వన్నె తగ్గిన సంపాదకీయం… పత్రికల్లో సంపాదకీయం చాలా ప్రధానమయినది. మిగతావన్నీ జరిగిన వార్తలను ఉన్నదున్నట్లు రకరకాలుగా ఇచ్చే రిపోర్ట్ లు. వార్త- వ్యాఖ్య- సంపాదకీయాల మధ్య విభజన రేఖ ఎప్పుడో మాయమయ్యింది. ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం. ఒక్క సంపాదకీయం మాత్రం పత్రిక అభిప్రాయం. సంపాదకుడి వ్యాఖ్య, విశ్లేషణ. యజమాని- సంపాదకుడు ఒకరే అయిన రోజులు కాబట్టి ఇప్పుడు సంపాదకీయం అంటే యాజమాన్య విధానం అనే అనుకోవాలి.
తెలుగులో సంపాదకీయాల కోసమే పత్రికలు చదివిన రోజులు కొన్ని దశాబ్దాలపాటు ఉండేవి. తరువాత సంపాదకీయ పేజీ ఒక్కటే పాఠకులకు అంటరానిదిగా తయారయ్యింది. ఇందులో పాఠకుల తప్పు లేదు. పత్రికా సంపాదకులు, యజమానులే దీనికి బాధ్యులు. సంపాదకీయం అనగానే సంస్కృత భార పదబంధ సమాసాలతో ఇనుప గుగ్గిళ్ళకంటే కఠినంగా, అర్థం కాకుండా రాసే సంపాదకులు; పడికట్టు పదాలతో నిర్జీవమయిన శైలిలో రాసే సంపాదకులు; చెరకులో రసాన్ని వదిలి పిప్పిని మాత్రమే పట్టుకున్నట్లు తెలుగుకు సహజమయిన వ్యక్తీకరణను వదిలి నిస్సారమయిన అభివ్యక్తిని పట్టుకున్న సంపాదకులు పెరిగాక పాఠకులకు ఎడిట్ పేజీతో బంధం తెగిపోయింది.
తెలుగులో ఇప్పటికీ అత్యంత సరళ భాషలో అనన్యసామాన్యంగా సంపాదకీయాలు రాసే జర్నలిస్టులు ఉన్నారు. బహుశా అలాంటివారికి అవకాశాలు తక్కువగా దొరుకుతున్నట్లు ఉంది.
Ads
నిజానికి ప్రపంచవ్యాప్తంగా ప్రింట్ మీడియా పరిస్థితి ఏమీ బాగాలేదు. టీ వీ న్యూస్ ఛానెళ్లు వచ్చాక ప్రింట్ మీడియా తెరమరుగవుతుందని అనుకున్నారు కానీ…అలా జరగలేదు. ఎంతటి నరాలు తెగే ఉత్కంఠతో సాగిన క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం టీ వీ ల్లో చూసినా…దాని విశ్లేషణ ప్రింట్ మీడియాలో చదువుతున్నప్పుడు అక్షరాలా కలిగే అనుభూతి వేరు. కదిలే దృశ్యంగా వీడియోలో ఏమి ఉంటే దాన్నే కన్ను చూడాలి. అచ్చయిన అక్షరం, పదం, వాక్యం, వ్యాఖ్య, విశ్లేషణ, సంపాదకీయాల్లో దాన్నొక భావంగా చదువుతున్నవారు నిర్మించుకోవాలి. ఊహించుకోవాలి. అందుకే కదలని చిత్రం, కదిలే దృశ్యం కంటే అక్షరం గొప్పది. దాని పేరే అ- క్షయం. నాశనం లేనిది.
డిజిటల్ మీడియాలో ఎన్నెన్ని ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. వెబ్ సైట్లు మొదలు పొట్టి వాక్యాల ట్విట్టర్ దాకా ఒక్కో ప్లాట్ ఫార్మ్ అడ్వాంటేజ్ ఒక్కోలా ఉంటుంది. ఈరోజు వార్త జరిగితే…విలేఖరి కాగితం మీద వార్త రాసి బస్సులో ఎడిషన్ కేంద్రానికి పంపితే…రేపు అచ్చయితే…ఎల్లుండి పొద్దున పాఠకుడికి అందిన 1980-90 రోజులకే జర్నలిజం వేగానికి రాకెట్లు సిగ్గు పడ్డాయి. ఆపై ఈరోజు వార్త ఈరోజే అచ్చయి…రేపు ఉదయానికే పాఠకుడికి చేరే వేగం రాగానే మనోవేగం సిగ్గుతో తలదించుకుంది. డిజిటల్ రోజులు జడలు విప్పగానే ఇప్పుడు జరిగిన వార్త ఇప్పుడే పాఠకుడికి, ప్రేక్షకుడికి, శ్రోతకు చేరే వేగం వచ్చింది.
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న ప్రతివారు నార్ల వెంకటేశ్వరరావు కంటే గొప్పగా సంపాదకీయాలు రాయగలిగిన వాళ్లం అనే అనుకుని రాస్తున్నారు. చదివేవారు చదువుతున్నారు. సోషల్ మీడియాలో ఎంత చెత్త వస్తున్నా…ఎన్ని ఫేక్ వార్తలు వస్తున్నా…మెయిన్ స్ట్రీమ్ మీడియా పునాదులను కదిలించిన మాట నిజం. సోషల్ మీడియా వార్తలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు పెద్ద సోర్స్. డ్రయివింగ్ ఫోర్స్. ఇందులో మంచి- చెడుల చర్చ ఇక్కడ అనవసరం. శిక్షణ పొందిన మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్టుల కంటే ఎలాంటి ఫార్మల్ జర్నలిజం చదువు, అనుభవం లేని కొందరు డిజిటల్ జర్నలిస్టులు రాసేవి గొప్పగా ఉంటున్నాయి. మొత్తం జర్నలిజం స్వరూప, స్వభావాలను, పనితీరును డిజిటల్ మీడియా శాసిస్తోంది.
చందాదారులు పోతున్నారు.
లైకులు, షేర్లు, వ్యూస్, సబ్ స్క్రిప్షన్లు, కామెంట్లు, ఫాలోయర్లు, రీ ట్వీట్లవారు వస్తున్నారు.
పేపర్ గాలికి తేలిపోతోంది.
స్మార్ట్ ఫోన్లో ప్రపంచ జర్నలిజం ఒదిగిపోతోంది.
పేపర్ కు ప్రకటనల కాలం చెల్లుతోంది.
డిజిటల్ యాడ్స్ కాలం వచ్చేసింది.
పత్రిక రీడర్షిప్ లెక్కలు లెక్కలేనివి అవుతున్నాయి.
లెక్కకు మిక్కిలి పుట్టుకొచ్చిన డిజిటల్ మీడియా రెక్కలు విప్పి ఎగురుతోంది.
పడికట్టు పదాల ఇనుపగుగ్గిళ్ల సంప్రదాయ సంపాదకీయాలను కొత్తతరం డిజిటల్ రాతలు ఈడ్చి అవతల పారేస్తున్నాయి.
మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్షరం డిజిటల్ మీడియా పెట్టే శీలపరీక్షకు నిలబడాల్సి వస్తోంది.
ఏది వార్త?
ఏది వ్యాఖ్య?
ఏది సంపాదకీయం?
అన్న స్పృహను, ఆ విభజన రేఖను పాటించాల్సిన అవసరాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియానే పట్టించుకోవడం మానేసిన రోజుల్లో డిజిటల్ మీడియా విలువలు, ప్రమాణాల గురించి ఆలోచించడం దండగ… -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article