తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌ను రాజీనామా చేయమని ఆదేశించారు… చేస్తాడు, తప్పదు… హాయిగా చేసేసి, సుబ్బరంగా శేషజీవితం విలాసంగా బతుకుతాడు… మరో ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించారు… ఆయనకేం, హేపీ… ఇన్నాళ్ల ఆర్జనలు చాలవా ఏం..? ఎటొచ్చీ ఆ మేడిగడ్డే ఇక పనికిరాకుండా పోతుందని తెలంగాణ బాధపడుతుంది…
అన్నారం కూడా అదే ఖాతాలో పడుతుంది… మల్లన్నసాగర్ భూకంపం రావొద్దని రోజూ కొమురవెల్లి మల్లన్నకు పెద్ద పట్నం వేసి మొక్కుతూ ఉంటుంది… వీళ్లే కాదు… టీఎస్పీఎస్సీ జనార్ధన్ రెడ్డి హేపీ… మునిగిపోయిన వేలాది మంది నిరుద్యోగులదీ ఖర్మ… ఏళ్లకేళ్లు సింగరేణిలో తిష్టవేసి, ఎట్టకేలకు కదిలిన శ్రీధరూ హేపీ… ఎక్కడో ఏదో ఓ పోస్టింగ్, మళ్లీ బీఆర్ఎస్ రాకపోదు అని నిరీక్షణ…
తెలంగాణ కరెంటు రంగాన్ని ఏకచ్ఛాద్రిపత్యంగా ఏలిన ప్రభాకరరావు కూడా సేఫ్… ఎన్నెన్ని అక్రమాలో, బాగోతాలో జానే దేవ్… ఎంచక్కా రిటైర్డ్ లైఫ్ గడిస్తే చాలు ఇక… అంతెందుకు..? అదే జయేష్ రంజన్ అదే పోస్టులో ఎంచక్కా కంటిన్యూ అవుతుంటాడు… ఏదో విజిలెన్స్ అదీ ఇదీ అన్నారు గానీ స్మిత సబర్వాల్ కూడా సేఫ్… ఏదో ఒక పోస్టింగ్… మళ్లీ మంచిరోజులు వచ్చేదాకా ఎంచక్కా ఇన్‌స్టా రీల్స్ చేసుకోవచ్చు… గెజిటెడ్ మమత సహా అందరూ సేఫ్…
Ads
నిన్న గవర్నర్ ప్రసంగం ఏ వాక్యాలతో ప్రారంభమైందో తెలుసా..? ‘‘అధికారమున్నదని హద్దుపద్దు లేక, అన్యాయ మార్గాల ఆర్జింపబూనిన, అచ్చి వచ్చే రోజులంతమైనాయి’’… అంతే… గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలపై ఒక్క ముక్క కూడా లేదు… కాలేశ్వరం విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇచ్చే అవకాశాల్లేవని హైకోర్టు చెబుతోంది… ఇప్పుడిక రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తాం అంటోంది రాష్ట్రం… సీబీఐ నేను దర్యాప్తు చేస్తాను అంటోంది… దాని చొరవ, ఆసక్తి ఎందుకు..? బీజేపీ ప్లాన్… ఒక్కసారి సీబీఐ చేతికి పోయిందంటే చాలు, ఇక ఊదు కాలదు, పీరు లేవదు… విజిలెన్స్‌కు మరీ లోతుగా వెళ్లి ఫిక్స్ చేసే సీన్ లేనట్టుంది… మరోవైపు మేఘా కృష్ణారెడ్డి సీఎంను కలిశాడు…
(రెరా బాలకృష్ణ ఛాంబర్ ప్రస్తుత దృశ్యం)
మొన్నమొన్నటిదాకా కాస్త బెదిరినట్టు కనిపించిన ఎల్‌అండ్‌టీ వాడు మళ్లీ మాట మార్చి, రిపేర్ల ఖర్చు మాది కాదు అనేస్తున్నాడు… పైగా ఆ సంస్థ చంద్రబాబుకు దగ్గర… సో, తెలంగాణ ప్రజల బొక్కసానికి లక్షన్నర కోట్ల భారీ బొక్కపెట్టిన కాలేశ్వరం అక్రమార్కులపై ఏదో చర్య ఉంటుందని ఊహించడమే సరికాదేమో ఇక… జస్ట్, రెరా శివబాలకృష్ణను మాత్రమే కాస్త ఒత్తుతున్నారు… సిటీలో చోటుచేసుకున్న వేల కోట్ల భూబాగోతాలు బయటపడాలంటే ఇంకా ప్రెషర్ అవసరం… సరే, రేవంత్‌కు అర్థమైందో లేదో తెలియదు గానీ… కేసీయార్, కేటీయార్, హరీష్ నెత్తుల మీద కత్తులు వేలాడదీయకపోతే… రేప్పొద్దున వాళ్లే రేవంత్ పాలిటి పదునైన కత్తులవుతారు…
రేవంత్‌కు ఎవరైనా చెప్పారో లేదో తెలియదు… యాంటీ నక్సల్స్ ఆపరేషన్లకు, కూంబింగ్‌కు వెళ్లేందుకు పోలీసులు మాజీ నక్సలైట్లను పైలట్లుగా తీసుకుపోతుంటారు… డంపులు, డెన్నులు సహా అన్ని వివరాలనూ పైలట్లు చూపించాల్సి ఉంటుంది… ఒకవేళ నక్సలైట్లు ఎక్కడో తారసపడి ఫైర్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఎగిరిపోయేది ఈ పైలట్లే… ఈలోపు పోలీసులు తుపాకులు సర్దుకుని అలర్ట్ అయిపోతారు…
ఇప్పుడు రేవంత్ సర్కారు చాలామంది ఉన్నతాధికారుల పట్ల ఉదాసీనత కనబరుస్తున్నట్టుగా ఉంది… రిటైరయినా ఇంకా వేల మంది కొలువుల్లోనే ఉన్నారు… చాలామంది కీలక స్థానాల్లో ఉన్నారు… డిప్యూటేషన్లు సరేసరి… పైగా కాలేశ్వరం, ధరణి, భగీరథ, హరితహారం వంటి పెద్ద ప్రాజెక్టుల్లో విపరీతంగా అక్రమాలకు పాల్పడిన లేదా సహకరించిన ఉన్నతాధికార్లనే పైలట్లుగా ముందుపెట్టి అసలు పెద్ద తలకాయలను ఫిక్స్ చేయాలి… కానీ ఏం జరుగుతోంది..? వాళ్లను సేఫ్‌గా తప్పించేస్తున్నారు..!! అధికార్ల నోళ్ల నుంచే అసలు నిజాల్ని బయటపెట్టిస్తే… ఇదుగో ఇలా ఉంటుంది…
Share this Article