ఆ నలుగురు… పదో తరగతి వరకూ కలిసి చదువుకున్నారు… పరీక్షలు అయిపోయాయి… నలుగురూ కలిసి వెళ్లి హోటల్‌లో టీ, బ్రేక్ ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నారు… ఓ ఆదివారం పూట సైకిళ్ల మీద ఓ హోటల్‌కు చేరుకున్నారు… పేర్లు దినేష్, ప్రవీణ్, మనీష్, సంతోష్… కథ కోసం మనమే పెట్టుకున్నాం… అల్పాహారం చేసి, టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు…
‘రేయ్, మనం జీవితంలో బాగా కష్టపడాలి… ఏం చదువుతామో, ఏ రంగంలోకి వెళ్తామో, మళ్లీ కలుస్తామో లేదో… ఓ పనిచేద్దాం… సరిగ్గా యాభై ఏళ్ల తరువాత ఇదే తేదీన, ఇదే హోటల్‌లో, ఇదే టైమ్‌కు కలుద్దాం… అనుభవాలు చెప్పుకుందాం…’ ఇదీ వారి వీడ్కోలు తీర్మానం… వాళ్లకు టీ సప్లయ్ చేసిన రాజు అన్నాడు వాళ్లతో… సార్, నేను అప్పటివరకూ ఇక్కడే ఉంటే, మీకోసం వేచి ఉంటాను, మళ్లీ మీకు ఆనందంగా టీ ఇస్తాను సార్’…
ఆ నలుగురూ విడిపోయారు… ఎవరి బతుకు వాళ్లది… ఎవరి కష్టం వాళ్లది… యాభై ఏళ్లంటే మామూలు విషయం కాదు కదా… నగరం పూర్తిగా మారిపోయింది… జనాభా పెరిగింది… రోడ్లు, ఫ్లయ్ ఓవర్లు, మెట్రోలు… అసలు నగరం రూపురేఖలే మారిపోయాయి… ఆ హోటల్ కూడా స్టార్ హోటల్ అయ్యింది… ఆ వెయిటర్ రాజు ఆ హోటల్‌కు ఓనర్ ఇప్పుడు… కాలం ఎవరిని ఏం చేస్తుందో ఎవరు చెప్పగలరు..?
Ads
యాభై ఏళ్లు పూర్తయ్యాయి… వాళ్లు అనుకున్న తేదీ వచ్చింది… హోటల్ డోర్ వద్దకు ఓ లగ్జరీ కారు వచ్చింది… దినేష్ కారు దిగాడు, వరండా వైపు నడుస్తున్నాడు… తను నగల వ్యాపారంలో ఉన్నాడు… మూడు జువెలరీ షాపులున్నయ్… రాజు తన వద్దకు వచ్చాడు, పరిచయం చేసుకున్నాడు… ఓనర్ షిప్ పొందినందుకు దినేష్ అభినందించాడు… ‘ప్రవీణ్ సర్, నెల క్రితమే టేబుల్ బుక్ చేసి పెట్టాడు సార్’ అని ఆ టేబుల్ వద్దకు తీసుకుపోయాడు రాజు…
కాసేపటికి, అంటే, ఓ గంట తరువాత సంతోష్ వచ్చాడు… సంతోష్ ఆ నగరంలోనే పెద్ద బిల్డర్… ఇద్దరూ పాత ముచ్చట్లు, కొత్త ముచ్చట్లు కలబోసుకుంటూ మిగతా స్నేహితుల కోసం ఎదురుచూస్తున్నారు… మూడో స్నేహితుడు మనీష్ మరో అరగంటలో వచ్చాడు… మనీష్ కూడా వ్యాపార రంగంలో ఉన్నాడనీ, సమీప నగరంలోని బిగ్‌షాట్స్‌లో తనూ ఒకడని తెలిసి సంతోషించారు… నాలుగో స్నేహితుడు ప్రవీణ్ కోసం నిరీక్షిస్తున్నారు…
టేబుల్ బుక్ చేసిందే తను, ఇంకా రాడేమిటి..? ముచ్చట్లు దొర్లుతున్నయ్… కాలం గడుస్తోంది… ప్రవీణ్ రాలేదు… టీ, బ్రేక్ ఫాస్ట్ అయిపోయింది… గంటలు గడిచిపోయాయి… ప్రవీణ్ రాలేదని మనసును చివుక్కుమనిపించినా, మిగతా ముగ్గురూ తమ పునఃకలయికను బాగానే ఎంజాయ్ చేశారు… తరచూ కలుసుకోవాలని కూడా అనుకున్నారు… అక్కడే లంచ్ చేశారు… బిల్లు అడిగితే, ఆన్‌లైన్‌లో ఆల్‌రెడీ చెల్లించబడినట్టు హోటల్ ఓనర్ రాజు చెప్పాడు స్వయంగా… ఇక అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో ఓ యువకుడు కారు దిగి వాళ్లవైపు వచ్చాడు…
‘‘సార్, సారీ… నేను మీ స్నేహితుడు ప్రవీణ్ కొడుకును, పేరు రవి… ఈరోజు మీరు వస్తారని నాన్న చెప్పాడు… మీరొప్పుడొస్తారా, ఎప్పుడు ముచ్చట్లలో మీతో కలిసిపోదామా అన్నట్టు పదే పదే గుర్తుచేసుకునేవాడు… గత నెలలో అనారోగ్యంతో నాన్న చనిపోయాడు… కానీ పోయేముందు ఒక మాట చెప్పాడు సార్, నేను ఈ లోకంలో లేనని తెలిస్తే, యాభై ఏళ్ల తరువాత ఆ ముగ్గురూ ఆనందంగా గడపలేరు… నా మరణం వాళ్ల పునఃకలయిక ఆనందాన్ని భగ్నం చేయొద్దు… అందుకే ఆలస్యంగా వెళ్లి, ఈ విషయం చెప్పాలని ఆదేశించాడు నన్ను…’’
సార్, నాన్న తరఫున ఒక్కసారి మిమ్మల్ని కౌగిలించుకుంటాను సార్, అదీ నాన్నే చెప్పాడు… అన్నాడు కళ్ల వెంట నీరు కారుతుంటే… ‘మా నాన్న టీచర్ అయ్యాడు, నన్ను కలెక్టర్‌ను చేయాలని ఎంతో కష్టపడ్డాడు… సార్, నేను ఈ జిల్లాకు కలెక్టర్‌ను, మీకు విషయం చెప్పొద్దని ముందే రాజుకు చెప్పి పెట్టాను… అన్నాడు వారి వైపు రవి చేతులు చాచుతూ… ఇక ఆ ముగ్గురికీ దుఖం ఆగలేదు… వచ్చి రవిని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు… ఆ కౌగిళ్లలో కల్మషం లేదు… మలినం లేదు… అదే మనం ఈ కథలో చెప్పుకున్నది… మనకు ఎందరున్నారు ఇలా..?
(ఇది నిజానికి చాలా భాషల్లో చాలా చక్కర్లు కొట్టిందే… రచయిత ఎవరో తెలియదు… కానీ చదవగానే దీన్ని చదవని ‘ముచ్చట’ పాఠకులతో షేర్ చేసుకోవాలని ఇలా కాస్త మార్పులతో రాశాను… మనుసులో చెమ్మ ఉన్నవాళ్లకు కళ్లు చెమ్మగిల్లుతాయి కదా… శ్రీనివాసరావు మంచాల)
Share this Article