ఈ కథనం Amarnath Vasireddy… షేర్ చేసుకున్న ఓ పోస్టు… మొన్న మనం ఎన్‌కౌంటర్ పింగళి దశరథరామ్ జీవితం గురించిన కథనం చదువుకున్నాం కదా… దాని రచయిత ఎన్‌జే విద్యాసాగరే ఈ టైగర్ నాగేశ్వరరావు కథనూ సవివరంగా చెప్పింది… టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఏం చూపించారో వదిలేయండి… సినిమా కదా చాలా క్రియేటివ్ లిబర్టీ తీసుకుని ఏవేవో మార్పులు చేస్తారు… అసలు టైగర్ కథ ఏమిటి..?
(టైగర్ నాగేశ్వరరావు గురించి తెలుసుకోవాలని 2010లో స్టువార్టుపురం చీరాల చుట్టుప్రక్కల వూళ్ళు ఆరు రోజులు తిరిగి సమాచారం సేకరించాను. ఈ మార్చి 22వ తేదికి టైగర్ నాగేశ్వరరావును చంపి 44 సంవత్సరాలు. త్వరలో రాబోతున్న నా వ్యాస సంపుటి ” ఎలుతురు” లో యీ వ్యాసం వుంది. కష్టపడి రాసిన వ్యాసం…. కాపీ చేస్తే నా పేరు NJ Vidyasagar తప్పనిసరిగా రాయండి)
టైగర్ నాగేశ్వరరావు అమరగాథ- NJ విద్యాసాగర్
Ads
****************************
టైగర్ నాగేశ్వరరావు గుంటూరు జిల్లా స్టువార్టు పురానికి చెందినవాడు. కులం ఎరుకల, 11 సెప్టెంబర్ 1954లో పుట్టాడు. నాగేశ్వరరావుకు ఇద్దరు అన్నలు ప్రసాద్, ప్రభాకర్. 3 సంవత్సరాల వయస్సులో వాళ్ళమ్మ సుగుణమ్మ చనిపోయింది. వాళ్ళ నాన్న వెంకటయ్య మాల కులానికి చెందిన భాగ్యమ్మను పెళ్ళి చేసుకొన్నాడు.
మొదటి భర్తకు దూరమైన భాగ్యమ్మ అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లి. పెద్దన్న ప్రసాద్ అమ్మమ్మ (రూతమ్మ) దగ్గరకు వెళ్ళిపోయాడు. ప్రభాకర్‌ను నాగేశ్వరరావును సవతి తల్లి భాగ్యమ్మ కన్నతల్లి కన్నా యెక్కువగా సాకింది. నాగేశ్వరరావుకు 10 సం॥లు వచ్చేటప్పటికి తండ్రి (వెంకటయ్య) చనిపోయాడు. వెంకటయ్య చనిపోయే నాటికి సొంత యిల్లు కూడా లేదు. పెద్దన్న ప్రసాద్ తాగి తండ్రితో గొడవ పెట్టుకొని యిల్లు తగలబెట్టాడు.
పెద్దనాన్న ప్రకాశం కొడుకు ఉద్యోగానికి వెళ్ళడంతో ఖాళీగా వున్న యింట్లో నాగేశ్వరరావు, ప్రసాద్ వున్నారు. ఎవరూ ఆదరించేవారు లేకపోవడంతో సవతి తల్లి భాగ్యమ్మ ఆమె మొదటి సంబంధం పిల్లల దగ్గరకు వెళ్ళిపోయింది. నాగేశ్వరరావు బంధువులు కూడా యెటువంటి సహాయం చెయ్యలేదు. ఎదురింట్లోనే వుంటున్న ప్రకాశం కూడా యేరకంగానూ ఆదుకోలేదు. ప్రభాకర్, నాగేశ్వరరావు ఆకలికి అల్లాడిపోయారు.
ఇళ్ళదగ్గరున్న వరిచేలో వడ్డు దూసుకొచ్చి దంచి ఆ ముడి బియ్యంతో వండిన గంజి, అన్నం తిని కొన్నాళ్ళు బతికారు. ఆకలికి తట్టుకోలేక యిద్దరూ కూర్చొని యేడ్చుకొనేవాళ్ళు. రెండో ఆట సినిమా వదిలినాక రోడ్లు పక్కనున్న కిళ్ళీ కొట్టు పగలగొట్టి పప్పుండలు, జీడీలు తీసుకొచ్చేవాడు ప్రభాకర్. వాటితో అన్నదమ్ములు ఇద్దరూ ఆకలి తీర్చుకొనేవాళ్ళు.
అప్పుడప్పుడు మేనత్త కొద్దిగా ఆదుకొనేది. నన్ను కూడా దొంగతనాలకు మీతో తీసుకెళ్ళమని పెద్దవాళ్ళని బతిమాలాడేవాడు ప్రభాకర్. పిల్లోడివి నువ్వేం జేస్తావు అని తీసుకెళ్ళే వాళ్ళు కాదు. కొంతకాలం తర్వాత చుట్టుపక్కల వూళ్ళలో కోళ్ళు, బియ్యం, స్టీలు బిందెలు కాజేసే దావీదు తనతోపాటు ప్రభాకర్‌ను దొంగతనాలకు తీసుకెళ్ళేవాడు. దావీదు సావాసంలో దొంగతనాల్లో ప్రభాకర్‌కు మంచి ప్రావిణ్యం వచ్చింది. నైపుణ్యంగా చెయ్యగలుగుతున్నాడు.
