నిన్న పొద్దుణ్నుంచీ ఎదురు చూస్తున్నా… ప్చ్, ఈ వార్త మీద సోషల్ మీడియా, టీవీ మీడియా, సైట్స్ ఏమైనా స్పందిస్తాయేమో, ఏమైనా రాస్తాయేమో అని… నిరాశే… అసలు ఈ పత్రికే ఇంకాస్త ప్రయారిటీ ఇచ్చి ఉండాల్సింది… సరే, వాళ్ల పత్రిక, వాళ్లిష్టం… కానీ మనం ఎలాంటి పాలన వాతావరణంలో బతుకుతున్నామో సరిగ్గా అర్థమై ఓరకమైన వైరాగ్యం ఆవరిస్తుంది మనకు… పాలితుడంటే పాలకులకు ఎంత అలుసో అర్థమవుతుంది… పాలితుడంటే సగటు మనిషి, పాలకుడు అంటే పోలీస్, ఉన్నతాధికారులు, నాయకులు… అహం… నిలువెల్లా… మన సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయో అవగాహన కల్పించే వార్త… (పెద్ద పేరున్న పెద్ద పత్రికల్లో ఈ వార్త కనిపించలేదు… బహుశా జిల్లా పేజీల్లో క్రైం కార్నర్‌లో వేసి ఉంటారు… చాలా సెన్సిటివ్, సెన్సిబుల్ జర్నలిజం కదా…)
వార్త ఏమిటంటే..? ఇల్లెందులో నంబర్2 బస్తీలో ఉంటాడు సుందర్‌లాల్… ఓ ఎడ్ల బండి ఉంది… కిరాయికి నడుపుకుంటూ బతుకుతుంటాడు… గత నెల 29న 21 ఏరియా నుంచి తన బండి తీసుకుపోతున్నాడు… 24 ఏరియాలో సింగరేణి జీఎం ఇల్లు ఉంటుంది… దాని ముందు నుంచి వెళ్తూ ఎద్దు మూత్రం పోసింది… ఎంత ధైర్యం దానికి..? ఓ జనరల్ మేనేజర్ ఇంటి ముందే మూత్రం పోస్తుందా అది… అసలు సుందర్‌ది కాదా తప్పు… ఎద్దుకు ఏం బుద్ది నేర్పినట్టు..? ఛస్, లోపలేయండి అనుకున్నారు…
Ads
వెంటనే సింగరేణి గార్డులు ఈ క్రూరమైన నేరంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు… కాదు, ఫిర్యాదు చేశారు… వెంటనే యుద్దప్రాతిపదికన కదిలిన పోలీసులు సదరు ఎద్దు మళ్లీ అటువైపు వెళ్తూ ఈసారి పేడ కూడా వేయకుండా ముందుజాగ్రత్తగా సుందర్‌ను ఠాణాకు పట్టుకుపోయారు… నీ ఎద్దు చేసిన నేరానికి నీమీద సెక్షన్ 290 (న్యూసెన్స్) పెడుతున్నాం అన్నారు… నా ఎద్దు ఎక్కడ మూత్రం పోస్తుందో నాకెట్లా తెలుస్తుంది, అక్కడే జీఎం ఇల్లు ఉందని దానికేం తెలుసు..? మీ బాంచనైత, వదిలెయ్యిండ్రి అని బతిమిలాడాడు…
శాంతిభద్రతలు, ఉన్నతాధికారుల గౌరవప్రపత్తులపై ఏమాత్రం రాజీపడని పోలీసులు కేసు పెట్టారు, జడ్జి ముందు ప్రవేశపెట్టారు… జడ్జి 100 రూపాయల జరిమానా వేశాడు… అవీ చెల్లించే సీన్ లేకపోవడంతో చివరకు ఓ కోర్టు కానిస్టేబుల్ తన జేబు నుంచి ఆ వంద కట్టి విడిపించేశాడు… ఇదీ వార్త… సుందర్ కావాలనే జీఎం ఇంటి ముందు బండి ఆపి, ఎద్దు మూత్రం పోసేదాకా ఆగి, ఆ తరువాతే వెళ్లిపోతాడని సింగరేణి సెక్యూరిటీ స్టాఫ్ ఆరోపణ… ఓపెన్ కాస్ట్ ఏర్పాటులో భూమిని కోల్పోయిన సుందర్‌కు పరిహారం రావడం లేదట, అందుకే ఈ నిరసన ప్రదర్శిస్తున్నాడట…
ఒకవేళ అదే నిజమైతే వినూత్న నిరసన… ఉన్న భూమి లాక్కుని పరిహారం ఇవ్వకపోతే కడుపు మండదా ఓ పేదవాడికి..? ఆఫ్టరాల్ ఎద్దుతో మూత్రం పోయించాడు, దాన్ని మానవతాకోణంలో చూడాల్సింది పోయి, ఏదో జీఎం ఇల్లు అపవిత్రం అయిపోయినట్టు ఎందుకంత ఓవరాక్షన్..? పోనీ, కరెక్టు కాదనుకుందాం, కేసు, జరిమానా దాకా అవసరమా..? ఓసారి గట్టిగా బెదిరించి పంపించేస్తే సరిపోదా..? పోనీ, ఆ ఎద్దుకు అంత బలుపు దేనికి అనుకుంటే దాని మీదే కేసు పెట్టండి, తీసుకుపోయి ఠాణాలో పెట్టండి… ఎద్దు మూత్రం పోస్తే ఓనర్ తప్పెలా అవుతుంది..? ఎక్కడ మూత్రం పోయాలో, ఎక్కడ పోయకూడదో రూల్స్ ఏమైనా ఉన్నాయా..? జీఎం సార్ ఉండే వీథుల్లోకి వెళ్లేముందు, తన ఎద్దులకు డైపర్లు వేయలేడు కదా… వెరసి ఇది న్యూసెన్స్ కేసు కాదు, ఓ నాన్‌సెన్స్ కేసు..!!
Share this Article