It’s a story of infatuation and criss cross love . అనగనగా ఒక రాజు , ఆయన కుమారుడు అడవిలో నడుస్తూ ఉంటారు . వారికి ఇద్దరు స్త్రీల కాలి ముద్రలు కనిపిస్తాయి . తండ్రీకొడుకులు ఒక ఆలోచన చేస్తారు . పెద్ద కాలి ముద్ర ఉన్న స్త్రీని తండ్రి , చిన్న కాలి ముద్ర ఉన్న స్త్రీని కుమారుడు వివాహం చేసుకునేలా తీర్మానించుకుంటారు . గబగబా నడుస్తూ ఆ ఇద్దరు స్త్రీలను కలుసుకుంటారు . అనూహ్యంగా పెద్ద ముద్రలు కుమార్తెవి , చిన్న ముద్రలు తల్లివి అవుతాయి .
ముందుగా అనుకున్నట్లే తండ్రి కూతురిని , కొడుకు తల్లిని పెళ్లి చేసుకుంటారు . ఓ సంవత్సరానికి ఇద్దరికీ చెరో కొడుకు జన్మిస్తాడు . ఇప్పుడు వాళ్ళిద్దరు ఏ వరుసతో పిలుచుకోవాలి ? ఈ ప్రశ్ననే భేతాళుడు పట్టు వదలని విక్రమార్కుడికి వేస్తాడు భేతాళ కధల్లో . మాతరం వాళ్ళం ఈ భేతాళ కధల్ని చందమామలో చదువుకున్నాం . ఇదే ఈ తూర్పు పడమర సినిమా కధ . తేడా ఒకటే . భేతాళ కధలో పెళ్లి అవుతుంది . సినిమాలో పెళ్ళికి ముందే ఈ ప్రశ్న ఉత్పన్నమై , ఎవరి స్థానాల్లో వాళ్ళు సర్దుకుంటారు .
మామూలు కధ కాదు . ఇదేం చోద్యం కధ . వయసు తేడాలు ఉన్నా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకునే జంటలు , జీవితాంతం పెళ్లి లేకుండా ప్రేమించుకునే జంటలు కుప్పలుకుప్పలు . ఇక్కడ చోద్యం ఏమిటంటే తండ్రీకొడుకులు తల్లీకూతుళ్ళను పెళ్లి చేసుకోవాలని అనుకోవటం . ఆ పరిస్థితి రావడానికి కారణాలను కధలో బాలచందర్ చాలా బాగా , కన్విన్సింగుగా ఎస్టాబ్లిష్ చేసారు . అందుకే కధ చోద్యమయినా , ముక్కు నోరు మీద వేలు వేసుకునేదయినా తమిళం , తెలుగులలో బాగా అడటమే కాకుండా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యాయి .
Ads
బాలచందర్ తమిళంలో అపూర్వ రాగంగళ్ అనే టైటిల్ తో శ్రీవిద్య , కమల్ హసన్ , మేజర్ చంద్రశేఖర్ , జయసుధ , రజనీకాంత్ , నాగేష్ లతో తీసారు . దానికి రీమేకే మన తూర్పు పడమర . దాసరి నారాయణరావు దర్శకత్వంలో ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనరుపై రాఘవ నిర్మించారు . శ్రీవిద్య , నాగేష్ తమ తమ పాత్రలను రిపీట్ చేసారు . కమల్ హసన్ పాత్రను నరసింహరాజు , మేజర్ చంద్రశేఖర్ పాత్రను సత్యనారాయణ , జయసుధ పాత్రను మాధవి , రజనీకాంత్ పాత్రను మోహన్ బాబు వేసారు .
ఈ సినిమాలో నలుగురినీ మెచ్చుకోవాల్సిందే . బ్రహ్మాండంగా నటించారు . మాధవికి ఈ సినిమా మొదటిదా లేక ఊరుమ్మడి బతుకులు మొదటిదా అనేది నాకు తెలియదు . ఈ సినిమాలో మాత్రం నూతన నటిగానే పరిచయం చేయబడింది . శ్రీవిద్య , సత్యనారాయణలు అద్భుతంగా నటించారు . మరింకెవరినీ ఊహించుకోలేము అన్నట్లుగా నటించారు .
ఈ సినిమా సక్ససుకు కధ , నటీనటులు , దర్శకత్వం , మాటలు ఎలా కారణమో , వాటన్నంటికీ మిన్నగా రమేష్ నాయుడు సంగీత దర్శకత్వం , సి నారాయణరెడ్డి సాహిత్యం కారణాలు . స్వరములు ఏడయినా రాగాలెన్నో పాటలో కావలసినంత వేదాంతాన్ని దట్టించారు సినారె . జుర్రుకున్న వారికి జుర్రుకున్నంత . కనులున్నప్పుడు కలలు తప్పవు , కలలున్నప్పుడు పీడ కలలు తప్పవు . జీవిత సారాంశం .
మరో గొప్ప పాట . తూర్పూ పడమర ఎదురెదురు పాట . టైటిల్ సాంగ్ . ఆ పాటలో కూతురు , కొడుకులు తమ తమ స్థానాల్లోకి వెళ్ళి కూర్చోవటం కధకు ముగింపు . Hats off to Balachandar . శివరంజనీ నవరాగిణీ పాట . సాహిత్యం , చిత్రీకరణ , సంగీతం , అన్నీ అద్భుతం . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , కోవెల శాంత శ్రావ్యంగా పాటల్ని పాడారు .
ఈ మూడింటికీ తీసిపోని మాటలు లేని జతి స్వరం శబ్దం ద్వారా చాలా అందంగా ఉంటుంది . శ్రీవిద్య స్నానం చేస్తుండగా , బయట నరసింహరాజు మద్దెలను వాయించే సీన్ సూపర్బ్ . శ్రీవిద్య నటన సూపర్బ్ . దాసరిని తప్పక అభినందించాల్సిందే . సాగర సంగమం సినిమాలో జయప్రద స్నానం చేసే సీనును ఇలాగే ఇంత అందంగా చూపారు విశ్వనాధ్ . నవుతారు విరగపడి నవుతారు పాటలో సత్యనారాయణ నటన చాలా బాగుంటుంది .
రెండు వేర్వేరు క్రిస్ క్రాస్ ప్రేమలు . సత్యనారాయణను మాధవి , మంజుభార్గవి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు . ఎవరూ చేసుకోరు . శ్రీవిద్యను నరసింహరాజు , నాగేష్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు . ఇద్దరూ చేసుకోలేరు . అసలు భర్త మోహన్ బాబు భార్య చేతుల్లోనే క్లైమాక్సులో చనిపోతాడు .
ఈ సినిమాలో సి నారాయణరెడ్డి కాసేపు కనిపించి ఎవడయ్య వాడు తెలుగువాడు అని తెలుగు వాడి పంచె కట్టుడు , కండువా , గోంగూరల గురించి అలరిస్తారు . అలాగే మురళీమోహన్ కూడా తళుక్కుమంటాడు . మంజు భార్గవిది కూడా గుర్తుండిపోయే పాత్రే .
1975 లో తమిళంలో , 1976 లో తెలుగులో , 1984 లో హిందీలో ఏక్ నయీ పహేలీ టైటిల్ తో సినిమాలు వచ్చాయి . హిందీలో శ్రీవిద్య పాత్రని హేమమాలిని వేసింది . మాధవి పాత్రను పద్మిని కొల్హాపురి , సత్యనారాయణ పాత్రను రాజ్ కుమార్ , నరసింహరాజు పాత్రను కమల్ హసన్ , నాగేష్ పాత్రను మెహమూద్ వేసారు . బాలచందరే డైరెక్ట్ చేసారు . హిందీలో గొప్పగా ఆడినట్లు లేదు .
ఇంతకుముందు చూడనట్లయితే తప్పక వాచ్ లిస్టులో పెట్టేసుకోండి . పాటల్ని మాత్రం అస్సలు మిస్ కావద్దు . Unmissable . అన్నీ యూట్యూబులో ఉన్నాయి . అప్పుడప్పుడు టివిలో కూడా వేస్తుంటారు . ఈతరంలో వాళ్ళు చందమామ కధల్ని చదివి ఉండకపోతే నెట్లో ఉంటాయి , చదవండి . మీ పిల్లలకు కాలక్షేపంగా చెప్పండి . A watchable , musical , entertaining movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article