Sankar G….. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్టీఆర్ జాతకం మార్చినవి ఆ రెండు చిత్రాలు… సత్యచిత్ర బ్యానర్ మీద శోభన్ బాబుతో తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రాన్ని కె యస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో నిర్మించారు నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలు. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. పాటలు అద్భుతంగా ఉంటాయి.
మలిచిత్రంగా శోభన్, వాణిశ్రీలతో కె విశ్వనాధ్ దర్శకత్వంలో ప్రేమబంధం చిత్రాన్ని నిర్మించారు ఈ నిర్మాతలు. పాటలు బాగున్నా సినిమా ప్లాఫ్ అయ్యింది. ముచ్చటగా మూడో చిత్రాన్ని ప్రారంభించారు సత్యచిత్ర నిర్మాతలు. హీరో శోభన్ అనుకున్నారు. హీరోయిన్ గా జయప్రద, జయసుధలను ఎంచుకున్నారు. రాజ్ కుమార్ హీరోగా కన్నడ లో సూపర్ హిట్ అయిన గంధదగుడి చిత్రకథను కొద్ది మార్పులతో కథను రాసుకున్నారు. అయితే శోభన్ బాబు ఈ చిత్రంలో తను నటించటం లేదని తప్పుకున్నాడు. అప్పుడు వారు ఎన్టీఆర్ ను సంప్రదించారు. అయన నటించటానికి ఒప్పుకున్నారు.
ఆ చిత్రం అడవి రాముడు. దర్శకుడు రాఘవేంద్రరావు, సినిమాస్కోపులో భారీగా ఈ చిత్రాన్ని నిర్మించారు.కనీవినీ ఎరుగని వసూళ్ళతో నాలుగు కేంద్రాల్లో సంవత్సరం ఆడింది. అప్పటికి ఎన్టీఆర్ కు నడివయసు దాటింది. సాంఘిక చిత్రాలు ఏవి హిట్టు కావటం లేదు. ఒక హిట్టు నాలుగు ప్లాఫులు పంధాన సాగుతుండేది. బడిపంతులులో వృద్ధుడిగా నటించి హిట్టు కొట్టినా, దానవీర శురకర్ణ లాంటి పౌరాణిక చిత్రం మాత్రమే గొప్ప హిట్టుగా నిలిచింది.
Ads
డబ్బుకులోకం దాసోహం, బంగారు మనిషి, ఎదురీత లాంటి చిత్రాల్లో హుందాతనంతో నిండిన పాత్రల్లో చేశాడు. కానీ అవి పెద్దగా ఆడలేదు. అసలు ఊసులోకి రాకుండా పోయిన చిత్రాలు ఉన్నాయి. తమ సొంత బ్యానర్ లో చేసిన తాతమ్మ కల, వేములవాడ భీమ కవి లాంటి చిత్రాలు ఘోరంగా ప్లాఫ్ అయ్యాయి. ఆ టైంలో శోభన్ బాబు తప్పుకున్న ఆ పాత్రలో తను చేయటంతో ఎన్టీఆర్ కు కొత్త ఇమేజ్ ఏర్పడింది. ఎటువంటి సెంటిమెంట్ లేని క్లీన్ ఎంటర్టైన్మెంట్. ఎక్కడా పెద్దగా బరువైన సన్నివేశాలు లేవు. జనాలకు కావాల్సిన మాస్ ఫార్ములా కనుక్కోబడింది. తర్వాత చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.
పల్లవి ఫిలిమ్స్ బ్యానర్ మీద యస్. వెంకటరత్నం అనే కెమెరామెన్ నిర్మాతగా మారి శోభన్, కృష్ణంరాజులతో వి. మధుసూదనరావు దర్శకత్వంలో ఇద్దరూ ఇద్దరే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీని తర్వాత శోభన్ హీరోగా ఈతరం మనిషి అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా ప్లాఫ్. డీవీ నరసరాజుతో ఒక కథ సిద్ధం చేయించిన వెంకటరత్నం మళ్ళీ శోభన్ బాబుతో మూడో చిత్రాన్ని ప్రారంభించాడు. అయితే ఎందుకో శోభన్ బాబు ఈ చిత్రాన్ని తిరస్కరించాడు.
డీవీ నరసరాజు నిర్మాతతో మనం ఎన్టీఆర్ ను అడుగుదాం అన్నాడు. వెంకటరత్నం ఎన్టీఆర్ కు దూరపు బంధువు కూడా. ఎన్టీఆర్ డేట్లు ఇస్తాడా అని సందేహపడితే నరసరాజు తను మాట్లాడుతాను అని చెప్పాడు. అన్నట్టుగానే ఎన్టీఆర్ కు కథ చెప్పి ఎన్టీఆర్ ను యముడిగా, యువహీరోగా బాలకృష్ణను నటింప చేద్దాం అని కోరాడు. అయితే ఎన్టీఆర్ హీరోగా తనే వేస్తానని యముడిగా సత్యనారాయణను పెట్టమన్నాడు. ఆ విధంగా తయారయ్యిందే యమగోల.
ఫుల్ లెంగ్త్ కామెడీ ఏంటర్టైనర్ గా ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి అనేక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆపై బరువైన సెంటిమెంట్ పాత్రలు లేకుండా పూర్తి వినోదం, ఊర మాస్ చిత్రాలు చేస్తూ పోయాడు. ఇక అక్కడి నుండీ ఎన్టీఆర్ గెటప్పు, సెటప్పు మొత్తం మారిపోయి మళ్ళీ పదేళ్ల వరకు తిరుగులేని ఇమేజ్ తో రాజకీయాల్లో వెళ్లే వరకు నంబర్ వన్ స్థానంలోనే ఉన్నాడు. ఎన్నికలకు ముందు విడుదలైన నా దేశం చిత్రానికి నిర్మాత కూడా పల్లవి ఫిలిమ్స్ వెంకటరత్నమే నిర్మాత కావటం విశేషం…
Share this Article