.
పెద్దోడికో న్యాయం-పేదోడికో న్యాయం..
ఒకేరోజు పత్రికల్లో రెండు వార్తలు- అందులో మొదటిది.. గౌరవనీయులైన కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బిరామిరెడ్డి గారు బ్యాంకులకు 5700 కోట్లు ఎగ్గొట్టి 2400 కోట్లకు సెటిల్మెంట్ చేసుకున్నారనే వార్త…
Ads
ఇక రెండో వార్త.. ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుల నుంచి ఆరున్నర లక్షలు అప్పు చేసి, కట్టలేక ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన దండుగుల రాజు అనే పేదవాడు…
ఇక్కడ ఇద్దరూ తెలుగువాళ్లే. ఇద్దరూ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నవాళ్లే… కానీ పురపరిచితులు, గౌరవనీయులు, పెద్దలు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారు బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్నారు..
కానీ నిరుపేద బ్యాంక్ కి లోన్ కట్టలేనేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. ఎక్కడ ఉంది తేడా.. అంటే … దానికి సమాధానం లేదు.. ఎందుకంటే ఇది డెమోక్రసీ.. ఇక్కడ ఇంతే.. పేదోడికో న్యాయం..పెద్దోడికో న్యాయం..
అబ్బబ్బా… గురువు గారు .. మీరు సూపరండీ .. ఏకంగా బ్యాంకులకి 5700 కోట్లు ఎగ్గొట్టారు .. కాదు, కట్టాల్సిన అవసరం లేకుండా సెటిల్ చేసుకున్నారు .. జనాల సొమ్మే కదా .. మీ ఇష్టం .. ఇండియాలో డబ్బున్నోడు ఇంకా డబ్బున్నోడు అవుతాడు .. పేదోడు ఇంకా పేదోడు ఎందుకు అవుతాడో తెలుసా? ఇదిగో ఇలాగే అన్నమాట ..
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టింది నేనే .. అని గర్వంగా అని చెప్పుకునేవారు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారు .. కేంద్ర మాజీ మంత్రివర్యులు , వైజాగ్ కి రెండుసార్లు ఎంపీగా పనిచేసిన రాజకీయనాయకులు , కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కూడాను ..
ప్రతి ఏటా .. ఆర్కే బీచ్ లో శివరాత్రికి లక్ష శివలింగాలతో అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు .. అంతేనా ..? అనేక సినిమాలు కూడా నిర్మించారు .. టీఎస్సార్ అవార్డ్స్ పేరుతో .. అప్పుడప్పుడు, తనకు గుర్తున్నప్పుడు అవార్డులు కూడా ఇస్తుంటారు.
ఆయనకు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ కంపెనీ బ్యాంకుల నుంచి 8100 కోట్ల లోన్ తీసుకుని ఎగ్గొట్టింది .. SBI , బ్యాంకు ఆఫ్ బరోడా , కెనరా బ్యాంక్ , పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఈ అప్పులు చేసి ఎగ్గొడితే వాళ్ళు మా డబ్బులు మాకు ఇప్పించండి అంటూ పెదరాయుడు NCLT లో పిటిషన్ వేశాయి ..
తీరా విచారించిన పెదరాయుడు .. సుబ్బిరామిరెడ్డి ఆయన కుటుంబాన్ని పిలిచి ప్రశ్నిస్తే వాళ్లు .. చివరికి 2400 కోట్లు కడతాము .. అంతకన్నా .. ఒక్క రూపాయి కూడా కట్టేది లేదని తేల్చి చెప్పారు .. ఈ బ్యాంకులోళ్లు అంతా కలిసి చచ్చినోడి పెళ్లికి వచ్చింది కట్నం అన్నట్టుగా ఒప్పేసుకున్నారు ..
అంటే సుబ్బిరామిరెడ్డి గారు .. 5700 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదు .. ఆల్రెడీ ఐపీ పెట్టిన ఈ కంపెనీని ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో యధావిధిగా పాత ఓనర్లే అంటే సుబ్బిరామిరెడ్డి గారే వెనక్కి తీసుకుంటున్నారు …
ఇక్కడ అప్పులిచ్చిన బ్యాంక్ మేనేజర్లు బాగానే ఉన్నారు .. అప్పు తీసుకుని ఎగ్గొట్టిన సుబ్బిరామిరెడ్డి గారు ప్యాలెస్ లో ఎంజాయ్ చేస్తున్నారు . కానీ ఇదంతా జనం సొమ్ము .. అడిగేదెవడు ? ప్రశ్నించేదెవరు? అంతా డబ్బు మాయ ? పలుకుబడికున్న పవర్ ఇది ..
ఇందులో ఇలాంటి కంపెనీకి వేల కోట్లు అప్పు ఇచ్చిన మేనేజర్లకు ముట్టిందెంత ? సెటిల్మెంట్ పేరుతో 2400 కోట్లకు ఒప్పుకున్న కెనరా బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతల కమిటీకి ముట్టింది ఎంత ? ఇది ప్రజాస్వామ్యం … ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు ..
డబ్బుకు కూడా డబ్బులున్నోడి దగ్గర బీరువాలో మూలగడమే ఇష్టం … పేదోడి చెమట కంపులో కరెన్సీ నోటు ఉండటానికి ఇష్టపడదు.. జయహో సుబ్బిరామిరెడ్డి గారు.. ఈ చిన్న లాజిక్ తెలీక పాపం .. కాఫీ డే .. సిద్ధార్థ లాంటి వ్యక్తి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు ..
ఇక సుబ్బిరామిరెడ్డి గారికి బ్యాంకోళ్లు 5700 కోట్లు మినహాయింపు నిచ్చిన ఈ శుభ సందర్భాన.. దేశంలో మనలాంటి దౌర్భాగ్యులందరికీ సుబ్బిరామిరెడ్డి గారు గంజి నీళ్లతో ఆర్కే బీచ్ లో పార్టీ ఇవ్వాలి ….ఈ సందర్భంగా బ్యాంక్ కి అప్పు కట్టలేక… ఆత్మహత్య చేసుకున్న దండుగుల రాజు ఆత్మకి శాంతి కలగాలని మరో జన్మలో దయచేసి ఇక్కడ మాత్రం పుట్టొద్దని విజ్ఞప్తి చేసుకుందాం.. అశోక్ వేములపల్లి
Share this Article