ఇక బతకగలం అని ధైర్యం వచ్చినాక వెళ్ళిపోయిన సవతి తల్లి భాగ్యమ్మను అన్నదమ్ములిద్దరూ తీసుకొచ్చుకొన్నారు. తాను దొంగగా మారినా తమ్ముడు యీ వృత్తి చెయ్యకూడదని నాగేశ్వరరావును ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఒక మెకానిక్ షెడ్‌లో చేర్పించాడు. ఆ పని యిష్టంలేక నాగేశ్వరరావు స్టువర్టుపురానికి వచ్చేశాడు. 1969లో గుంటూరు జిల్లా గురజాలలో కోమటి వాళ్ళ యింట్లో ప్రభాకర్ దొంగతనం చేశాడు. పోలీసులు ప్రభాకర్ కోసం తిరుగుతున్నారు.
ప్రభాకర్ దొరక్కపోవడంతో నాగేశ్వరరావును పట్టుకెళ్ళి తీవ్రంగా కొట్టారు. అప్పటికి యెటువంటి దొంగతనమూ చెయ్యని నాగేశ్వరరావు పోలీసుల చేతుల్లో చిత్రహింసలు అనుభవించాడు. (అప్పటి నుండి బతికినంతకాలం మోకాళ్ళకు Knee Cups పెట్టుకొని తిరిగేవాడు) గురజాల కోమటి వాళ్ళ యింట్లో దొంగతనం కేసులో దొరికి పోయిన ప్రభాకర్‌ను జైల్లో పెట్టారు. ఇది 1969లో జరిగింది. అప్పటికి నాగేశ్వరరావు వయస్సు పదిహేనేళ్ళు.
ప్రభాకర్ జైలుకెళ్ళడంతో నాగేశ్వరరావుకు బతకడం కష్టమైపోయింది. ఈ పరిస్థితుల్లో డాక్టర్‌బాబుతో కలిసి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. డాక్టరుబాబు అంటే నిజంగా డాక్టరు కాదు. చిన్నప్పుడు ఆటల్లో డాక్టరుగా వుండేవాడు. అప్పటి నుండి డాక్టరు బాబు అని పిలిచేవారు. అసలు పేరు ఏసుదాసు. డాక్టరు బాబుతో కలిసి దొంగతనాలు చేసి డబ్బు కూడబెట్టి ప్రభాకర్‌ను బెయిలు మీద విడిపించాడు. బయటకు వచ్చిన ప్రభాకర్‌కు తమ్ముడు దొంగతనాలకు అలవాటు పడ్డాడని తెలిసిపోయింది. ఇకవాళ్ళతో వీళ్ళతో యెందుకని యిద్దరూ కలిసి దొంగతనాలు చెయ్యడం మొదలుబెట్టారు.
1970లో చౌటా ప్రసాద్ నాగేశ్వరరావు, దొంగతనాల కోసం తమిళనాడుకు కుటుంబాలతో సహా వెళ్ళారు. వెల్లివాకం, కోడంబాకం ప్రాంతాల్లో యిళ్ళు అద్దెకు తీసుకున్నారు. బట్టల వ్యాపారం చేస్తున్నామని చుట్టుపక్కల వాళ్ళను నమ్మించారు. వీలైన చోటల్లా దొంగతనాలు చేశారు. వాటాల దగ్గర తేడాలు వచ్చి నాగేశ్వరరావు తన ముఠాను తీసుకొని చౌటా ప్రసాద్‌తో విడిపోయి స్టువార్ట్‌పురం వచ్చేశాడు. అక్కడ చౌటా ప్రసాద్ పోలీసులకు పట్టుబడి నాగేశ్వరరావు పేరు చెప్పాడు.
ఇక్కడి పోలీసులు నాగేశ్వరరావు అన్న ప్రభాకర్‌ను రోజు పోలీసు స్టేషన్‌కు హాజరు కావట్లేదని అరెస్ట్ చేసి తమిళనాడు పోలీసులకు అప్పజెప్పారు. వాళ్ళు ప్రభాకర్‌ను తిరువళ్ళూరు జైల్లో పెట్టారు. చౌటా ప్రసాద్ మద్రాసు జైల్లో వున్నాడు. వీళ్ళకు తిరువళ్ళూరులోనే కోర్టు. కోర్టులో కలిసినప్పుడు చౌటా ప్రసాద్ ముఠా పోలీసుల్ని డబ్బులిచ్చి మంచి చేసుకొనేవారు. అందువల్ల చేతులకు సంకెళ్ళు వేసేవాళ్ళు కాదు. కోర్టుకు తీసుకొచ్చే టప్పుడు ఎస్కార్టు లేకుండా టీలు తాగినా, టిఫిన్లు చేసినా యేమీ అనేవాళ్ళు కాదు. ఈ విధంగా పోలీసుల్ని బాగా నమ్మించారు.
