అయ్యో, కేరళ సినిమా ఇండస్ట్రీలో ఇంత ఘోరంగా మహిళల లైంగిక దోపిడీ జరుగుతోందట, జస్టిస్ హేమ కమిషన్ మొత్తం బట్టబయలు చేసిందట, ఇంత ఘోరమా… అనే వార్తలు, విశ్లేషణలు, వివరణలూ, ఆ కమిటీ ముఖ్యాంశాలను నిన్నటి నుంచే ప్రచురిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు… ఒక్కమాట..? ఏ భాష సినిమా ఇండస్ట్రీ దీనికి భిన్నంగా ఉంది..?
హీరోయిన్ భావనపై ఓ హీరో గ్యాంగ్ చేసిన లైంగిక దాడి సంఘటన తరువాత ప్రభుత్వం ఈ కమిటీని వేసింది… ఇందులో సీనియర్ నటి శారద, మాజీ బ్యూరోక్రాట్ వత్సలకుమారి ఉన్నారు… ఎప్పుడో తమ రిపోర్టును ఇచ్చింది కమిటీ… కానీ ఇన్నాళ్లూ ఆపీ ఆపీ ఇక విధిలేక ప్రభుత్వం ఆ గోప్యతను వదిలేసింది… దానికి కారణాల లోతుల్లోకి వెళ్లడం ఇక్కడ అనవసరం గానీ… కమిటీ చెప్పినవాటిల్లో ముఖ్యమైనవి ఏమిటంటే..?
మహిళల్ని మరీ అంగడి సరుకుగా చూస్తున్నారు… పని ప్రదేశాల్లో భద్రత లేదు… కనీసం టాయిలెట్స్ కూడా ఉండవు… పిలిస్తే చాలు పక్కలోకి వచ్చి పడుకోవాలి… లేదంటే అప్రకటిత నిషేధం… జీతభత్యాల్లో వివక్ష… పని గంటలూ నిర్ణీతంగా ఉండవు… లైంగిక దోపిడీ, శ్రమ దోపిడీ సర్వసాధారణం… సర్దుకుపొండి, రాజీపడండి అనే సూత్రమే మహిళలపై రుద్దుతున్నారు… ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు… చేస్తే ఇక వేధింపులు తప్పవు… భద్రత కూడా ఉండదు, ఇండస్ట్రీ నుంచే తరిమేస్తారు… పెద్ద తారలకు మినహా మిగతావారికి ఒప్పందాలు ఉండవు, ఎంతిస్తే అంత తీసుకోవాలి…
Ads
కొందరు తారల పేర్లు కూడా ప్రస్తావిస్తూ, వాళ్ల అనుభవాల్ని కూడా ఈ కమిటీ తన రిపోర్ట్‌లో పొందుపరిచిందట… కానీ ఎందుకోగానీ నివేదికలో అవన్నీ తొలగించి, అంతిమ నివేదికను కుదించారట… బహుశా వాళ్ల ప్రైవసీ, భద్రతల గురించి జాగ్రత్త కావచ్చు… కనీసం కేరళ ఇండస్ట్రీలో తమపై జరిగే వేధింపులు, వివక్షల మీద గొంతెత్తేవాళ్లున్నారు… కానీ మిగతా భాషల ఇండస్ట్రీలలో… ఏమీ లేదు, ఇంతకుమించిన వివక్ష, దోపిడీ లేదా..?
ఈమాట అంటే..? ఏ ఫీల్డ్ భిన్నంగా ఉందనే ప్రశ్న వస్తుంది… నిజమే, దాదాపు అన్ని ఫీల్డుల్లోనూ ఇదే దురవస్థ… సినిమా ఇండస్ట్రీలో ఈ దోపిడీ నివారణకు ఏవో తాత్కాలిక చర్యలు ఆలోచించే బదులు స్థూలంగా ప్రతిచోటా మహిళల లైంగిక, శ్రమ దోపిడీల నివారణకు కఠిన చట్టాలు, చర్యలు అవసరం… ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయేమో, కానీ పోలీసులు, కోర్టుల దాకా వెళ్తే ఇక ఆయా బాధితులపై అప్రకటిత నిషేధాలు, కనిపించని వేధింపులు కామన్ అయిపోతున్నాయి… పైగా మీడియా గద్దలు బాధితులనే మరింత బాధపెడతాయి… న్యాయం కోసం ఖర్చు, ప్రయాస సరేసరి… ఇదీ కామనే…
అందుకే సర్దుకుపోతున్నారు… రాజీపడిపోతున్నారు… మన తెలుగు ఇండస్ట్రీల్లో లేదా క్యాస్టింగ్ కౌచ్..? ఎప్పుడూ ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది… ఆ దోపిడీ నిరంతరాయంగా అలా సాగిపోతూనే ఉంటుంది… కొంగుపరిస్తేనే కొనసాగింపు, పక్కలోకొస్తేనే పైసలు అన్నట్టు సాగుతున్న ధోరణికి అడ్డుకట్ట పడాలంటే ఈ కమిటీ సూచించినట్టు ఒక్క ఇండస్ట్రీకి పరిమితమయ్యే ట్రిబ్యునళ్లు అంతిమ పరిష్కారం కాదు… తిరగబడటం, సంఘటితం కావడం, ప్రశ్నించడం, స్వీయరక్షణ మహిళల నుంచే మొదలు కావాలేమో..!!
Share this Article