మృత్యువు ముద్దు (Kiss of Death) అని ఏదో ఇంగ్లిష్ పోస్టులో కనిపించింది… కానీ మనం మృత్యుపరిష్వంగం లేదా మృత్యుస్పర్శ అందాం… ఇంకా ఆయుష్షు ఉంటే సుడిగుండంలో పడినా నిక్షేపంగా బయటపడతాడని కదా పెద్దలు చెప్పేది… నాకు ఈ కథ విన్నాక అదే వినిపించింది… నొసటి మీద ఆయుష్షు రాసి పెట్టి ఉంటే, యముడి పాశం కూడా పొగలు రేగుతూ వచ్చినా సరే, చివరకు వాపస్ వెళ్లిపోతుంది… నిజం… భూమ్మీద నూకలు బాకీ ఉండాలి…
1968… రోకో మొరాబిటో ఈ ఫోటో తీసినందుకు ప్రఖ్యాత పులిట్జర్ ప్రైజ్ పొందాడు… ఈ అవార్డును విశేష ప్రతిభ కనబరిచిన వారికి జర్నలిజం, ఫోటోగ్రఫీ, సంగీతం, నాటకం, సినిమా రంగాల్లో వారికి ఇస్తుంటారు… (నిజంగా అవార్డులు ఇవ్వదలిస్తే మన గ్రామీణ జర్నలిస్టులకు ఎందరికి ఇవ్వాలో… ఎందుకంటే ఇలాంటి ఫోటోలు బోలెడు తీశారు మనవాళ్లు… తాటిచెట్టుకు నిర్జీవంగా వేలాడే గీతన్నలు, కరెంటు స్థంభాలపై మాడిపోయిన హెల్పర్లు… ఇలా ఎందరో… ) సరే అసలు విషయంలోకి వద్దాం…
Ads
ఈ ఫోటోలో ఇద్దరు ఎలక్ట్రిషియన్స్ ఉన్నారు… ఒకతని పేరు రాండాల్ ఛాంపియన్, మరొకరు జే థాంప్సన్… (ఇందులో థాంప్సన్ కరెంటు స్తంభం నుంచి వేలాడుతున్నాడు…) అసలు విషయం ఏమిటంటే… ఆరోజుల్లో విపరీతమైన వేడి అక్కడ… అవాంతరాలు, ఇబ్బందులు ముందుగా సూచించబడలేదు… ప్రతి ఇంట్లో ఏసీలు నడుస్తున్నయ్… ఫ్లోరిడాలో గ్రిడ్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది… కరెంటు వాడకం పెరిగి జాక్సన్ విల్లే నగరంలో పవర్ లైన్స్ మీద ప్రెజర్ పెరిగింది…
రాండాల్, థాంప్సన్ రొటీన్ మెయింటెనెన్స్ ఫీల్డ్ విజిట్స్‌లో ఉన్నారు… ఆ లైన్లలో కరెంటు ప్రసారమవుతోంది… రాండల్ పొరపాటున ఓ తీగెను తాకాడు… 4 వేల వోల్టుల కరెంటు తన దేహం గుండా ప్రసరించింది… వెంటనే గుండె ఆగిపోయింది… (నిజానికి మరణం తీసుకొచ్చే ఎలక్ట్రిక్ చెయిర్‌లో రెండు వేల వోల్టేజీ మాత్రం ఉపయోగిస్తారు… అంటే రాండాల్ దేహం గుండా డబుల్ డెత్ వోల్టేజీ ప్రసారమైనట్టు లెక్క…)
రాండాల్ నిర్జవ శరీరం ఒక్కసారిగా ఆ స్తంభానికి వేలాడసాగింది… షాక్… తనతోపాటు ఉన్న థాంప్సన్ ఆ షాక్‌లో తన విచక్షణను, బుర్రను కోల్పోలేదు… ప్రాప్తకాలజ్ఞత పనిచేసింది… అక్కడ ప్రతి క్షణం ప్రాణప్రదమైందే… విలువైందే… తను రాండాల్‌కు కృత్రిమ శ్వాసను ఇవ్వసాగాడు… అక్కడే, ఆ స్తంభం మీదే… కిందకు తీసుకొచ్చి సపర్యలు చేసే టైమ్ లేదు… కరెంటు స్తంభం మీద ఈ తక్షణ ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ చికిత్సకు కష్టమవుతోంది… కానీ వేరే మార్గం లేదు కదా…
ఒకవైపు ఆశ కనుమరుగవుతోంది… కానీ ఆయన పట్టు వదల్లేదు… ఆ గుండె తిరిగి కొట్టుకునే దిశలో తనకు తెలిసిన ప్రాథమిక చికిత్స ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు… మెల్లిగా పల్స్ అందుతోంది… అంటే రాండాల్ తిరిగి బతికాడు… మెల్లిగా రాండాల్ దేహాన్ని, స్తంభానికి కట్టేసి ఉంచే కిట్ విడిపించి, నేల మీదకు తీసుకొచ్చాడు… అదీ కష్టమే అయ్యింది… ఇక్కడ రోకో మొరాబిటో అనే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, తనే రెస్క్యూ టీంకు సమాచారం అందించాడు… వాళ్లు వచ్చారు…
రాండాల్ కళ్లు తెరిచి చూస్తున్నాడు… ఊపిరి బరువుగా పీలుస్తున్నాడు… తన గుండె కొట్టుకుంటోంది… నిస్త్రాణంగా కూర్చుండిపోయాడు… థాంప్సన్ సమయానుకూల ప్రయత్నం పుణ్యమాని రాండాల్ అప్పుడు బతకడమే కాదు, ఈ సంఘటన జరిగిన తరువాత 35 సంవత్సరాలు బతికాడు… తన 64వ ఏట, అంటే 2003లో మరణించాడు… అతన్ని బతికించిన ఆ థాంప్సన్ ఇంకా బతికే ఉన్నాడు… డెస్టినీ అంటే ఇదే…!!
Share this Article