ఒకరోజు మినిస్టర్ ప్రోగ్రాం వుండటంతో యిద్దరు పోలీసులను మాత్రమే ఎస్కార్టుగా పంపించారు. తిరువళ్ళూరు కోర్టు నుండి మద్రాస్‌కు (ఈ రెండింటి మధ్య దూరం సుమారు 80 కి.మీ.) తీసుకొని వస్తుండగా ఇల్లివాకం దగ్గర దిగి పోలీసుల కళ్ళల్లో కారంగొట్టి చౌటా ప్రసాద్ ముఠా పారిపోయారు. చౌటా ప్రసాద్ ముఠా పారిపోయినందుకు పోలీసులు ప్రభాకర్‌ను తీవ్రంగా కొట్టి మద్రాసు జైలుకు పంపించారు. చీరాల పోలీసులు నాగేశ్వరరావును అరెస్ట్ చేసి తిరువళ్ళూర్ సబ్ జైలుకు తీసుకొచ్చారు. అప్పటికి చౌటా ప్రసాద్ పారిపోయి నెలరోజులు అవుతుంది.
నాగేశ్వరరావును పట్టుకొచ్చామని పోలీసులు ఐ.జి. అరుళ్‌కు చెప్పారు. ఐ.జి. నేరుగా తిరువాళ్ళూరు జైలుకు వచ్చాడు. చేతులకు, కాళ్ళకు సంకెళ్ళతో నాగేశ్వరరావును ఐ.జి. ముందు కూర్చోబెట్టారు. అతను ఐ.జి. స్థాయి ఆఫీసర్ అని నాగేశ్వరరావుకు తెలీదు. చౌటా ప్రసాద్‌ను పట్టివ్వమని లేదా యెక్కడున్నాడో చెప్పమని బాగా కొట్టారు. పారిపోయిన తర్వాత చౌటా ప్రసాద్ యెక్కడున్నాడో నాకు తెలియదని యీ విధంగా చిత్రహింసలు పెడితే నేను కూడా రెండు రోజుల్లోనే పారిపోతానని నాగేశ్వరరావు ఐ.జి. అరుళ్‌కు చెప్పాడు.
నిజంగానే పారిపోతాడని ప్రభాకర్ యింటికి కబురు చేసి ప్రసాద్ భార్యను పిలిపించి నాగేశ్వరరావుకు బెయిల్ యిప్పించమన్నాడు. కమలనాధన్ అనే లాయర్‌తో బెయిల్ పిటీషన్ వేయించారు. కోర్టులో కలుసుకున్నప్పుడు ప్రభాకర్ తమ్ముడికి బతిమిలాడి చెప్పాడు ` ‘అయ్యా నువ్వు పారిపోవద్దురా అన్నావదినలు బెయిలు తీసుకొస్తున్నారు’ అన్నాడు. ‘బెయిల్ వచ్చేదాకా యెవడుంటాడు`నేను పారిపోతా ` నాకు వుండబుద్ది కావటంలేదు. నీ దగ్గర డబ్బులుంటే యివ్వు’’ అని ప్రభాకర్ దగ్గర నలభై రూపాయలు తీసుకొని సబ్‌జైలుకు వెళ్లాడు.
జైలు నుండి జంప్.
సబ్ జైలులో నాగేశ్వరరావుతోపాటు ఒక ముసలాయన, మరో యువకుడు వున్నారు. సమయం రాత్రి 8 గంటలు దాటుతుంది. పోలీసులు వరండాలో పేకాట ఆడుతున్నారు. సెంట్రీ జైలు గది బయట అటు ఇటు తిరుగుతున్నాడు. జైలు గదిలో వున్న యువకుడి చేతికి వున్న స్టీలు కడియం తీసుకొని విరగొట్టి నిలువుగా సాగదీశాడు. సెంట్రీ జైలుగది ముందుగా ఒకసారి దాటి వెళ్ళినప్పుడు తాళం తీశాడు. రెండోసారి దాటేటప్పుడు బయటకొచ్చి సెంట్రీ దగ్గర తుపాకీ గుంజుకొని సెంట్రీని కొట్టాడు. సెంట్రీ పడిపోయాడు. పేకాట ఆడే పోలీసులు అడ్డుపడితే వాళ్ళను కూడా కొట్టాడు. వాళ్ళూ పడిపోయారు. అక్కడి నుండి వేగంగా పారిపోవాలంటే పోలీసుల సైకిల్ మీద పోవాలి. కాని నాగేశ్వరరావుకి సైకిల్ తొక్కడం రాదు. ఇతనితోపాటు జైల్లో వున్న కుర్రాడికి వచ్చు. వాడ్ని సైకిల్ తొక్కమని ఆంధ్రా బోర్డరు దాకా వచ్చి సైకిల్ ` తుపాకీ అక్కడ పడేసి లారీ యెక్కి స్టువర్ట్‌పురం వచ్చేశాడు.
టైగర్ నాగేశ్వరరావు అనే పేరు యెలా వచ్చింది?
