.
Subramanyam Dogiparthi
….. ఈమధ్య కాలంలో బాంక్ లోన్ల విషయంలో ట్రోల్ అయిన టి. సుబ్బరామిరెడ్డి నిర్మించిన ఈ త్రిమూర్తులు సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . ముందు అవి చెప్పుకుందాం . పద్మనాభం నిర్మించిన దేవత సినిమాలో సినిమా పిచ్చోడు పద్మనాభం మద్రాసు వెళ్ళి సినిమా ఏక్టర్లను కలిసే సీన్లు గొప్పగా పేలాయి ఆరోజుల్లో .
అలాగే ఈ త్రిమూర్తులు సినిమాలో ఒక పాటలో తెలుగు సినిమా హీరోలు , హీరోయిన్లు , ప్రముఖులు తళతళా తళుక్కుమని మెరుస్తారు . ఆంధ్రజ్యోతి , జ్యోతిచిత్ర అవార్డుల ఫంక్షనుకు తెలుగు టాప్ నటీనటులు రావటాన్ని ఆ పాటలో పెట్టారు .
Ads
కృష్ణ , శోభన్ బాబు , కృష్ణంరాజు , చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , చంద్రమోహన్ , మురళీమోహన్ , విజయశాంతి , విజయనిర్మల , రాధిక , రాధ , పరుచూరి బ్రదర్స్ తళుక్కుమంటారు . ఈ పాట ఈ సినిమాకు ఐకానిక్ పాట అయిపోయింది .
మరో విశేషం బహుశా ఇప్పటి తరానికి తెలియనిది . ఈ సినిమాలో రివాల్వింగ్ హోటల్ అనే ప్రస్తావన వస్తుంది . ఆ హోటల్ని సత్యనారాయణ కొన్నట్లు చూపిస్తారు . ఆ హోటల్ని కూడా చూపుతారు . అదేంటంటే ఆరోజుల్లో హైదరాబాద్ బంజారాహిల్సులో హోటల్ భాస్కర్ పేలస్ అని ఉండేది .
అందులో టాప్ ఫ్లోర్లో రివాల్వింగ్ రెస్టారెంట్ ఉండేది . నేను రెండు సార్లు వెళ్ళాను . ఆ తర్వాత కాలంలో దాన్ని కేర్ హాస్పిటల్ వారు కొన్నారు . ఇప్పటికీ ఆ హాస్పిటల్ ఉంది అక్కడ . పేషంటుగా నేను ఈ హాస్పిటలుకూ వెళ్ళాను . ఈ రెండూ ఈ సినిమాకు ప్రత్యేక విశేషాలు .
ఇంక సినిమాకు వద్దాం . హిందీలో హిట్టయిన నసీబ్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . 1981 లో వచ్చిన ఈ హిందీ సినిమాలో అమితాబ్ , శతృఘ్న సిన్హా , రిషికపూర్ , హేమమాలిని , రీనారాయ్ , కిం నటించారు . దీనిని తమిళంలో కూడా 1983 లో రీమేక్ చేసారు . శివాజీ గణేషన్ , ప్రభు , శ్రీదేవి , సుజాత , రాధ నటించారు . సిల్వర్ జూబిలీ ఆడింది .
తెలుగులో వెంకటేష్ , అర్జున్ , రాజేంద్రప్రసాద్ , శోభన , ఖుష్బూ , అశ్విని లీడ్ రోల్సులో నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , రావు గోపాలరావు , నూతన్ ప్రసాద్ , త్యాగరాజు , సుధాకర్ , బాలాజి , రాంజీ , సుత్తి జంట , అల్లు రామలింగయ్య , కె విజయ , సుమిత్ర , అనిత , మమత , తదితరులు నటించారు . ప్రముఖ హిందీ నటుడు అనుపం ఖేర్ కూడా నటించారు .
నలుగురు స్నేహితులకు ఒక తాగుబోతు బిల్ చెల్లించలేక లాటరీ టికెట్టును నాలుగు రాపాయలకు ఇచ్చేస్తాడు . దానికి 72 లక్షల లాటరీ తగులుతుంది . నలుగురిలో ఇద్దరు ఒకడిని చంపేసి , ఆ నేరాన్ని మరొకడి మీదకు తోసేస్తారు . ఆ మిత్రుడు విదేశాలకు పారిపోతాడు .
ఈ నలుగురి సంతానం పెద్దయ్యాక పాత ఎకౌంట్లను సరిచేసుకోవటమే సినిమా అంతా . మల్టీ స్టారర్ కావటం వలన ఏక్టర్ల ఓవర్ క్రౌడింగ్ కాస్త కనిపిస్తుంది . బప్పీలహరి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో బాగానే ఉన్నా బయట పెద్దగా హిట్ కాలేదు .
టాప్ నటీనటులు అందరూ కనిపించే పాట ఒకే మాట ఒకే బాట మతం లేదు కులం లేదు అనేదే బయట కూడా బాగా హిట్టయింది . ఈ పాట కోసమే జనం ఈ సినిమాకు వెళ్ళారు . అయ్యయ్యో అయ్యయ్యయ్యో , శీతాకాలం , బైబైబై , మంగ్చావ్ మంగ్చావ్ , ఈ జీవితం అంటూ సాగుతాయి పాటలు . పాటల్ని ఆత్రేయ , వేటూరి వ్రాసారు .
1987 జూలైలో వచ్చిన ఈ సినిమా డైలాగులను పరుచూరి బ్రదర్స్ పదునుగానే వ్రాసారు . కె. మురళీ మోహనరావు దర్శకత్వం వహించిన మన తెలుగు సినిమా హిందీ , తమిళ సినిమాలు లాగా ఆడలేదు ఎందుకనో !
సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . It’s an action oriented , romantic , hilarious , feel good entertainer . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article