Bharadwaja Rangavajhala….. ఒకే పాయింట్ తో వచ్చిన రెండు నవలల కథ (పునః ) ………. యద్దనపూడి సులోచనారాణి గారి జీవనతరంగాలు నవలకున్నూ … పోల్కంపల్లి శాంతాదేవి అనే ఆవిడ రాసిన చండీప్రియ అనే నవలకున్నూ దారుణమైన పోలిక ఉంది …
ఎవుడ్రీడు, ఎప్పటి నవలల గురించో మాట్లాడతా ఉండాడు అని కోప్పడమాకండి … ఈ రెంటిలోనూ ఉన్న కామన్ పాయింటును సాగ్గొట్టి ఓ సినిమా తీసి పాడేయవచ్చనేది మాత్రమే నా ఉద్దేశ్యం … ఈ రెండు నవలలూ కూడాను తెలుగులో సినిమాలుగా కూడా అఘోరించాయి. ఈ సినిమాల్లో కూడా సహజంగానే ఈ దారుణపు పోలిక కొనసాగింది.
విషయం ఏటంటే … ఈ రెండు సినిమాల్లోనూ అన్నదమ్ములుంటారు. ఈ అన్నదమ్ములిద్దరూ కూడాను ఒకే తల్లికి పుట్టిన వారు కాదు. ఈ రెండు కథల్లోనూ తమ్ముళ్లు ప్రేమించిన అమ్మాయిల్ని అన్నలు వల్లో వేసుకోవడమనేది కామన్ పాయింటు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఏమిటంటే … జీవనతరంగాల్లోనేమో .. తమ్ముడు ప్రేమించిన అమ్మాయి సదరు తమ్ముడ్ని ఇష్టపడుతుంది . కానీ ప్రేమించదు.
Ads
తమ్ముడు మాత్రం పెళ్లి చేసేసుకోవాలనుకుంటాడు . తమ్ముడ్ని ఆపడానికి … అన్నగారు ఆ అమ్మాయికి మత్తిచ్చి పెళ్లాడి పెద్దమనిషి అవుతాడు.
చండీప్రియలోనేమో తమ్ముడు ప్రేమించిన అమ్మాయి తమ్ముడ్ని అస్సలు ప్రేమించదు ఇష్టమూ పడదు … కాదంటుంది. దీంతో ఆ అమ్మాయి పొగరు దించడానికి రంగంలోకి దిగిన అన్నగారు నెమ్మదిగా ఆ అమ్మాయికి దగ్గరై కథ నడిపిస్తాడు … తమ్ముడు బావురుమంటాడు.
రెండు నవలాచిత్రాల్లోనూ… అన్న పాత్ర కామన్ గా శోభన్ బాబే చేశాడు … హీరోయిన్ మాత్రం మొదటి సినిమాలో వాణిశ్రీ, రెండో సినిమాలో జయప్రద . ఆత్మాభిమానం ఉన్న హీరోయిన్ లన్జెప్పి మొదట్లో కొన్ని సీన్లు అల్లి … ఆ తర్వాత ఏవేవో రకరకాల ట్విస్టులు పెట్టి …. మగాడికి లొంగి ఉండమనే సందేశంతో … ముగించడమే రెండు నవలల్లోనూ జరుగుతుంది.
శోభన్ బాబు దుర్మార్గాన్ని రెండు నవలల్లోనూ హీరోయిన్లు అద్భుతమైన సంప్రదాయంగా అంగీకరిస్తారు. దీన్ని దరిద్రం అనుకోవచ్చు అని నాలాంటి దుర్మార్గులు అంటారు గానీ సంప్రదాయం ప్రకారం కరెక్టే… అంచేత ఇప్పుడు మనం ఏం చేయొచ్చంటే …
తమ్ముడ్ని ప్రేమించిన అమ్మాయి ఆ తమ్ముడి తరపున తనతో పంతానికి వచ్చిన అన్నయ్యను చూసి వాడి ఓవర్ యాక్షన్ ను చూసి అబ్బురపడి ..
అబ్బాయ్ … మీ తమ్ముడ్ని ప్రేమించిన మాట వాస్తవమే కానీ … అతను సైకలాజికల్ గా నా స్థాయి కాదు … స్ఫూన్ ఫీడింగ్ టైప్ … జీవితం అంటే భయపడే రకం వాడితో కష్టం కదా … అంచేత నువ్వు బెటరేమో అనిపిస్తోందిప్పుడు .. అతని మీద నాకు జాలితో కూడిన ప్రేమ లాంటిది ఉండేది … కానీ నీతో ఒరిజినల్ ప్రేమ ఉన్నట్టుగా గుర్తించాను గురూ … వాడ్డూయూసే అనేస్తుంది.
అప్పడు శోభన్ బాబు ఖంగారు భయమూ రెండూ పడిపోయి ఇంటికి పరిగెట్టుకుపోయి .. ఒరేయ్ దరిద్రుడా … అది పరమ అసాంప్రదాయపుదిరా అట్టాంటి దాన్ని ఎట్టా ప్రేమించావురా, మనమేంటి మన వంశమేంటి ? అని బావురుమంటాడు. నిజమా అని ఆ తమ్ముడు కూడా ఖంగారు పడిపోయేసి … ఆ అమ్మాయికి ఫోన్ చేస్తాడు.
అప్పుడు ఆ అమ్మాయి సిగరెట్ వెలిగించి … ఘట్టిగా ఓ దమ్ము లాగి… తమ్ముడూ, మీ అన్న భలే ఉన్నాడ్రా .. కాపోతే వాడు సాంప్రదాయం మట్టిగడ్డలు అంటూ ఏదో ఏడ్చాడు.. పైగా వాడేంట్రా? నీకు మత్తుమందిచ్చి పడుకోబెట్టి, నన్ను పిలిపించి, తాళి కట్టేసి గొడ్డులా తెచ్చి, మీ ఇంట్లో కట్టేసుకోవాలనుకుంటాడు.. పైగా ఇదంతా ఏదో త్యాగం మూడ్ లో చేసేస్తున్నానని వెధవ బిల్డప్పూ వాడూను.
వాడు వెధవే అయినప్పటికిన్నీ… వాడిలో ఒక ఫోర్స్ ఉందోయి … అది నాచే నచ్చబడింది… వాడేదో నాకూ మత్తివ్వాలని చూశాడుగానీ నాకు ఎక్కలేదు … ఎక్కకపోగా ప్రకోపించి ఏరా మనం పెళ్లాడితే ఎలా ఉంటుందన్నాను… భయపడిపారిపోయాడు … అంటుంది … వామ్మో అని వీడూ భయపడిపోతాడు …
అప్పట్నించీ అన్నదమ్ములు ఎక్కడ కనబడితే అక్కడ ఆ హీరోయిన్ చావగొట్టేస్తూంటుంది. భూలోకంలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి … అన్నదమ్ములు ఇద్దరూ ఈ అమ్మాయి నుంచీ తమను తాము కాపాడుకోడానికి అంతరిక్షానికి పోయి కలోగంజో తాగి బతుకుదాం అనే నిర్ణయం తీసుకోవడంతో సినిమా శుభం అని పడి ముగుస్తుంది…
Share this Article