ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే… ప్రత్యేకించి రైతులకు సంబంధించి… జాగ్రత్తగా, ఆచితూచి, దీర్ఘకాలిక ప్రభావాలను కూడా ఆలోచించి, వర్తమాన స్థితిగతులను మదింపు వేసి ఆ తరవాతే అడుగులు వేయాలి… ప్రత్యేకించి బ్యూరోక్రాట్ల సంకుచిత, అపరిపక్వ ఆలోచనల పరిధిలోకి రాజకీయ నిర్ణయాలు లాగబడకూడదు…
ఉదయమే ఓ వార్త కనిపించింది… రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు తీసుకునే ప్రైవేటు రుణాలకు తనే వడ్డీ ఫిక్స్ చేయబోతోందని… బ్యాంకులిచ్చే వడ్డీని మించి రెండు శాతం దాటకూడకుండా చూడనుందని… మనీ లెండర్స్ యాక్ట్ అమలు చేయబోతోందని… ఆల్రెడీ ఉన్న పాత చట్టానికే కొత్త మార్గదర్శకాలు ఇస్తారని… జాతీయ బ్యాంకులు గరిష్టంగా ఏడాదికి 7 శాతం తీసుకుంటున్నాయని… ఇలా సాగిపోయింది వార్త…
Ads
అదేమీ ప్రభుత్వ ప్రకటన కాదు, ప్రభుత్వం ఇలా చేయబోతోందనే సమాచారం మాత్రమే… కాకపోతే ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ఆ అడుగులు వేస్తే ఏమవుతుందో ఓసారి చూడాలి… బ్యాంకులు 7 శాతం వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి కాబట్టి రెండు శాతం మించకూడదు అనుకుంటే, ప్రైవేటు రుణదాతలు 9 శాతం వరకూ వడ్డీ తీసుకోవచ్చు అన్నమాటే కదా… వోకే…
9 శాతం అంటే రూపాయి మిత్తీ కూడా కాదు… ముప్పావలా మిత్తీ… బయట ఇప్పటిదాకా 45 శాతం వరకూ వడ్డీలు వసూలు చేస్తున్నారని అదే వార్తలో ఉంది… ఎక్కడి 9 శాతం, ఎక్కడి 45 శాతం… ఈ కఠిన మార్గదర్శకాలు గనుక అమల్లోకి వస్తే ఇప్పటికే పెనం మీద ఉన్న రైతుల బతుకులు పొయ్యిలో పడ్డట్టు అవుతుంది… ప్రభుత్వమే చేజేతులా వాళ్లను మరింత సంక్షోభంలోకి నెట్టేసినట్టు అవుతుంది…
ప్రైవేటు వ్యాపాారులు నేరుగా రుణసాయమే కాదు… ఎరువులు, విత్తనాలు, పెస్టిసైడ్లు గట్రా ఇచ్చి, అందులో లాభమే కాదు, అరువు మీద వడ్డీ కూడా తీసుకుంటున్నారు చాలాచోట్ల… రేప్పొద్దున 9 శాతం మిత్తీ దాటొద్దు అంటే వ్యాపారులు ఇక రుణాలు ఇవ్వడమే మానేస్తారు… 9 శాతానికి ఎవరిస్తారు..? ఈ ప్రభావం రైతులపై, మరీ మరీ ప్రత్యేకించి కౌలు రైతులపై నెగెటివ్‌గా పడుతుంది…
ఎందుకంటే..? ప్రస్తుతం సమాజంలో అత్యంత సున్నితంగా ఉన్నవి కౌలు రైతులు బతుకులే… వాళ్లకు బ్యాంకు రుణాలు రావు, కౌలు చెల్లించాలి, పెట్టుబడులకు ప్రైవేటు రుణాలు తెచ్చుకోవాలి, వాళ్ల పంటల్ని సర్కారు కూడా కొనదు… బీమా రక్షణ ఉండదు… గాలిలో దీపం… ఏరకంగా పంట నష్టపోయినా ఇక ఆ రైతు బతుకు ఆగమాగం…
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల్లో కౌలు రైతులవే అధికం… ఒకరకంగా కౌలు వ్యవసాయం అంటేనే ప్రాణాలకు పణంగా పెట్టి చేసే వ్యవసాయం అన్నట్టుగా మారిపోయింది… ఈ స్థితిలో ఇక ప్రైవేటు రుణాలూ దక్కకపోతే ఇక కౌలు రైతు గతేమిటి..? సో, వడ్డీ రేట్లకు రీజనబుల్ పరిమితి పెట్టడమే గాకుండా… ఏదో ఓరకంగా కౌలు రైతులకు కూడా పట్టా రైతులకు దక్కే ప్రయోజనాల్ని వర్తింపజేయడమే ప్రభుత్వ కర్తవ్యం… దానికి మార్గాలు వెతకాలి…
నిరర్థక భూములు, పఢావు భూములు, ధనికుల భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా కేసీయార్ పెట్టుబడి సాయం ఇచ్చాడు… ఏటా కొన్ని వేల కోట్ల నిరర్థక వ్యయం… అసలు వ్యవసాయం చేయని పట్టా రైతులు కూడా బోలెడంత అపాత్ర సాయం పొందారు… నిజంగా ప్రభుత్వ సాయం దక్కాల్సిన కౌలు రైతులు అన్యాయమైపోయారు… రేవంత్ ప్రభుత్వం ఆలోచించాల్సింది ఈ కౌలు రైతుల కోణంలో… అప్పుడే నిజంగా వ్యవసాయం చేసే రైతుల మొహాల్లో కాస్తయినా వెలుగు నింపగలిగినట్టు అవుతుంది…!
Share this Article