Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది కదా చదివి పొంగిపోవాల్సిన వార్త! పదిమందికీ షేర్ చేయాల్సిన వార్త!

March 23, 2024 by M S R

పోరాడితే పోయేదేమీ లేదు… ఒక తల్లీ కూతుళ్ల సాహసగాథ

ఇది కదా చదవి పొంగిపోవాల్సిన వార్త!
ఇది కదా చూసి అభినందించాల్సిన వార్త!
ఇది కదా పదిమందికి షేర్ చేయాల్సిన వార్త!

ఇంట్లో ఈగలకు, దోమలకు, నల్లులకు, బల్లులకు; వీధిలో పిల్లులకు, కుక్కలకు నిలువెల్లా వణికిపోయే మనం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వార్త ఇది.

Ads

హైదరాబాద్ బేగంపేట అంటే నగరం నడి బొడ్డు. మధ్యాహ్నం ఒకటిన్నర అంటే పట్ట పగలు. గుమ్మం ముందు ఇద్దరు యువకులు తుపాకీ పట్టుకుని…ఏయ్! కదిలారో కాల్చేస్తాం. మర్యాదగా డబ్బు, నగలు ఇచ్చి…ప్రాణాలు దక్కించుకోండి! ఖబడ్దార్! అని బెదిరించి గుండెలకు తుపాకీ ఎక్కుపెట్టారనుకోండి. మనమైతే ముందు వణికి, స్పృహదప్పి పడిపోతాం. పొరపాటున మనలో ధైర్యం ఇంగువ కట్టిన అవశేష వస్త్రంగా ఏ మూలనో మిగిలి ఉన్నా… నోట మాట రాదు. కాలు చేయి ఆడదు. పై ప్రాణాలు పైనే పోయి ఉంటాయి.

కానీ బేగంపేటలో తల్లి అమిత్ మహోత్, ఆమె కూతురు మనలా నీరుకారిపోలేదు. క్యాబే! అని సివంగుల్లా దొంగల మీదికి ఎగబడ్డారు. దొంగలతో తలపడ్డారు. పెనుగులాడారు. ఎక్కుపెట్టిన తుపాకీకి ఎదురెళ్లి మీద పడి లాక్కున్నారు. ఆ తుపాకీతోనే ఒకడికి దేహశుద్ధి చేశారు. ఒకడిని ఒడుపుగా ఇంట్లో బంధించారు. ఓవరాక్షన్ చేస్తే ఆ తుపాకీతోనే చంపేసేలా ఉన్నారని ప్రాణభయంతో ఒకడు గేటు దాకా పెనుగులాడి… జారుకుని… పరుగు పెట్టాడు. (తరువాత ఖాజీపేటలో పోలీసులకు పట్టుబడ్డాడు).

ఈలోపు చుట్టుపక్కలవారు వచ్చి ఇంట్లో ఉన్న దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వార్తగా చదివితే ఆ తల్లీ, కూతుళ్ల తెగింపు, పోరాట పటిమ, ఒకరిని మించి ఒకరు మీద పడి దొంగ ఆటకట్టించిన తీరు, సెకెనులో వెయ్యో వంతులో స్పందించిన వారి వేగం సరిగ్గా అర్థం కావచ్చు. కాకపోవచ్చు. ఆ తల్లి, ఆ తల్లికి తగినట్లు పదహారేళ్లు కూడా దాటని కూతురు గుమ్మంలో దొంగతో కలియబడ్డ వీడియో సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది.

మన ఇళ్లల్లో కూడా అమిత్ మహోత్ తల్లే ఉంది. ఆ తల్లి కూతుళ్లే ఉన్నారు. వంటింటి కుందేళ్లని, అబలని మనమే వారిలో అమిత పరాక్రమాలను, తెగింపును కట్టి పడేశాము. ఒకసారి ఆ కట్లు విప్పి చూడండి! ఎందరో మహోత్ ల మహోన్నతమైన తెగువను లోకం చూడగలుగుతుంది.

ఇలాంటప్పుడు కళ్ళల్లో, మాటలో, బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడా బెరుకు ఉండకపోవడమే సగం గెలుపు. తెగబడి ఎగబడితే ఊపిరే ఆయుధం; ఉక్కు పిడికిలే ఏ కె ఫార్టీ సెవెన్; మనకు మనమే ఒంటరి సైన్యం- అన్నదే మహోత్ తల్లి నుండి, తల్లికి తగ్గ ఆ తనయనుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం. అందిపుచ్చుకోవాల్సిన ధైర్యం.

ఎవరికైనా ఈరోజు చస్తే రేపటికి రెండో రోజే. బతికి ఉన్నప్పుడు బతుకును బతికించుకునే తెగువ ఉన్నవారి ముందు చావు సిగ్గుతో తలదించుకుని… వారికి దూరంగా వెళ్లిపోతూ ఉంటుంది.

(పదిమందికి ధైర్యం నూరిపోసేలా ఈ వార్త మీద నాలుగు ముక్కలు రాయాల్సిందిగా ప్రేమగా ఆదేశించిన పాఠకులకు నమస్సులతో…) పమిడికాల్వ మధుసూదన్  9989090018

(నిజానికి ఈ సంఘటన స్కూలింగు నుంచే ఆడపిల్లలకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది… ఈ సంఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరికీ మార్షల్ ఆర్ట్స్ తెలుసు, సమయానికి ఆ దుండగుడి చేతిలో తుపాకీ జామ్ కావడం కూడా వాళ్లకు మేలు చేసింది… మార్షల్ ఆర్ట్స్ తెలిసి ఉండటం ఆత్మరక్షణ పట్ల ఓ భరోసాను ఇస్తుంది, అదే సగం బలం… మార్షల్ ఆర్ట్స్ ఫిట్‌నెస్ స్పృహను, ఆరోగ్యరక్షణను కూడా నేర్పిస్తుంది… వర్తమానంలో దోపిడీలు, అత్యాచారాలు, ఇతర నేరాల నుంచి రక్షించుకోవడానికి కూడా మార్షల్ ఆర్ట్స్ ఎంత అవసరమో మన విద్యావిధానం మాత్రం అస్సలు పట్టించుకోదు… అది మరో విషాదం… మన తెలుగు మీడియా ఇవ్వాల్సినంత ప్రయారిటీ ఈ వార్తకు ఇవ్వలేదని అనిపించింది… దాదాపు ప్రతి ఇంగ్లిష్ పత్రిక, టీవీ, సైట్లు, బ్లాగులు కవర్ చేశాయి… కొన్ని అంతర్జాతీయ సైట్లు సైతం… ఆ తల్లీకూతుళ్ల ధైర్యానికి, ప్రతిఘటనకు ‘ముచ్చట’ నమోనమః ) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions