Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెళ్లి లేదు… పిల్లలు లేరు… అంతిమంగా మేనల్లుళ్లే వారసులు?

October 6, 2026 by M S R

.

మాయావతికి అలవాటే… మేనల్లుడిని దూరం పెడుతుంది, తరువాత తనే క్షమించేస్తుంది, పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుంది… అదొక విచిత్ర బంధం… మొన్నటికి మొన్న ఇక మేనల్లుడితో కటీఫ్ అనేసిన మాయావతి ఇప్పుడు పార్టీ జాతీయ కన్వీనర్‌ పోస్టు ఇచ్చేసింది…

ఈ వార్త చదవగానే… చకచకా మూడు కేరక్టర్లు బుర్రలో తిరుగుతాయి… ముగ్గురికీ పెళ్లిళ్లు లేవు, నెత్తుటి వారసులు లేరు… కానీ పొలిటికల్లీ స్ట్రాంగ్, మరి వారసులు..? ఆ ముగ్గురూ ఎవరంటే..? మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ… ముగ్గురికీ పెళ్లిళ్లు కాలేదు… ఇప్పుడంటే జయలలిత లేదు, కానీ అప్పట్లో ఓ సరదా జోక్ వినిపించేది… బ్రహ్మచారి వాజపేయికి ఈ ముగ్గురు బ్రహ్మచారిణులే చిక్కు సమస్యలు అని..!

Ads

ముగ్గురు మహిళా నేతలు.. మూడు వేర్వేరు వారసత్వ కథలు …పెళ్లి చేసుకోలేదు. సొంత పిల్లలు లేరు. అయినా దశాబ్దాల పాటు దేశ రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేశారు. కోట్లాది మంది కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. పార్టీలు నడిపారు. ప్రభుత్వాలు నడిపారు. ప్రత్యర్థులను క్షమించారు.. అవసరమైతే దూరం పెట్టారు. కానీ చివరకు ఒక ప్రశ్న మాత్రం ముగ్గురి జీవితాల్లోనూ ఏదో ఒక దశలో ఎదురైంది.

తమ తర్వాత ఎవరు? ఇప్పుడు మాయావతి– ఆకాశ్ ఆనంద్ ఎపిసోడ్‌తో ఆ ప్రశ్న మరోసారి దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

సెప్టెంబర్‌లో మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను కీలక బాధ్యతల నుంచి తప్పించడమే కాకుండా, బీఎస్పీ నుంచి పూర్తిగా విముక్తి కల్పిస్తున్నానని మాయావతి ప్రకటించింది… పార్టీకంటే కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్నది అప్పటి కారణం. ఆ తర్వాత ఆకాశ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. తన రాజకీయ గురువు, తల్లితో సమానమైన మాయావతిని మరో అవకాశం ఇవ్వాలని కోరాడు.

ఇప్పుడు అదే మాయావతి మళ్లీ మనసు మార్చుకుంది. ఆకాశ్‌ను బీఎస్పీ జాతీయ కన్వీనర్‌గా తిరిగి నియమించింది. పార్టీ, బహుజన్ ఉద్యమ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏదో కవరింగు… ఆకాశ్‌పై గతంలో తీసుకున్న నిర్ణయాలు, అతడిని మళ్లీ తీసుకోవడం.. ఇలా వరుస పరిణామాల మధ్య ఇది మూడోసారి తిరిగి పార్టీలోకి రావడం.

మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా ఒక హెచ్చరికను జత చేసింది. ఇక అంతా ఆకాశ్ ప్రవర్తన, పనితీరుపైనే ఆధారపడి ఉంటుందని చెప్పింది… ఉత్తదే… ఆమె మేనల్లుడి మీద ఆధారపడటం తప్ప వేరే మార్గంతరమూ లేదు… పార్టీ మీద ఆయన గ్రిప్ అలా పెరిగిపోయింది…

మాయావతికి పార్టీయే కుటుంబం. కానీ కుటుంబ సంబంధాలు మాత్రం పార్టీకి పూర్తిగా బయట ఉండలేదు. తమ్ముడు ఆనంద్‌కుమార్, ఆయన కుమారులు ఆకాశ్, ఇషాన్.. ఇలా రక్తసంబంధీకులు ఒక్కొక్కరుగా రాజకీయ వ్యవస్థలోకి వచ్చారు.