————————————————————-
నాగేశ్వరరావును వెదుక్కొంటూ తమిళనాడు పోలీసులు స్టువర్ట్‌పురం వచ్చారు. అనుచరులు జయరావు, ఆరోనులతో కలిసి వాళ్ళను చితగొట్టి పంపించాడు. ఆ తర్వాత ఒక ఎస్.ఐ. కొంతమంది పోలీసుల్ని తీసుకొని నాగేశ్వరరావును పట్టుకోవడానికి వచ్చారు. వాళ్ళను కూడా కొట్టి ఎదురుగా కూర్చోబెట్టుకొని ఆ రోజు జైల్లో కలిసి చౌటా ప్రసాద్ యెక్కడ వున్నాడో చెప్పమని నన్ను కొట్టిచ్చిందెవర్రా అని అడిగాడు. ఆయన ఐ.జి. అరుళ్ అని చెప్పారు వాళ్ళు. వచ్చే నెలలో మద్రాస్ సిటీలోనే నేరం చేస్తాను. చేతనైతే నన్ను పట్టుకోమని మీ ఐ.జి.తో చెప్పండ్రా అని వాళ్ళను పంపేశాడు.
చెప్పినట్టుగానే మూడు నెలల పాటు వొక్కరోజు కూడా తప్పకుండా వరుసగా దొంగతనాలు చేశాడు. పోలీసుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. ఎన్నిసార్లు వలపన్నినా పోలీసులు పట్టుకోలేకపోయారు. ఐ.జి. అరుళ్ విసుగెత్తి పోయాడు. ఇంతమంది పోలీసులు వాడ్ని పట్టుకోలేక పోతున్నారు. నిజంగా వాడు ‘‘ఆంధ్రా టైగర్’’ అన్నాడు. ఆ ఐ.జి. అరుళ్ ఎప్పుడైతే ‘‘ఆంధ్రా టైగర్’’ అన్నాడో అప్పటి నుండి పోలీసులు, జనం అందరూ నాగేశ్వరరావును ‘‘టైగర్ నాగేశ్వరరావు’’ అని పిలిచారు. ఇంటిపేరు ‘‘గరిక’’ మరుగున పడిపోయింది. టైగర్ యింటిపేరు అయింది.
పోలీసులకు దొరక్కుండా వుండేందుకు స్టువర్టుపురంలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో షెల్టర్ తీసుకొనే వాడు. మాల, మాదిగ పల్లెల్లోనే ఎక్కువగా తలదాచుకొనేవాడు.
దోచుకొన్న సొమ్మంతా యేంచేస్తాడు?
——————————————-
షెల్టర్ తీసుకొన్న పల్లెల్లో చుట్టు పక్కల వాళ్ళ వివరాలు సేకరించేవాడు. వాళ్ళ ఆదాయం, ఆస్తి, పిల్లలు యిలాంటి వివరాలు ఒక కుటుంబం గురించి యిద్దరు ముగ్గుర్ని అడిగి తెలుసుకొనేవాడు. నిజంగా పేదవాళ్ళు అని నమ్మకం కుదిరాక వాళ్ళను పిలిపించుకొని వాళ్ళు అడక్కపోయినా డబ్బులిచ్చేవాడు. పెళ్ళిళ్ళకు, చదువులకు, ఆరోగ్యం మొదలైన అవసరాలకు డబ్బు యిచ్చేవాడు. తిండికి లేని కుటుంబాలను చూస్తే నాగేశ్వరరావుకు కడుపు తరుక్కుపోయేది.
ఇతని నుండి సహాయం పొందిన వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అయిన వాళ్ళు వున్నారు. పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళు యెన్ని చేశాడో లెక్కలేదు. ఇటు మద్రాస్ దాకా, అటు కడప, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు దాకా టైగర్ నాగేశ్వరరావును పేద జనమంతా దైవం కంటే యెక్కువగా ఆరాధించారు. ఇప్పుడు చెప్పిన ఏరియాలో యే గ్రామంలోనైనా నాగేశ్వరరావుకు షెల్టర్ దొరికేది. ప్రజల్లోనే కాదు పోలీసుల్లోకూడా అదే అభిమానం. పోలీసులు నాగేశ్వరరావు అభిమానులు.
కేవలం డబ్బు అవసరాలకే కాదు నాగేశ్వరరావు స్నేహ గుణంకు ప్రజలు ఆకర్షితులయ్యేవారు. తన అనుచరుల్ని కూడా ప్రాణానికి ప్రాణంగా చూసుకొనేవాడు. ఎప్పుడూ యిరవైవేల రూపాయలు తక్కువ కాకుండా డబ్బు వుంచుకొనేవాడు. నాగేశ్వరరావు ముఠా అంటే అందరూ యెరుకలవాళ్ళే వుండే వాళ్ళు కాదు, అందరూ స్టువర్ట్‌పురం వాళ్ళే వుండేవాళ్ళు కాదు, బ్రాహ్మణులతో సహా అన్ని కులాల వాళ్ళు యితనితో కలిసి దొంగతనాలు చేశారు. చీరాల మొదలుకొని కృష్ణా జిల్లా గుడివాడ వరకు యితని ముఠాలో సభ్యులుగా పనిచేసిన వాళ్ళు వున్నారు.
