ఒక ఫోటో నచ్చింది ఈరోజు… వార్తల్లోకెక్కిన ఫోటోయే… కర్నాటకలో జరిగిన ఓ పెళ్లి ఫోటో… వరుడు ఎవరంటే..? 2019 జూలైలో సూసైడ్ చేసుకున్న కాఫీ కేఫ్ డే సిద్ధార్థ హెగ్గే కొడుకు అమర్త్య హెగ్డే… తను మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ బిడ్డ కొడుకు… వధువు ఎవరంటే..? కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏమాత్రం అదృష్టం వరించినా సిద్ధరామయ్య స్థానంలో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు… ఇప్పటికీ కర్నాటకలో పవర్ ఫుల్ లీడర్ డీకే శివకుమార్ బిడ్డ ఐశ్వర్య… బయట గ్రామ స్థాయి వరకూ ఉప్పూనిప్పూగా కొట్టుకుంటారు కదా కాంగ్రెస్, బీజేపీ కేడర్… ఈ పెళ్లిలో అదంతా గాయబ్… రెండు పార్టీల అతిరథ మహారథులు చెట్టపట్టాల్ వేసుకుని, చుట్టరికాలు కలుపుకుని, వధూవరుల్ని ఆశీర్వదించి, విందు భోజనాల్లో ఆనందాన్ని పంచుకున్నారు… రాజకీయాలు ఒక దశ వరకే, అంతకుమించి అవి విషాల్ని, విద్వేషాల్ని సమాజంలో వ్యాప్తి చేయకూడదు అని చెప్పడానికి తాజా ఉదాహరణ… అందుకే ఫోటో నచ్చింది… అంతేకాదు…
రాజకీయ విద్వేషాలు, తన్నులాటలు, కొట్లాటలు ఎట్సెట్రా కేవలం కేడర్ కోసమే తప్ప… ఓ లెవల్ దాటాక అన్ని పార్టీల నాయకులూ పరస్పరం బంధుమిత్ర సపరివారమే అనే సోయి కూడా సమాజంలో ఇంకాలి… అలాగైతేనే పొలిటికల్ హింస కాస్త తగ్గుతుంది… ఇక ఈ పెళ్లి విషయానికొస్తే… అమర్త్య తల్లి మాళవిక కాఫీడే వ్యవహారాన్ని నిజాయితీతో కూడిన ఓ సవాల్‌గా స్వీకరించింది… దాదాపు 8 వేల కోట్ల అప్పుల్ని 3 వేల కోట్లకు తగ్గించింది… తమకు అప్పుపెట్టిన ఒక్కరికీ పైసా బాకీ లేకుండా చెల్లించి, ఒక్క ఉద్యోగినీ తీసివేయకుండానే… సంస్థను యథాతథంగా నడిపిస్తాననేది ఆమె హామీ… అదెంత కష్టమో అందరికీ తెలుసు… కానీ ఆమె చేస్తోంది… గతంలో ‘ముచ్చట’ ఆ వివరాల్ని రాసింది… తల్లికి తోడ్పాటుగా వర్క్ చేస్తుంటాడు అమర్త్య…
Ads
…. ఇది నిశ్చితార్థం నాటి ఫోటో… నిజానికి ఈ కుటుంబానికీ డీకే కుటుంబానికీ ఎంతోకాలంగా సాన్నిహిత్యం ఉంది… డీకే పెద్ద బిడ్డ ఐశ్వర్య తండ్రికి సంబంధించిన గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది… గత ఏడాది నవంబరులోనే ఈ నిశ్చితార్థం జరిగింది… ఈ పెళ్లి తేదీని కూడా అప్పుడే ఫిక్స్ చేశారు… అనుకున్నట్టుగానే పెళ్లి జరిగిపోయింది… ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో రాటుదేలిన డీకే అండ ఎలాగూ ఉంది, ఇప్పుడు బంధుత్వమూ కలిసింది… సో, కేఫ్ కాఫీ డే ఇంకాస్త వేగంగా కోలుకునే చాన్స్ ఉంది… మాళవికను చూసి పకపకా గేలిగా నవ్విన బిజినెస్ సర్కిళ్లకు ఆమె గెలుపు ఓ పాఠం కాావాలి… ఎందుకంటే ఆమె సంకల్పంలో అరుదైన నిజాయితీ ఉంది కాబట్టి… వందలు, వేల కోట్ల రుణ ఎగవేతలే సంస్కృతిగా మారిన మన వ్యాపారరంగంలో ‘‘ప్రతి పైసా చెల్లిస్తాను’’ అనే ఆమె పట్టుదల ప్రశంసనీయం కాబట్టి… ఆమెకు ఇప్పుడు కోడుకూకోడళ్లు తోడయ్యారు కాబట్టి… డీకేతో చుట్టరికం కలిసింది కాబట్టి…!! ఆమె ప్రస్థానంలో ఈ ఫోటో కూడా ఓ మెమరీగా ఉండబోతున్నది కాబట్టి…!!
Share this Article