ హద్దురా ఓటీటీ సినిమా విజయాలు ఈమధ్యే తన ఖాతాలో పడ్డాయి… అందరిలాంటి హీరో కాదు, తెలివైనవాడు, మంచి కథలు-ప్రయోగాలతో ప్రేక్షకుల అభిమానం పొందుతున్నాడు అనే పేరొచ్చింది… ఏం లాభం..?
ఓ పాత చింతకాయ పచ్చడిని వడ్డించాడు మనకు… ఎస్, సూర్య వంటి హీరోకు రెండు ఓటీటీ సినిమాల తరువాత ఓ థియేటర్ హిట్ కావాలి… ఓ కమర్షియల్ మూవీ కావాలి… పైగా కళానిధి మారన్ నిర్మాత… డబ్బుకు ఢోకా లేదు… కథ నుంచి హీరోయిన్ దాకా… స్క్రీన్ ప్లే నుంచి సంగీతం దాకా అన్నీ మైనసులే… సరే, ఈ అరవ అతిని వాళ్లు భరిస్తారేమో, చప్పట్లు కొడతారేమో… కానీ తెలుగు ప్రేక్షకులకు ఇది అరగదు…
Ads
రెండు ఊళ్లు… ఆ ఊరి కాకి ఈ ఊరికి రావద్దు… ఏవో పిచ్చి పంచాయితీలు… కానీ ఇద్దరు ప్రేమించుకుంటారు… గొడవలు… ఎన్ని వందలసార్లు చూసి ఉంటాం ఈ కథనాన్ని..! కాకపోతే అమ్మాయిల్ని బరిబాతల వీడియోలు తీయడం, ట్రాప్ వేయడం, బ్లాక్ మెయిల్ చేయడం, రేపులు చేయడం అనే ఓ సామాజికాంశాన్ని కథలో మిక్స్ చేశారు… కానీ ఈ లాయర్ హీరో కదా… ఈ అరెస్టులు, కేసులు గట్రా దేనికని అఖండ రేంజులో ఖతం శిక్షను ఎంచుకుంటాడు… హేమిటో…
పోనీ, ట్రీట్‌మెంట్ ఏమైనా బాగుందా అంటే… అదీ లేదు… నిజానికి సూర్యకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది… తెలుగు హీరోలా అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు… అలాంటప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేలా జాగ్రత్తపడాలి… ఊరికే డబ్బింగ్ సినిమాలా మమ అనిపించేసి, ప్రేక్షకుల మీదకు విసిరేయడం దేనికి..?
ఈ సినిమా పేరు ఎదర్కుం తుణిందవన్… అంటే ఏదైనా ధైర్యంగా ఎదుర్కునేవాడు అని అర్థం… తెలుగులో ఏం పెట్టాలో అర్థంగాక ఈటీ అని ఓ షార్ట్ కట్ పేరు ఖరారు చేశారు… కాకపోతే ‘ఎవరికీ తలవంచడు’ అని దానికి ఓ ట్యాగ్ పెట్టారు… దాని షార్ట్ ఫాం ఈటీ అన్నమాట… హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్… చూడటానికి అందంగా ఉంది… కానీ అభినయం చేతకాదు… కనీసం సగటు హీరోయిన్ వేయాల్సిన ఆ పిచ్చి డాన్స్ గెంతులైనా సరిగ్గా వేయలేదు… ఆమెను సూర్య ఎలా వోకే చేశాడో అస్సలు అర్థం కాదు…
సూర్య, ప్రియాంక, సత్యరాజ్ మినహా మిగతావన్నీ మనకు అంతగా తెలియని మొహాలే… పోనీ, బీజీఎం బాగుందా, లేదు… పాటలు బాగున్నాయా, లేవు… ఏదో చకచకా సినిమా తీసేశాం, రిలీజ్ చేశాం అన్నట్టుగా ఉంది సినిమా… ఇలాంటి కొత్తదనం లేని సినిమాలతో సూర్య అనవసరంగా తన ఇమేజ్ చెడగొట్టుకోవడమే… ప్రత్యేకించి ఓ రేంజుకు ఎదిగాక, ఇమేజ్ కాపాడుకోవడమే పెద్ద సవాల్… దానికి చాలా జాగ్రత్తలు అవసరం… కానీ సూర్య ఆ కోణంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు… సూర్యా, దిసీజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సూర్యాస్ మూవీ…!!
Share this Article