దోచిన సొమ్ము పేదలకు పంచడంలో ‘‘టైగర్ నాగేశ్వరరావు’’పై యెవరి ప్రభావం వుంది?
***********************************
ఎవరి ప్రభావం లేదు. అసలు రాబిన్‌హుడ్ అంటే యెవరోకూడా తెలీదు. టైగర్ నాగేశ్వరరావు అన్న ప్రభాకర్ ఒకరోజు గట్టిగానే అడిగాడు. ఇట్లా అందరికీ యిచ్చేస్తే మన పరిస్థితి యేమిటి అని బాధపడ్డాడు. అన్నను దగ్గర కూర్చోబెట్టుకొని తన వుద్దేశ్యాన్ని చెప్పాడు. మనం పస్తులతో వుండి ఆకలితో యేడ్చిన రోజులు గుర్తున్నాయా అన్నా? అయిన వాళ్ళు కూడా ఆదుకోక పోతే గంజితాగి బతికాం. అప్పుడు మనం యే పరిస్థితుల్లో వున్నామో అలాంటి వాళ్ళకు సహాయం చేస్తున్నాను. అలాంటి వాళ్ళు లోకంలో చాలామంది వుండవచ్చు. అందరికీ నేను సహాయం చెయ్యలేక పోవచ్చు. కానీ నాకు చేతనయినంత వరకు చేస్తాను. ఎంతకాలం చేస్తానో తెలీదు. కనుక చచ్చి పోయేవరకు చేస్తూనే వుంటాను. ఇదేమన్నా కష్టపడిన సొమ్మా? అక్రమంగా సంపాదించిన వాళ్ళ దగ్గర కొట్టుకొస్తున్నా. ఆకలితో వున్నవాళ్ళకు పంచుతున్నా అని స్పష్టంగా చెప్పాడు. ప్రభాకర్ యేమీ మాట్లాడలేకపోయాడు.
వల్లాగి బాబుతో వైరం
******************
స్టువర్ట్‌పురంలోనే వల్లాగి బాబు అనే చిల్లరదొంగ వుండేవాడు. పేదల యిళ్ళల్లోనే ఎక్కువగా దొంగతనాలు చేసేవాడు. గొర్రెలు, కోళ్ళు యింకా చిన్న చిన్న వస్తువులు కూడా వదిలేవాడుకాదు. ఇతని బారిన పడిన వాళ్ళంతా టైగర్ నాగేశ్వరరావు దగ్గరకు వచ్చి చెప్పుకొనేవాళ్ళు. ఒంగోలుకు చెందిన ఒక టీచర్ చీరాల లోని రామనగర్‌లో ఒక యిల్లు అద్దెకు తీసుకొని వుంటుంది. భర్త, యిద్దరు కూతుళ్ళు, ఒక కొడుకుతో కలిసి వుండేది. చాలా పేద కుటుంబం. అతి తక్కువ జీతం కావటంతో పిల్లల చదువు కోసం ఆర్థికంగా యిబ్బంది పడుతూ వుండేవాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు టైగర్ నాగేశ్వరరావు సహాయం తీసుకోమని సలహా యిచ్చారు. టీచర్ ఒక రోజు టైగర్ నాగేశ్వరరావును కలిసి తన బాధల్ని చెప్పుకొంది. వెంటనే చీరాల వి.ఎస్.ఆర్.& వై.ఆర్.ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్‌తో మాట్లాడి ఫీజులు కట్టి పిల్లలకు బట్టలు కొనిపెట్టాడు. ఆ తరువాత నాగేశ్వరరావు బెంగుళూరు వెళ్ళి నెల రోజుల దాకా రాలేదు.
ఒక రోజు రాత్రి టీచర్ ఇంటికి వల్లాగి బాబు తన ముఠాతో వెళ్ళి మేము టైగర్ నాగేశ్వరరావు మనుషులమని, యీ రాత్రి మీ యింట్లో వుండి పొద్దున్నే వెళ్ళిపోతామని చెప్పి వుండిపోయారు. కొద్దిసేపు గడిచినాక అందరూ కలిసి టీచర్ భర్తను కత్తితో బెదిరించి టీచర్‌ను, పెద్దకూతురిని రేప్ చేశారు. మేలు చేసినట్టే చేసి యింత దారుణం చేశాడు నాగేశ్వరరావు అని టీచర్ కుమిలి పోయింది. నాగేశ్వరరావు బెంగుళూరు నుండి వచ్చి విషయం తెలుసుకొని తనముఠా వాళ్ళను టీచర్‌కు చూపించాడు. వీళ్ళు కాదని చెప్పింది. ఈ పని చేసింది వల్లాగి బాబు అని నాగేశ్వరరావుకు తెలిసిపోయింది.
ఆ తరువాత కూడా కొంత మంది ఒంటరిగా వున్న ఆడవాళ్ళపై వల్లాగి బాబు అత్యాచారం చేశాడు. వాళ్ళంతావచ్చి వల్లాగి బాబు గురించి టైగర్ నాగేశ్వరరావుకు చెప్పుకొన్నారు. ఇవన్నీ విని చలించి పోయిన నాగేశ్వరరావు వొక రోజు వల్లాగి బాబు కాలు నరికేశాడు. దీనికి ప్రతీకారంగా వల్లాగి బాబు యెప్పటికప్పుడు పోలీసులకు నాగేశ్వరరావు వివరాలు చెప్పసాగాడు. దీనితో ఆత్మరక్షణ కోసం నాగేశ్వరరావు రివాల్వర్ తెచ్చుకున్నాడు. (కర్ణాటకలో ఒక రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ వుచితంగా యిచ్చాడు). ఆ తరువాత వొకసారి పోలీసులు వెంటబడ్డప్పుడు ఒక కానిస్టేబుల్ కాలుమీద కాల్చి పారిపోయాడు.
ఎస్.ఐ. చక్రపాణి నాగేశ్వరరావు కోసం తీవ్రంగా గాలించేవాడు. పరుచూరులో వున్నాడని తెలుసుకొని వెళ్ళి నిద్రపోతున్న నాగేశ్వరరావును పట్టుకొని చీరాల కోర్టులో సరెండర్ చేశాడు. కోర్టు దగ్గర భార్య మణెమ్మ కలిసింది. సాయంత్రానికి యింటికి వచ్చేస్తానని చెప్పి పంపించేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో యే జైల్లో పెట్టినా తప్పించుకొంటానని పోలీసులతో చెప్పాడు. నెల్లూరు జైలుకు రిమాండ్‌పై తీసుకెళ్ళారు. జైలు లోపలికి వెళ్ళక ముందే పాస్‌కు వెళ్తానని పోలీసులకు చెప్పి పక్కకువచ్చి అకస్మాత్తుగా పోలీసులపై దాడిచేసి చేతి సంకెళ్ళతో వాళ్ళను కొట్టి పరారయ్యాడు. సాయంత్రానికి భార్యకు చెప్పినట్లే చీరాలకు వచ్చేశాడు.
పోలీసు కుక్కతో…
———————
పోలీసుల రాకను వేగంగా వూహించి తన ముఠాను అలర్ట్ చేసేవాడు. పోలీసులు యేయే స్థలాలకు వస్తారో ముందుగానే చెప్పి అక్కడకు దూరంగా పడుకొనేవాడు. ఒకసారి తన అనుచరులతో రహస్యంగా స్టువర్టుపురం సమీపంలోని కుందేరు దగ్గర వున్నాడు. ఇక్కడికి పోలీసులు వస్తారనిపిస్తుంది అని చెప్పాడు. కొద్దిసేపటికి కుక్కను తీసుకొని వస్తూ పోలీసులు దూరంగా కనబడ్డారు. నాగేశ్వరరావు లుంగీ నడుముకు చుట్టుకొని వేగంగా పరుగెత్తాడు. అతని అనుచరులు తలావొక దిక్కుకు పారిపోయారు. కుక్క నాగేశ్వరరావును వెంబడించింది. పది అడుగులకు పైగా వెడల్పువున్న నీళ్ళులేని సిమెంటు కాలువ దాటి అవతలకు వెళ్ళి పరుగెత్తాడు. అంత లోతు, వెడల్పువున్న కాలువను దాటటం కుక్కకు సాధ్యం కాదు అనుకున్నాడు. కానీ కుక్క జంప్ చేసి నాగేశ్వరరావును వెంబడిరచింది.
నాగేశ్వరరావు పరుగు ఆపి తీరిగ్గా నిలబడ్డాడు. కుక్క దగ్గరకు వచ్చేసింది. కుక్క తన మీదకు దూకబోతుండగా బాంబు తీసుకొని సరిగ్గా గురిచూసి కుక్క నోట్లోవేశాడు. బాంబు పేలింది. కుక్క పైదవడ పాక్షికంగా దెబ్బతిన్నది. బాంబు శబ్దానికి కుక్క బెదిరిపోయింది. వెనక్కు తిరిగి పరుగులంకించుకొంది. పోలీసులు కూడా భయపడిపోయి వెనక్కు తిరిగారు.
బ్రిటానియా బిస్కట్ కంపెనీ అధినేత కుటుంబాన్ని అడ్డగించి…
బ్రిటానియా కంపెనీ అధినేత అప్పటి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య వియ్యంకుడు సత్యనారాయణ తన కుటుంబంతో సహా తిరుపతి దర్శనానికి వస్తున్నాడని టైగర్ నాగేశ్వరరావుకు సమాచారం అందింది. తిరుపతి నగరం బయట రెండు కార్లలో ముఠాతో వెళ్ళి కాపుకాశాడు. సాయంత్రం గం॥ 7.30 ని॥లకు ఒక లారీవస్తే ముందుగా రాళ్ళు అడ్డంపెట్టి దానిని ఆపాడు. లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టమని బెదిరించాడు.
