ముందుగా వార్త చదవండి… కేంద్ర మంత్రి నారాయణ రాణెను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు… కారణం ఏమిటంటే..? తను సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడనేది కేసు… ఏమన్నాడు..? ‘‘మనకు స్వరాజ్యం ఎప్పుడొచ్చిందో కూడా ఈ సీఎంకు తెలియదు, ప్రసంగం మధ్యలో ఆపి ఎవరినో అడుగుతున్నాడు, నేను గనుక అక్కడ ఉండి ఉంటే చెంప చెళ్లుమనిపించేవాడిని’’… ఇదీ వ్యాఖ్య… వెంటనే రాష్ట్రవ్యాప్తంగా శివసేన కేడర్ రగిలిపోయింది, రాణె దిష్టిబొమ్మలు తగులపెట్టారు, బీజేపీ ఆఫీసులపై రాళ్లు రువ్వారు, ఓ ఆఫీసు ధ్వంసం, మరోచోట బీజేపీ కేడర్‌పై దాడి… కోళ్ల దొంగ ముర్దాబాద్ అంటూ కోళ్లను పట్టుకుని ప్రదర్శనలు చేశారు (అయిదు దశాబ్దాల క్రితం రాణెకు ఓ కోళ్ల షాపు ఉండేది).., వెంటనే కేంద్ర మంత్రి పదవి పీకేయాలని మోడీకి లేఖలు రాశారు… పలుచోట్ల పోలీస్ కేసులు పెట్టారు… రత్నగిరి కోర్టు రాణెకు యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించడంతో… జనాశీర్వాద యాత్రలో ఉన్న ఆయన్ని నిన్న అరెస్టు చేశారు… భోజనం చేస్తున్నా సరే, ఛల్ ఛల్ అన్నారు… 20 ఏళ్ల తరువాత ఓ కేంద్రమంత్రిని అరెస్టు చేయడం మళ్లీ ఇదే… తరువాత కోర్టు బెయిల్ వచ్చింది, కథకు ఫుల్ స్టాప్ పడింది… కాదు, కామా పడింది…
ఆఫ్టరాల్, చెంప మీద కొడతాను అంటే అంతగా రగిలిపోవాలా అని ఆశ్చర్యపోకండి… మహారాష్ట్రకు 1999లో 258 రోజులపాటు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన నారాయణ రాణెకు, ఉద్దవ్ ఠాక్రేకు నడుమ పాత పగలు, విభేదాలు, పంచాయితీలున్నయ్… అందుకే శివసేన కేడర్ అంతగా విరుచుకుపడింది… బీజేపీ కూడా రాణె అరెస్టును ఖండించింది తప్ప, రాణె వ్యాఖ్యల్ని ఏమీ సమర్థించలేదు… నిజానికి ఇదంతా శివసేన వర్సెస్ బీజేపీ కాదు… జస్ట్, రాణె వర్సెస్ ఉద్దవ్… ‘బీజేపీ లీడర్ ప్రసాద్ శివసేన భవనాన్ని కూలగొడతాను అన్నప్పుడు, ఇదే ఉద్దవ్ చెంప పగులగొడతాను అన్నాడు… మరి అది కరెక్టేనా..?’ అని రాణె ప్రశ్న… కానీ ఇక్కడ అవన్నీ ఆలోచించేంత సీన్ లేదు… రాణె ఏదో అన్నాడు, అంతే, శివసేన కేడర్ ఫోర్త్ గేర్‌లోకి వెళ్లిపోయింది అర్జెంటుగా… వేరే లీడర్లు అయితే ఇంత రగిలేది కాదు…
Ads
ఈ రాణె మొదట్లో చెంబూరులోని హర్య నర్య అనే గ్యాంగులో సభ్యుడు… అదొక వీథి గ్యాంగు… పేరుకు ఓ కోళ్ల షాపు ఉండేది తనకు… 1970లలో శివసేనలో చేరాడు, శాఖ ప్రముఖ్ అయ్యాడు… కొన్నాళ్లకు శివసేన కార్పొరేటర్ అయ్యాడు… మెల్లిమెల్లిగా పార్టీలో ఎదుగుతూ పోయాడు… 1990లలో రాణె శివసేన ముఖ్య నాయకుల్లో ఒకడు… ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు… ఒక దశలో శివసేన-బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కూడా అయ్యాడు… సో, రాణె అల్లాటప్పాగా తీసిపారేయదగిన కేరక్టర్ కాదు… 2005లో శివసేనలో ఉండలేని స్థితి… కాంగ్రెస్‌లో చేరాడు… దాన్నీ వదిలేశాడు… 2017లో మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష అని ఓ పార్టీ పెట్టాడు… తరువాత దాన్ని బీజేపీలో విలీనం చేసేశాడు… ఇదంతా సరే, బాల్ ఠాక్రే సన్నిహితుల్లో ఒకడు కదా, మరి పార్టీని వీడే పరిస్థితి ఎందుకొచ్చింది..?