ఆకాశ్‌ను ఒకసారి తీసుకుంది. తొలగించింది. మళ్లీ తీసుకుంది. మళ్లీ దూరం పెట్టింది. ఇప్పుడు మరోసారి బాధ్యతలు అప్పగించింది… ఇది కేవలం ఒక మేనల్లుడు తిరిగి రావడం కాదు. పిల్లలు లేని ఓ రాజకీయ నాయకురాలి తర్వాతి తరం ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్నకు జరుగుతున్న ఒక ప్రయోగం కూడా.

female leaders

జయలలిత.. పెంచుకున్న కొడుకు..  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తనకు పెంపుడు కొడుకుగా ప్రకటించిన వి.ఎన్. సుధాకరన్ పెళ్లి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుధాకరన్ ఆమె అత్యంత సన్నిహితురాలు శశికళ మేనల్లుడు. సాక్షాత్తూ శివాజీ గణేశన్ మనవరాలితో అతడి వివాహం జరిగింది.

అది సాధారణ పెళ్లి కాదు. భారీ ఏర్పాట్లు. వేలాది మంది అతిథులు. కిలోమీటర్ల మేర ఊరేగింపు. విపరీతమైన ఆర్భాటం. అప్పట్లో ఆ పెళ్లి తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయ చర్చల్లోనూ పెద్ద అంశమైంది. సుధాకరన్‌ను జయలలిత రాజకీయ వారసుడిగా తయారు చేస్తున్నారన్న ప్రచారం కూడా బలంగా సాగింది.

కానీ అనుకున్నట్టు జరగలేదు… సుధాకరన్‌తో ఆ బంధం నిలవలేదు. జయలలిత అతడిని తర్వాత దూరం పెట్టింది… అయితే ఆమె జీవితంలో నిజమైన వారస స్థానం ఎవరిది? శశికళది. ఆమె ఒక సహాయకురాలు మాత్రమే కాదు. ‘ఆంతరంగికురాలు’… విడదీయలేని బంధం… శశికళను బయటకు పంపిన సందర్భాలు ఉన్నాయి. మళ్లీ దగ్గరకు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి… సో, జయలలిత వారసత్వం మరో భిన్నమైన కథ…

ఇక మమతా బెనర్జీ… ఆమెకూ పెళ్లి లేదు. సొంత పిల్లలు లేరు. కానీ తృణమూల్ కాంగ్రెస్‌లో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎదుగుదల మాత్రం ప్రత్యేకమైన అధ్యాయం… “మేనల్లుడేనా వారసుడు?” కంటే… “మమత తర్వాత తృణమూల్‌ను ఎవరు నడిపిస్తారు?” అన్నదే అసలు ప్రశ్న. ముగ్గురి కథలను కలిపి చూస్తే ఒక విచిత్రమైన సామ్యం కనిపిస్తుంది.

కీలక ప్రశ్న… ఒక లీడర్‌కు సొంత వారసులు లేనప్పుడు.. పార్టీకి వారసుడు ఎక్కడి నుంచి వస్తాడు? రక్త సంబంధం నుంచా? పార్టీ కార్యకర్తల నుంచా? సుదీర్ఘకాలం పక్కన నిలిచిన వ్యక్తి నుంచా? లేక ప్రజలే చివరికి వారసుడిని నిర్ణయిస్తారా? కొడుకు లేదా కూతురు… వాళ్లూ లేకపోతే ఎవరో ఓ కుటుంబ సభ్యుడు… అంతేనా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లి లేదు… పిల్లలు లేరు… అంతిమంగా మేనల్లుళ్లే వారసులు?
  • ఉన్నవాడి ఔదార్యమూ గొప్పదే- లేనివాడి ఔదార్యం మరీ మరీ గొప్పది !!
  • ఎంతకు తెగించావురా..? ఆ ‘యావ’తో జీవిత ఖైదీనే వదిలేశావు!!
  • తప్పే- కానీ ఆ తప్పు తీవ్రత ఎంత..? తప్పుచేశానా? ఓ రిపోర్టర్ స్వగతం!!
  • ‘డోరతి’ మూవీ… ఇది ‘మరో చరిత్ర’… మరో అంటరాని చరిత్ర…
  • చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌పై సుప్రీం అధికారాల పరిధి ఏమిటనేదీ కీలకప్రశ్నే!!
  • సేమ్… ఫ్రాన్స్‌లోనూ బొద్దింకలు – ఈ స్క్రిప్టులు రాస్తున్నదెవరు?!
  • విడాకులు – సెటిల్మెంట్ చిక్కులు ! న్యాయంలో ఏదో తేడా కొడుతోంది !!
  • దృశ్యం: ది కన్‌క్లూజన్ — మాతృకను వదిలి.. మ్యాజిక్‌ పట్టుకున్నారు..
  • తప్పులు చేసి జైలుకు వెళ్లొచ్చినా… ఇంకా దిగినట్టు లేదు ఈ *విలన్‌కు..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions