తరం మారుతున్నది. స్వరం మారుతున్నది. ఆచారాలకు అర్థం మారుతున్నది. ఉత్తరాదిలో పెళ్లి ఊరేగింపు చాలా ప్రధానం. పెళ్లి కొడుకు గుర్రమెక్కి రావాలి. ఆ గుర్రాన్ని అందంగా అలంకరించాలి. మేళ తాళాలు, బృంద నాట్యాలతో బరాత్ సాగాలి. ఇది సంప్రదాయం. బహుశా తెలుగువారికి కూడా పెళ్లి పదహారు రోజుల పండుగగా జరిగినప్పుడు ఇలాంటిదే ఏదో ఉండి ఉండాలి. ఒకప్పుడు మనక్కూడా ఎదురుకోవులు, అలకలు, బుజ్జగింపులు ఏవేవో ఉండేవి. ఇప్పుడు తాళి కట్టగానే అబ్బాయి అమెరికా ఉద్యోగానికి, అమ్మాయి ఆస్ట్రేలియా ఉద్యోగానికి ఉత్తర దక్షిణంగా ఎవరి దారిలో వారు అర్జంటుగా వెళ్లిపోవాలి కాబట్టి- పదహారు నిమిషాల పెళ్లే విధిలేక జరుగుతోంది.
రెండు మూడు యుగాలుగా గుర్రమే ప్రధానమయిన వాహనం. రథ గజ తురగ పదాతి సమావృత… అని అంతటి ఆదిశక్తి బలంలో కూడా గుర్రాల సైన్యం చాలా ప్రధానమయినది. దేవుడికి సకల రాజోపచార పూజల్లో అశ్వాన్ ఆరోహయామి…అని ఒక మర్యాద పాటిస్తున్నాం. ఇప్పుడంటే గంజికి గతిలేకపోయినా పెళ్ళికొడుకు బెంజిలో వస్తున్నాడు కానీ- మొన్నటిదాకా పెళ్లి కొడుకు గుర్రం మీదే వచ్చేవాడు. వందల, వేల ఏళ్లుగా అదొక సంప్రదాయం.
Ads
మధ్యప్రదేశ్ లో నాలుగు రోజుల కిందట ఒక పెళ్లిలో పెళ్ళికొడుకు దగ్గరికి పెళ్లి కూతురు గుర్రమెక్కి వెళ్లడం జాతీయంగా పెద్ద వార్త అయ్యింది. ఒకే ఒకమ్మాయి. చిన్నప్పటినుండి అల్లారు ముద్దుగా పెరిగింది. ఆధునిక, అభ్యుదయ భావాలున్నాయి. తన పెళ్లి ఇలా జరగాలని గోముగా అమ్మా నాన్నలను అడిగింది. వారు పెళ్లికొడుకుతో కూడా మాట్లాడి సరేనన్నారు. అమ్మాయి చక్కగా మోడరన్ జీన్స్ ఓవర్ కోట్ వేసుకుని గుర్రమెక్కి బరాత్ గా పెళ్లి మంటపానికి చేరింది. అబ్బాయి అక్కడ బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు విచ్చుకుంటుండగా అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో తప్పు పట్టాల్సింది, ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. బెంగళూరు టు చికాగో పదహారు గంటల నాన్ స్టాప్ ఎయిర్ ఇండియా విమానాన్నే నలుగురు మహిళలు నడిపి మళ్లీ తిరిగి వచ్చారు. ఆఫ్టరాల్ బరాత్ లో గుర్రం స్వారీ వారికి లెక్క కాదు. ఇంకానా వివక్ష..? ఇకపై సాగదు…. By… – పమిడికాల్వ మధుసూదన్
Share this Article