.
నిన్నా మొన్నటి ఓ ఎపిసోడ్ తెలుసు కదా… వనపర్తికి చెందిన భరత్ అనే ఆటోడ్రైవర్… తన ఆటో వెనుక భాగాన ‘మతం మార్చుకోవడం అంటే కన్నతండ్రిని మార్చుకోవడమే, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే, జైశ్రీరాం’ అని రాసుకున్నాడు… అది కొందరు మజ్లిస్ మనుషుల కంటగింపుకి కారణమైంది…
ఆటోను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు, కొట్టబోయారు, బెదిరించారు… చివరకు అత్తాపూర్ ఎస్ఐ శ్రీనివాసులు కూడా ఓ మజ్లిస్ కార్యకర్తలాగే వ్యహరించి, రేయ్, నీ ఆటో తీసుకుని పోలీస్ స్టేషన్‌కు రా, ఆటో ఎలా నడిపిస్తావో చూస్తానంటూ తన సహజమైన పోలీస్ జులుం ప్రదర్శించాడు…
Ads
తనకు తెలిసిన కొందరు బీజేపీ వాళ్లను భరత్ అప్రోచయ్యాడు… అందరికీ వెంటనే గుర్తొచ్చిన పేరు ఏమిటో తెలుసా..? బండి సంజయ్! మరే బీజేపీ నాయకుడూ, చివరకు హైదరాబాదులో ఉన్న ఏ నాయకుడూ వాళ్లకు గుర్తురాలేదు… ఇలాంటి విషయాల్లో అండగా నిలబడేది బండి సంజయే అని నేరుగా ఆ భరత్‌ను కరీంనగర్‌లో ఉన్న బండి సంజయ్ దగ్గరకు తీసుకుపోయారు… తాను మాస్ లీడర్…
కింది స్థాయిలో కార్యకర్త నుంచి ఎదిగిన నాయకుడు… నీకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చాడు… నువ్వు నమ్మింది నీ ఆటో వెనుక రాసుకున్నావు, భయపడేది లేదు… అది గాకపోతే మరో ఆటో కొత్తది కొనిస్తా, బేఫికర్‌గా ఉండు అని భుజం తట్టాడు… తనపై దాష్టికం చేసిన మజ్లిస్ మనుషులపై కేసు గురించి హైదరాబాద్ సీపీతో మాట్లాడతానన్నాడు… అదీ ఓ నాయకుడు వ్యవహరించాల్సిన తీరు…
ఇక్కడ మనం చెప్పుకునేది ఆ ఎపిసోడ్ గురించే కాదు… ఇలాంటి సమస్యలు వస్తే రాష్ట్ర బీజేపీలో ముందుగా తనే గుర్తుకొస్తున్నాడు… అది తను పెంచుకున్న నమ్మకం… అవసరమైతే చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి దగ్గర నిలబడి మరీ సవాల్ విసరగలడు, స్వీకరించగలడు… అదుగో అదే సొంత పార్టీలో కొందరికి కంటగింపు…
కరీంనగర్ కార్పొరేషన్‌ను బండి గెలిపించుకున్నాడు… కానీ నిజామాబాద్‌ను ధర్మపురి అరవింద్ గెలిపించుకోలేకపోయాడు… మరోవైపు కేసీయార్ వేటతో బీజేపీలోకి రక్షణ కోసం వచ్చిన ఈటల రాజేందర్‌కూ బండి అంటే పడటం లేదు, అవి కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయాలు… బండికి ఓ బలమైన వ్యతిరేకవర్గం తయారైంది…
సంజయ్‌కు తన కొడుకు భగీరథ్ అసలు సమస్య… అసలే బీఆర్ఎస్‌కు బండి అంటే మంట… దానికితోడు సొంత పార్టీలోని వ్యతిరేకవర్గం… ఇక భగీరథ్ ఇష్యూలో పెట్రోల్ చల్లారు, చాన్నాళ్లు బండికి ఇదే తలనొప్పి… (భవిష్యత్తులోనూ కొడుకు తనకు సమస్యే- తన ఇంటి సమస్యను తనే ఎలాగోలా దిద్దుకోవాల్సిందే)… బండి కేంద్ర మంత్రి పదవి పీకేయబోతున్నారని ప్రచారం చేశారు… ఇక బండి కెరీర్ క్లోజ్ అని ప్రాపగాండాకు దిగారు…
కానీ వనపర్తి భరత్ ఎపిసోడ్ చెబుతున్నది ఏమిటంటే..? బండి సంజయ్ పట్ల దిగువ కేడర్ దాకా నమ్మకం ఉంది… పార్టీ సొంతంగా పుంజుకుంటున్న దశలో, కేసీయార్ ఒత్తిడికి తలొగ్గి, కేవలం కేసీయార్ కోసం బీజేపీ హైకమాండ్ బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి, కేసీయార్ పట్ల కాస్త అనుకూల చతురత కనబరిచే కిషన్ రెడ్డికే మళ్లీ బాధ్యతలు అప్పగించింది… తరువాత రాంచందర్‌రావు వచ్చాడు…
ఇవన్నీ పార్టీలో బహిరంగ రహస్యాలు అయిపోయాయి… జుబ్లీ హిల్స్ ఉపఎన్నికలో బండి సంజయ్ ప్రచారంలోకి దిగేవరకు అక్కడ బీజేపీ ప్రచారం లేదు, ఒక్క నాయకుడి అలికడి లేదు, బీఆర్ఎస్ గెలవాలని చేజేతులా హైదరాబాద్ బీజేపీ నేతలు వదిలేశారు… కేటీయార్‌కు స్నేహహస్తం, బీఆర్ఎస్‌తో రహస్య సంసార సంకేతం..!! ఇదీ తెలంగాణ బీజేపీ పరిస్థితి..!!!
Share this Article