డుగ్గు డుగ్గు పాట మన తెలుగులోనే సూపర్ హిట్… ప్రస్తుతం దాన్ని కొట్టే పాట లేదు… ఏమో సారంగదరియా వీడియో సాంగ్ వస్తే చెప్పలేం… కానీ ఓ సింహళీ పాట ఆ దేశంలోనే వైరల్ కావడం కాదు, భారత దేశంలోని పలు భాషల ప్రేక్షకుల్ని కూడా మంత్రముగ్దులను చేస్తోంది… దాని సంగతి మనం ‘ముచ్చట’లో ఇంతకుముందే చెప్పుకున్నాం… దాని పేరు మానికె మాగే హితె… పాడింది యోహని… ఈ పాటకు ఎన్ని కోట్ల వ్యూస్ అనేది కాదు చూడాల్సింది… ఏ రేంజులో దూసుకుపోతోందో చూడాలి… ఒడియా, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ గట్రా బోలెడు భాషల్లోకి అనువాదం అయిపోతోంది… నిజానికి ఎవరికి వారు సొంతంగా తర్జుమాలు చేసేసి, పాడేసి, వీడియోలు యూట్యూబులో అప్ లోడ్ చేసేస్తున్నారు… ఎవరి కడుపునొప్పి వాళ్లది… తప్పుపట్టలేం… వ్యూస్ వస్తే రెవిన్యూ కదా… కానీ ఆ తర్జుమాలు ఆ ఒరిజినల్ సాంగ్‌లోని ఫీల్‌ను అడ్డంగా చంపేస్తున్నయ్… ఒకటీరెండు తెలుగు తర్జుమా వీడియోలు చూసి, ఆ తరువాత ఈ పాట అసలు అర్థమేమిటో చెప్పుకుందాం… నిజానికి ఫిమేల్ వాయిస్ ఆ పాటకు మంచి థ్రిల్, కిక్ ఇచ్చింది గానీ పాట మేల్ వెర్షనే… ఓ ప్రేమికురాలి గురించి ఓ ప్రియుడి పలవరింత, కలవరింత, పులకింత…
Ads
మనసే గువ్వయిందే, చెలీ నన్ను చంపేసిందే
ఏదీ, కుదురేదీ
సర్వం నువ్వే నాకే
ఇచ్చా మనసే నీకే
నారీ సుకుమారీ
నువ్వే నా దేవతవే
నా ప్రేమ చెక్కిలివే
ఓ నారీ మన్హారీ, సుకుమారీ దేవతవే
తను చూసే చూపులే
నా గుండెను గుచ్చెనులే
ఓ నారీ మన్హారీ, సుకుమారీ నువ్వనులే
కళ్లకు కాటుక మెరిసెనులే
గాజుల సవ్వడి చేసెనులే
నే నిన్ను చూశాక
ప్రేమంటూ పుట్టాక
మనసంతా నీ మైకం కమ్మేసెనే
నువ్విట్టా ఓ కంట చూశావంటే
తనువంతా ఏదోలా పులకించెనే
ప్రేమంటే ఇంతేనా పిచ్చెక్కిపోయేనా
ఎంతైనా ఈ మాయ నీవల్లనే
నువ్వేనా దేవతవే
నా ప్రేమ కౌగిలివే
ఓ నారీ మన్హారీ సుకుమారీ నువ్వునులే
అసలు ఒరిజినల్ చూశారా..? ఆ హస్కీ వాయిసే దానికి ప్రధానబలం… చిన్న పిల్ల గొంతు కూడా మిక్సయి అదోరకమైన మైకాన్ని ఇచ్చింది పాట… మెలొడీ ప్రధానంగా సాగే ఓ లంకన్ సాంగ్ ఇంత వైరల్ కావడం ఇదే ప్రథమం… మరొకాయన తెలుగులో ఇలా పాడాడు… ఆ లిరిక్ కూడా వింటుంటే ఎక్కదు, అర్థమయ్యేలా పాడలేదు, నాసిరకంగా సాగుతుంది ఉచ్చారణ, సరే గానీ నేనిస్తున్నాను చదవండి…
రా పిల్లా, రా పిల్లా రా
నిన్ను చూస్తుంటే పిల్లా
కన్నుల్లో రసగుల్లా
ముద్దుకు ఓర్చుకోలేనే
మదమే ఎక్కించావే పిల్లా
ఓ పిల్లి కళ్ల దానా
నీ ఒళ్లో వాలిపోనా
నువ్వు లైలా నేను మజ్నూ
ఒక్క ముద్దు పెట్టాల్నా
తెల్లటి బుగ్గపైనా
చిన్నారి చెంతచేరి నీ ఊపిరి అయిపోనా
హమ్మయ్య, ఇక్కడితో ఆపేశాడు సంతోషం… ఇంకా చాలా వీడియోలు వస్తయ్… ఏవేవో అనువాదాలు, పాటలు యూట్యూబుకు ఎక్కుతయ్… మరొకటి చూస్తారా..? ఇదుగో వీడియో… ఆ పాట కూడా చదవండి ఓసారి…
ఫస్టు లుక్కులోనే ప్రేమలో పడేశావ్
విజిట్ డ్యాష్ డ్యాష్… (ఏదో అర్థం కాని ఉచ్చారణ, గాయకుడు ఏం పాడాడో ఎవడికీ తెలియదు…) మత్తులో దింపేశావ్
ఇక ఆగమంటే ఆగునా…
నా మనసు నిన్ను తలవకుండునా…
తేనెకళ్లతోనే మాగ్నెట్‌లా లాగేశావ్
మనసు గదిలోన బెడ్ లైట్ వేసేశావ్
ఇదంతా ప్రేమే కదా
అని నిన్ననే తెలుసుకున్నా
నా మనసు నీదంటూ మదిలో నీ బొమ్మనే గీసినా
సుకుమారీ వయ్యారీ నీ కోసమే వేచి ఉన్నా
అయితే నిజానికి ఆ పాట అసలు అర్థం ఏమిటి..? ఆ ఒరిజినల్ సాంగ్ ఇదీ…
రఫ్‌గా దీని అర్థం ఎలా సాగుతూ ఉంటుందంటే…
ఓ బేబీ, నా గుండెలో నిండినవ్
ప్రతి క్షణం నీ ఆలోచనే
మది నిండా మంటెక్కిస్తున్నవ్
నీ రూపు కళ్లు తిప్పుకోనివ్వదు
మొత్తం మునిగాను నీ ప్రేమలో
పూర్తిగా నిండినవ్ నా గుండెలో
నువ్వు ఏనాటి నుంచో తెలిసినట్టే ఉంది
ఓ దేవీ… ప్రియమైన దేవీ, నిన్ను చూస్తేనే ఉల్లాసం
ఇక జాగుచేయకు, దాచిన నా గుండెను కనిపెట్టి కొల్లగొట్టినవ్
నా ప్రేమ నీకు మాత్రమే చెల్లుబాటు, ఇక వయసు గుర్రాల్ని ఆపలేం
అదేమిటో నా గుండె నీకు బాధితురాలైపోయింది
కళ్లు కలవగానే కంట్రోల్ తప్పుతున్నాను నేను
నీ అందం పిచ్చెక్కిస్తోంది, రా కాస్త దగ్గరకు రా
తేనె కోసం తిరిగే ఈగను నేను, రమ్మంటున్నది నీ చూపు
మొత్తం మునిగిపోయాను, నువ్వే నాకు సర్వస్వం…. (( మీరు రచయితలా..? పోనీ, అప్పుడప్పుడూ సరదాగా కలం చేసుకుంటూ ఉంటారా..? ఈ ట్యూన్‌లో ఈ పాట మరింత అర్థవంతంగా రాయడానికి ప్రయత్నించండి… ఏమో మీరూ డుగ్గు డుగ్గు రేంజుకు చేరవచ్చునేమో…. ))
Share this Article