లారీ డ్రైవర్ నేను కూడా దొంగతనాలు చేస్తాను. మీకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. లారీ డ్రైవర్‌ను నమ్మి డబ్బులిచ్చి తినడానికి యేదైనా తీసుకొని రమ్మని పంపించాడు. ఇంతలో బ్రిటానియా బిస్కట్ కంపెనీ అధినేత సత్యనారాయణ కుటుంబం ఆడవాళ్ళతో ఒక వ్యాను, మగవాళ్ళతో ఒక కారులో అక్కడికి చేరుకొని లారీ అడ్డంగావుండటంతో ఆగిపోయారు. నాగేశ్వరరావు తన ముఠాతో వాళ్ళను చుట్టుముట్టాడు.
వ్యాను దగ్గర కొంత మందిని కాపలాగా వుంచి కారులోవున్న మగవాళ్ళ దగ్గర వాచీలు వుంగరాలు, చైన్‌లు, డబ్బు తీసుకొని ఆడవాళ్ళున్న వ్యాను దగ్గరకు వచ్చాడు. ఆడవాళ్ళు తెలివిగా నగలంతా తీసి పని మనిషి లంగాకు లోపలివైపున పిన్నులకు గుచ్చి పెట్టారు. అందరి దగ్గరా ఒక్కొక్క గొలుసు మాత్రమేవుంది. నాగేశ్వరరావు ముఠాలో ఒకడు ఆడవాళ్ళలో ఒకామె మెడపై చెయ్యివేసి గొలుసు లాక్కొన్నాడు. ఇది చూసి నాగేశ్వరరావు వాడి ముఖం మీద బలంగా కొట్టాడు. వాడికి నోటివెంట రక్తం పడిరది. వ్యాన్‌లో వున్న బెడ్ రక్తంతో తడిసిపోయింది.
నాగేశ్వరరావు ఆడవాళ్ళతో అమ్మా! మీ దగ్గర చాలా బంగారం వుంది. మీ మంగళసూత్రాలు తీసుకొని మిగిలిన బంగారం యిచ్చేయండి’’ అన్నాడు. వాళ్ళు మా దగ్గర యింతేవుంది అన్నారు. ఇంతలో పనిపిల్ల లంగా నుండి ఒక హారం కింద పడింది. ‘‘పాపా! మర్యాదగా నీదగ్గర వున్నదంతా యిచ్చెయ్యి’’ అన్నాడు. మరోదారిలేక మొత్తం బంగారం యిచ్చేశారు. మొత్తం ఒక లుంగీలో మూటగట్టారు. తినడానికి తీసుకురావడానికి వెళ్ళిన లారీ డ్రైవర్ పోలీసులను వెంటబెట్టుకొని వచ్చాడు. నాగేశ్వరరావు ప్రమాదాన్ని పసిగట్టి రెండు కార్లల్లో ముఠాను తీసుకొని పారిపోయాడు. పోలీసులు వెంబడించారు. రెండు కార్లు వేగంగా పోనిచ్చి తప్పించుకున్నారు.
1979లో మార్టూరు కమ్మ భూస్వామి టైగర్ నాగేశ్వరరావును మార్టూరు మాల పల్లెలో రహస్యంగా వుంచాడు. కొన్నాళ్ళ తర్వాత అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆ భూస్వామి దగ్గరకు వచ్చి నాగేశ్వరరావును అప్పజెప్పమని అడిగాడు. భూస్వామి నిరాకరించాడు. ఆయన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో చాలా పలుకుబడి కలిగినవాడు. నాగేశ్వరరావు పల్లెలో వున్నపుడు పల్లెలో ఒక అమ్మాయిని పొగాకు కంపెనీ ఓనరు (కమ్మ) రోజు వేధిస్తున్నాడు. ఆ అమ్మాయి నాగేశ్వరరావుకు వచ్చి చెప్పుకొంది.
ఆడవాళ్ళంతా కలిసి ఆ కంపెనీ ఓనరును కొట్టమని, యేదైనా అయితే నేను చూసుకొంటానని నాగేశ్వరరావు చెప్పాడు. నిజంగానే ఆడవాళ్ళంతా కలిసి ఆ పొగాకు కంపెనీ ఓనరును బాగా చితకబాదారు. కంపెనీ ఓనరు ఆడవాళ్ళ మీద కేసు పెట్టాడు. కేసు విచారణ కోసం అప్పటి ఎస్.ఐ. మురళీ పల్లెలోకి వచ్చాడు. మళ్ళీ నాగేశ్వరరావు సలహా అడిగారు. ఎస్.ఐ.ని కూడా యేశెయ్యమన్నాడు. ఆడవాళ్ళంతా కలిసి ఎస్.ఐ.ని కొట్టారు. ఆ తర్వాత పోలీసులు ఎస్.ఐ.ని కొట్టిన ఆడవాళ్ళను అరెస్ట్ చేశారు. నాగేశ్వరరావు వాళ్ళందరినీ బెయిలు మీద విడిపించాడు.
ఈ సంఘటనతో ఎస్.ఐ. మురళీ, నాగేశ్వరరావు మీద కక్షగట్టాడు. నాగేశ్వరరావును పట్టుకోవడానికి అవకాశం కోసం యెదురు చూశాడు. వల్లాగి బాబును సిద్ధం చేశాడు. నాగేశ్వరరావు ఆచూకీ కోసం చెయ్యని ప్రయత్నం లేదు.
టైగర్ నాగేశ్వరరావు బూటకపు ఎన్‌కౌంటర్
ఆ రోజు మార్చి 22, 1980… టైగర్ నాగేశ్వరరావు భార్య మణెమ్మ యింటి దగ్గర వాకిలి వూడ్చుకొంటుంది. వల్లాగి బాబు దుర్భాషలాడుతూ వచ్చి మణెమ్మ మెడలో తాళిబొట్టు లాగేశాడు. ఇద్దరి మధ్య చాలాసేపు గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు అన్న ప్రభాకర్‌తో కలిసి ఇంటికొచ్చాడు. జరిగింది అంతా విని వల్లాగి బాబును చంపేస్తానని అక్కడినుండి వచ్చేశాడు. దారిలో సుబ్బడు అనేవాడు యెదురయ్యి నాగేశ్వరరావును పలకరించి యింటికి తీసుకెళ్ళాడు.
అంతకుముందు యెప్పటి నుండో సంబంధం వున్న ఒక అమ్మాయిని తీసుకురమ్మని సుబ్బడిని పంపించాడు. సుబ్బడు పోలీస్ ఇన్‌ఫార్మర్ అని నాగేశ్వరరావుకు తెలీదు. సుబ్బడు నేరుగా ఎస్.ఐ. మురళీని కలిశాడు. ఏంచెయ్యాలో సుబ్బడికి చెప్పాడు. పోలీసుల్ని నాగేశ్వరరావు వున్న యింటికి దగ్గర్లో కాపలా వుంచారు. సుబ్బడు నాగేశ్వరరావు చెప్పిన అమ్మాయిని కాకుండా వేశ్యావృత్తి చేసుకునే అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఈ అమ్మాయిని తీసుకొచ్చావు యేమిటి అని నాగేశ్వరరావు అడిగాడు. ఆ అమ్మాయి కనబడలేదని అబద్దం చెప్పాడు. సుబ్బడు తీసుకొచ్చిన అమ్మాయితో నాగేశ్వరరావు ఆ రాత్రి గడిపాడు.
అంతకుముందు టీ, కాఫీ మద్యం అలవాటు లేని నాగేశ్వరరావుకు పాలల్లో మత్తుమందు కలిపి యిచ్చాడు సుబ్బడు. నాగేశ్వరరావుతో వున్న అమ్మాయికి అతను టైగర్ నాగేశ్వరరావు అని తెలీదు. తెల్లారగట్ట మూడు గంటలకు నాగేశ్వరరావు స్పృహ లేకుండా అయిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో ఎస్.ఐ. మురళీ పోలీసుల్ని వెంటబెట్టుకొని వచ్చి మత్తుగా పడివున్న నాగేశ్వరరావును తుపాకితో కాల్చాడు. ఆ తర్వాత చీరాల పొలిమేరల్లోకి నాగేశ్వరరావు శవాన్ని తీసుకెళ్ళి పోలీసులు మీద కాల్పులు జరిపితే ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో చచ్చిపోయాడని ప్రకటించారు.
ఆ విధంగా మనకాలపు రాబిన్‌హుడ్, యెందరో పేద విద్యార్ధులకి సహాయం చేసిన దీనబంధు యెందరో పేదింటి ఆడపడుచులకు పెళ్ళిళ్ళు చేసిన దయామయుడు మరెందరో ఆకలి తీర్చిన సుహృదయుడు టైగర్ నాగేశ్వరరావు జీవితం ముగిసింది.
మూడు రోజులు సాగిన శవయాత్ర
టైగర్ నాగేశ్వరరావును చంపేశారని తెలుసుకొన్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వేలాదిమంది చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. నాగేశ్వరరావును చూపించాలని పోలీసుల్ని డిమాండ్ చేశారు. పోలీసులు నిరాకరించడంతో ఆసుపత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసుల లాఠీచార్జీలో చాలామందికి దెబ్బలు తగిలాయి. అయినా జనం వెనక్కు తగ్గలేదు. పోస్ట్ మార్టమ్ అయిన తర్వాత శవాన్ని అప్పగించారు. ఒక లారీ మీద పూలతో అలంకరించి శవాన్ని వూరేగించారు.
చీరాల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మొదలైన శవయాత్రను చీరాల అన్ని కాలనీల్లోకి తీసుకెళ్ళారు. మా కాలనీలో ముందు వూరేగించాలంటే మా కాలనీలో వూరేగించాలని పోటీల మీద తీసుకెళ్ళారు. చీరాల నుండి స్టువర్టుపురం కాలనీకి శవం చేరడానికి మూడు రోజులు పట్టింది. బెంగుళూరు, తమిళనాడు, బళ్ళారి, అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు ఇంకా దూర ప్రాంతాల నుండి టైగర్ నాగేశ్వరరావును కడసారి చూసేందుకు అనేక కష్టాల కోర్చి వచ్చారు. చివరకు మూడవ రోజు సాయంత్రానికి అతి కష్టం మీద శవాన్ని ఖననం చేశారు…. ‘‘బాస’’ అక్టోబర్ ` 2010…
Share this Article