ఉద్ధవ్ మొదట్లో సిగ్గరి.., తండ్రిలాగా ధాటిగా మాట్లాడుతూ కమాండ్ చేసే సీన్ కనిపించేది కాదు… నెమ్మదస్తుడు… ఉద్దవ్ ఠాక్రే ప్రభావం పార్టీ మీద పెరిగేకొద్దీ రాణెలో అసంతృప్తి పెరుగుతూ పోయింది… ఠాక్రేను అమితంగా అభిమానించినా సరే, ఠాక్రే కొడుకు వారసత్వాన్ని మాత్రం రాణె అంగీకరించలేకపోయాడు… పలు అంశాల్లో ఉద్దవ్‌తో పడలేదు… తనను శివసేన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంటుగా ప్రకటించినప్పుడు కూడా రాణె తన అసంతృప్తిని వ్యక్తీకరించాడు… ఇలా పలు కారణాలన్నీ కలిసి పార్టీని వీడిపోయేలా చేశాయి… కొడుకు వారసత్వం పట్ల ఆయన ఠాక్రేను కూడా వ్యతిరేకించాడు… తరువాత శివసేన లీడర్లు రాణెపై వ్యక్తిగత విమర్శలు స్టార్ట్ చేశారు… పాము పిల్ల, కోళ్ల దొంగ వంటి పేర్లతో ఎగతాళి చేసేవాళ్లు… రాణె, తన కొడుకులు ఠాక్రే కుటుంబం మీద విమర్శలు చేసేవాళ్లు… (శివసేన పత్రిక సామ్నా “బొక్కపడిన గాలి బుడగ” అంటూ నిన్న ఎడిటోరియల్ రాసింది, కప్ప అని వెక్కిరించింది) సో, ఇదంతా ఇప్పటి సమస్య కాదు… ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న తగాదా… గత రెండేళ్లలో రాణె ఉద్దవ్ కొడుకు ఆదిత్య మీద కూడా ఆరోపణలు చేశాడు… (సుశాంత్ సింగ్ మరణం కేసులో తన పాత్ర ఉందనేది ఆరోపణ)… బేబీ పెంగ్విన్ అని వెక్కిరించాడు… ‘‘ఠాక్రే నిజస్వరూపం జనానికి తెలిస్తే, అప్పట్లోనే తనను బరిబాతల బజారులో ఊరేగించేవాళ్లు’’ అనే వ్యాఖ్యలకూ దిగాడు రాణె… కోళ్ల దొంగ అనే విమర్శలకు ప్రతిగా రాణె కొడుకులు ఉద్దవ్‌ను ‘‘ఇంటి కోడి’’ అని వెక్కిరించేవాళ్లు… అలా ఆ వేడి పెరుగుతూ పెరుగుతూ… సీఎం చెంప చెళ్లుమనిపిస్తాననే రాణె వ్యాఖ్యతో… ఒక్కసారిగా పెచ్చరిల్లింది… ఇదీ అసలు స్టోరీ…
Share this Article