కృష్ణవంశీ దర్శకుడిగా ఔట్ డేటెడ్… ఇళయరాజా స్వరాల పనైపోయింది… ప్రకాష్‌రాజ్ మొనాటనీ నటన ఇంకెన్నాళ్లు… ఆ కథ ఔట్ డేటెడ్… ఆ కాలం చెల్లిన రంగస్థలం బేస్‌గా కథ నడిపిస్తే ఎవరు చూస్తారు..? ప్రత్యేకించి ప్రకాష్‌రాజ్ కేరక్టరైజేషన్ చెత్త… మిత్రుడిని హత్య చేయడం ఏమిటి..? దాన్ని కరుణరసాత్మకంగా చూపించడం ఏమిటి..? తల్లిదండ్రుల అజ్ఞానపు ధోరణులకు పిల్లలను తప్పుపట్టే కథనం దేనికి..? అసలు కృష్ణవంశీకి ఏమైంది..? ఆయన్ని నమ్మిన నిర్మాతకు నెత్తిమీద తెల్ల శెల్ల మిగిలిందా..?
….. ఆ తరం పనైపోయింది… ఇప్పుడు వేణు వంటి కొత్తతరం దర్శకులది… ఒరిజినాలిటీ, నేచురాలిటీ కావాలి… అందుకే బలగం అనుకోని హిట్… రంగమార్తాండ అట్టర్ ఫ్లాప్… మొన్న, నిన్న రంగమార్తాండ సినిమాకు మరీ పదేసి లక్షల వసూళ్లే దానికి నిదర్శనం…….. ఇలా సాగుతున్నాయి తాజా విశ్లేషణలు యూట్యూబులో, సైట్లలో… కానీ..?
Ads
మరో కోణం చూద్దాం… అది రంగమార్తాండ బాగుందా, బలగం బాగుందా అనే కోణం కాదు… సినిమా వ్యాపారం గురించి..! నిజమే, రంగమార్తాండ నిర్మాత కృష్ణవంశీని నమ్ముకుని తప్పుచేశాడు… సినిమా రిలీజుకే చచ్చీచెడినంత పనైంది… థియేటర్లలో మరీ ఘోరంగా ఉన్నాయి వసూళ్లు… అయితే తనకు 10, 12 కోట్ల వరకూ ఖర్చయింది… కానీ థియేటర్ బిజినెస్ 2, 2.5 కోట్లే… అవీ పూర్తిగా వస్తాయో లేదో డౌటే… కానీ ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్ అన్నీ కలిపి దాదాపు 10 కోట్ల దాకా వర్కవుట్ అయినట్టు చెబుతున్నారు…
అంటే… సినిమా ఎంత దరిద్రంగా ఆడినా సరే, పెట్టుబడికి ఢోకా లేదన్నమాటే కదా… ఎటొచ్చీ థియేటర్ల సంఖ్య ఎక్కువ, బయ్యర్లు దొరకడం కష్టం… నాసిరకం సినిమాలు కూడా గట్టెక్కుతున్నాయి… కోట్లు సంపాదిస్తున్నాయి కూడా… గాలోడు సినిమాలో ఏముంది..? మంచి లాభాల్ని సంపాదించింది అది… అంతెందుకు విష్వక్సేనుడు నటించి, నిర్మించిన దాస్ కా దమ్కీ ఏ రీతిలోనూ లేని సినిమా… అది పాన్ ఇండియా, కోట్లు మింట్ చేస్తోంది… అన్నింటికీ మించిన ఉదాహరణలు పఠాన్, ఆర్ఆర్ఆర్ కూడా…!
సరిగ్గా ప్లాన్ చేసుకునే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఇప్పుడు స్వర్ణయుగం… రకరకాల సంపాదన మార్గాల్లో డబ్బు వచ్చిపడుతోంది… ఇదెన్నాళ్లో చెప్పలేం గానీ వర్తమానంలో దశ తిరుగుతోంది చాలామందికి… కాంతార సినిమాకు 2 కోట్లు పెట్టి 20 కోట్లు ఆర్జించాడు అల్లు అరవింద్… బలగం సినిమాకు నామమాత్రం పెట్టుబడి పెట్టి పదింతల డబ్బు రాబట్టుకున్నాడు దిల్ రాజు…
ఇలా ఎన్నో ఉదాహరణలు… అయితే ఇది చాన్నాళ్లు ఉండకపోవచ్చు… ఓటీటీలు ఇష్టారాజ్యంగా, అడ్డగోలు ధరలకు సినిమాల్ని కొనే రోజులు త్వరలో పోతాయి… ఆహా ఓటీటీ దాదాపు 100 కోట్ల దాకా నష్టాల్లో పడిపోయిందట… ఇతర ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్ మినహా మిగతావన్నీ సోసో… వాటి బిజినెస్ అంతంతమాత్రం, ఆర్జన అంతంతమాత్రం…. ఆ మూడు ఓటీటీలు కూడా డబ్బు పెడుతూ పోతున్నాయి తప్ప పెట్టుబడికి తగ్గ రెవిన్యూ లేదు, ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చినా సరే, ఓవరాల్‌గా ఆ బ్రాండ్ వాల్యూ, కంటెంటు పెరుగుతున్నా సరే తక్షణ లబ్ధి ఏమీ లేదు… అవీ సినిమాల కొనుగోళ్లు తగ్గించి, సొంత కంటెంటు మీద దృష్టి పెట్టబోతున్నాయి…
అందుకే, ఇదే సరైన సమయం… మంచి ప్లానింగుతో తక్కువ ఖర్చుతో ఓ మోస్తరు సినిమా తీసినా… చేతులు కాలవు… పరిస్థితి అనుకూలిస్తే నాలుగు డబ్బులు కూడా జేబులోకి వస్తాయి… రష్యాలు, జపాన్లు, చైనాలు వంటి మన సినిమాలు ఎవడూ చూడని దేశాల్లో కూడా రిలీజు దందాలు, ఆర్జనలు చేతనైతే ఇంకా ఇంకా ఇంకా లాభం… ఎటొచ్చీ రాజమౌళి దత్తకొడుకు కార్తికేయ వంటి మంచి మేనేజర్లు కావాలి…!
Share this Article