నాలుగు కార్లు… కోట్ల నగదు… ఎటు పోయాయో తెలియదు… ఎక్కడున్నాయో తెలియదు… ఆఫ్టరాల్, ఈడీ అంటే తోపులు కాదు కదా… వాళ్లూ ఒకరకం పోలీసులే కదా… తెలియాలని ఏముంది…? వాళ్లకేమైనా దివ్యదృష్టి ఉండదు కదా…. విషయం అర్థం కాలేదు కదా… బెంగాల్ మమత కుడిభుజం పార్థ ఛటర్జీ కాళ్లూబొక్కలూ సాఫ్ చేస్తున్నారు కదా… ఇప్పటికి 50 కోట్లు, 5 కిలోల బంగారం బయటపడింది కదా… ఇంకా లాకర్స్, ఇతర ఫ్లాట్లు వెతకాల్సి ఉంది…
ఇంకా బినామీలు ఎవరున్నారో తవ్వాల్సి ఉంది… దెబ్బకు మమత కిక్కుమంటే ఒట్టు… ఒక దశలో సీబీఐ అధికారులనే నిర్బంధించి, వేధించి, నాది ఓ స్వతంత్ర రాజ్యం అన్నతరహాలో, నేనూ ఒక చంద్రబాబునే అనే పోకడతో గాంభీర్యం నటించిన మమత ప్రస్తుతం కుక్కిన పేను… సదరు పార్థ ఛటర్జీకి ఉన్న చాలామంది ‘‘ప్రియమైన స్నేహితురాళ్లలో’’ ఒకరైన అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు కార్లు ప్రస్తుతం కనిపించడం లేదు… అందులో ఫుల్లు క్యాష్ నింపి, రాష్ట్రం తరలించే ప్రయత్నాలు సాగినట్టు ఈడీ సందేహం…
అవి దొరకవు… కానీ అనుకోకుండా జార్ఖండ్‌కు చెందిన మూడు కార్లు దొరికాయి పోలీసులకు… ఫుల్ క్యాష్… కట్టలుకట్టలుగా కట్లపాములు… అవన్నీ ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కార్లు… అదే బెంగాల్ పోలీసులు పట్టుకున్నారు… వెంటనే ఈడీ ఎంటరైపోయింది… ఎహె, కౌంటింగ్ మెషిన్లు వస్తే తప్ప అదెంత డబ్బో చెప్పలేం అని ఎస్పీ చెప్పి తప్పించుకుంది…
Ads
ఇదంతా మన తెలుగు మెయిన్ స్ట్రీమ్‌లో రాదు… విషయం ఏమిటంటే..? ఆ ముగ్గురు జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఎవరు..? ఎందుకు ఈ క్యాష్‌తో ఎటు పారిపోతున్నారు..? మొన్న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికల్లో జార్ఖండ్ నుంచి జేఎంఎం మద్దతు ఇచ్చింది కాబట్టి ఆ వోట్ల సంఖ్యను వదిలేయండి… కానీ మరో 13 వోట్లు ఎక్కువ వచ్చాయి అక్కడ… ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను ద్రౌపదికి వోటేశానని చెప్పాడు… మరి మిగతా 13…? ఇంకెవరు..? జార్ఖండ్ కాంగ్రెస్ వోట్లే..?
అంటే జార్ఖండ్ కాంగ్రెస్ నుంచి 14 మంది బీజేపీ ఫోల్డ్‌లోకి వచ్చేశారన్నమాట… అక్కడ ఉన్నదే ఆర్జేడీ, జేఎంఎం, కాంగ్రెస్ ప్రభుత్వం,.. మహారాష్ట్రలోలాగే దాన్ని భగ్నం చేయాలనేది బీజేపీ ప్లాన్… జార్ఖండ్‌లో కాంగ్రెస్ సీట్లు 18… అందులో 14 మంది బీజేపీ ఫోల్డ్‌లోకి వచ్చేశారు… ఎటొచ్చీ బీజేపీకి అక్కడ ఓ ఏకనాథ్ షిండే కావాలి… ఈలోపు ఆ మిగిలిపోయిన ముగ్గురో నలుగురో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్యాష్‌తోపాటు కలకత్తాకు పారిపోవాలని ప్లాన్…
అసలే అక్కడ అర్పిత బాపతు నాలుగు నగదు కార్ల కోసం వేట సాగుతోంది… ఈ మూడు జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కార్లు దొరికాయి… ఇంకేముంది..? బుక్ చేశారు… నోట్లు లెక్కిస్తున్నారు… చివరాఖరికి ఏం జరుగుతుంది..? ఏముంటుంది..? ఆ సెక్యులర్ సర్కారును చిత్తగొట్టడం… కాంగ్రెస్‌కు ఇంకా భూస్థాపితం చేయడం, ఆల్‌రెడీ కొన్ని స్వయంకృత నేరాల్లో తనంతట తనే ఇరుక్కున్న హేమంత్ సోరెన్‌ను మళ్లీ లేవకుండా తొక్కడం…
జార్ఖండ్ కాంగ్రెస్‌కు సరిగ్గా సపోర్ట్ చేసే వాళ్లు ఢిల్లీలో లేరు… మరోవైపు అధికారాన్ని అనుభవిస్తున్న హేమంత్ సోరెన్ అటూఇటూ దిక్కులు చూస్తున్నాడు… మమత, కేజ్రీవాల్, ఠాక్రే తదితరులే అన్నీ మూసుకుని కిక్కుమనడం లేదు… ఈ స్థితిలో జార్ఖండ్ ప్రభుత్వం పరిస్థితేమిటి..?! చివరగా :: అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లు, కోట్ల కొద్దీ డబ్బు, నగలు, కార్లతో బతుకుతున్న అర్పిత ముఖర్జీ తల్లి ఎలా బతుకుతున్నదో ఓ మీడియా సంస్థ వెలుగులోకి తెచ్చింది… దారుణమైన స్థితిలోనే బతుకుతున్నది… మరి ఇన్ని అక్రమాలు, వేషాలు, అనైతికతతో సాధించేది ఏమున్నట్టు..?!
Share this Article