గౌరీలంకేష్ హత్య తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్ సమావేశానికి మాట్లాడటానికి పిలిచారు. ఉద్యమకాలమంతా కూడా వాళ్ళకు నేను రెగ్యులర్ స్పీకర్. ఈ మీటింగ్ కు ‘మతతత్వ శక్తులు – గౌరీ లంకేష్ హత్య’లాంటిది ఏదో అంశం. దానికి ప్రభుత్వంలో పెద్ద పదవుల్లో ఉన్న నాకు బాగా తెలిసిన కొందరు కూడా వచ్చారు. వాళ్ళు ఉద్యమకారులు కూడా. అక్కడ మాట్లాడుతూ ఉద్యమ తెలంగాణా చెయ్యాల్సిన కర్తవ్యాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి ముక్కుపుడకలు, యజ్ఞాలు అని మూఢత్వాన్ని ప్రేరేపిస్తుంటే రేపు తెలంగాణాలో ఇదే జరుగుతుంది. ప్రశ్నించకుండా కూర్చున్నవాళ్ళంతా రేపు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది అన్నందుకు వాళ్ళంతా చాలా నొచ్బుకున్నారు. ఆ తర్వాత నన్ను వాళ్ళు మీటింగులకు పిలవడం మానేశారు. ఈ మాట నేను పదే పదే అంటున్నందుకు ఉద్యమానికి చాలా ముందునుంచీ ఎన్నో దశాబ్దాలుగా చాలా దగ్గరగా ఉండే చాలామంది దూరం అయ్యారు.
ఇప్పుడు కూడా నాకు కేసీఆర్, కేటీఆర్ మీద కోపంలేదు. వాళ్ళు దళారీ రాజకీయవేత్తలు. వాళ్ళు తమకు ఏది లాభమో అదే చేస్తారు. సమాజగతి, మానవ జాతి అభివృద్ధి లాంటి పెద్ద విషయాలు పట్టవు. అధికారానికి మనుషులను డీ హ్యూమనైజ్ చేసే శక్తి ఉంటుంది. కానీ అదే మనిషికి అధికారాన్ని హ్యూమనైజ్ చేసే శక్తి కూడా ఉంటుంది. అధికారంలో ఉన్న మనుషులను బట్టి ప్రయాణం దిశ ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన రోజు నుంచీ ఈ ప్రయాణం తప్పుదోవలోనే ఉంది. ఇది అర్ధం అయిన వాళ్ళు కూడా, మంచి చెప్తున్నవాళ్ళను దూరం పెట్టటం లేదా హేళన చేయటం తప్ప పట్టించుకోలేదు. ఈ మాట చెప్పాడని హరగోపాల్ వంటి వాళ్ళను కూడా పూర్తిగా దూరం పెట్టారు. బహుషా జయశంకర్ బతికి ఉంటే ఆయన ఈ మాట చెప్పి ఉంటే కూడా ఇదే జరిగేది…
తెలంగాణా ఏ ప్రజాస్వామిక విలువల, ఉద్యమాల పునాదిగా ఏర్పడిందో వాటిపట్ల కొత్త రాష్ట్రం తీవ్ర వ్యతిరేక ధోరణి చూపిస్తూ వచ్చింది. ప్రతిపక్షాన్ని చంపడం, హక్కుల కోసం రోడ్లమీదకు వచ్చిన వాళ్ళను నిరంకుశంగా అణచి వేయడం, తప్పుడు కేసులు పెట్టి హక్కుల కార్యకర్తలను నిర్భందించడం వంటివి ఎన్నో జరిగాయి. ప్రజలను రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లకు ఆశపడి ఓట్లేసే వాళ్ళుగా చూశారు. గవర్నెన్స్ అనేది కొత్త రాష్ట్రంలో కనపడకుండా పోయింది.
Ads
జీవితం అంతా ఆ విలువల పట్ల గౌరవం ఉన్న అధికారంలో ఉన్న నాయకుల కన్నా ఎన్నో రెట్లు ఔద్దికంగా, సైద్దాంతికంగా సుపీరియర్ అయి కొత్త రాష్ట్ర నిర్మాణంలో ఉన్నవాళ్ళు ఆ ధోరణులను ప్రశ్నించలేదు. సరికదా నేరపూరిత మౌనం చూపించారు. ఎత్తి చూపినవాళ్ళను వెక్కిరించారు. కొన్నిసార్లు వేధించారు కూడా…
తెలంగాణా నేలకు ఒక స్వభావం ఉంది. పాల్కురికి సోమన నుంచి తెలంగాణా ఉద్యమం దాకా అది కనిపిస్తూ ఉంది. కానీ ధిక్కారానికి కూడా ఒక మార్గదర్శనం కావాలి. లేకపోతే అది తప్పుడు శక్తుల చేతిలో పడుతుంది. ఇప్పుడు జరుగుతున్నదదే. ఇప్పుడు జరిగిన నష్టం నివారించడం అంత తేలిక కాదు. జరగబోయే నష్టo కూడా అతి ప్రమాదకరమైనది. తెలంగాణాను కాపాడుకోవటమే ఇప్పుడు నిజమైన తెలంగాణా ఉద్యమ కారుల కర్తవ్యం. ప్రజాస్వామ్య విలువలు, ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన మిత్రులు ఇప్పటికైనా తమ కర్తవ్యం గుర్తించకపోతే వాళ్ళ స్థానం శాశ్వతంగా తెలంగాణా ద్రోహుల జాబితాలోనే ఉండక తప్పదు…
Share this Article