Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టైగర్ గాండ్రించలేదు… రవితేజ బ్యాడ్ లక్కు ఓ దొంగ బయోపిక్కు…

October 20, 2023 by M S R

సాగర సంగమం సినిమాలో వెకిలి గెంతులు వేయడానికి ఇష్టపడక… పాత్ర ఔచిత్యం, కథానాయకుడి ఉదాత్తత అంటూ నేటి దర్శక ఘనులకు తెలియని, అర్థం కాని ఏవో మాటలు మాట్లాడి, పక్కకు వెళ్లి, ఖైరతాబాద్ గణేషుడి ఎదుట ఏడుస్తూ డాన్స్ చేస్తాడు కమల్‌హాసన్… నిజమే, ఇప్పుడు హీరోలు అంటే స్మగ్లర్లు, విలనీని నింపుకున్న వ్యక్తిత్వాలు, దొంగలు ఎట్సెట్రా… అబ్బే, పుష్ప సినిమాను ఒక్కదాన్నే నిందించడం కాదు… ఇప్పుడొచ్చేవన్నీ అలాంటి సినిమాలే కదా… తాజాగా ఈరోజు రిలీజైన టైగర్ నాగేశ్వరరావుతో సహా…

అందులోనూ రవితేజ హీరో… హీరోయిన్లను ఎంత ఏడిపిస్తే, ఎంత విసిగిస్తే అంత హీరోయిజం… ఇక అప్పట్లో అనగా 1970 ప్రాంతంలో స్టువర్ట్‌పురంలో ఓ దొంగ చాలా ఫేమస్… అంటే సవాల్ విసిరి మరీ దొంగతనాలు చేయడం, మొండి ధైర్యం ఎట్సెట్రా అన్నమాట… ఆ కేరక్టర్ మన టాలీవుడ్‌కు నచ్చింది… అది హీరోయిక్ పాత్రట… దాన్ని రవితేజ వంటి సీనియర్ నటుడు తీశాడు… మరి కథానాయకుడు అన్నాక ఏదో పాజిటివ్ రంగు పూయాలి కదా… అందుకని రాబిన్‌హుడ్ రంగు పూశారు… సినిమాటిక్ లిబర్టీ, అంటే ఇష్టమొచ్చినట్టు సినిమా తీయడమే కదా ఈరోజుల్లో… అదీ చేశారు…

రవితేజ ఓ పెక్యులియర్ హీరో… నేలటికెట్ వంటి నేలబారు సినిమాలు చేస్తాడు, ధమాకా వంటి హిట్లూ ఇస్తాడు… మధ్యలో బోలెడు పిల్లిమొగ్గలు… ఏదైతేనేం, తనకు సినిమా కావాలి, అంతే… కానీ ఇండస్ట్రీ, తెలుగు ప్రేక్షకుడు తనకు ఓ రేంజ్ ఇచ్చారు, పాత్రల ఎంపికలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనే సోయి మాత్రం కనిపించదు… పక్కా దొంగ బయోపిక్ ఇది… అందులోనూ మన తెలుగు హీరోలకు ఉండే సూపర్, సుప్రీమ్ మానవాతీత శక్తులూ ఉంటాయి… ఉండాలి కదా, మన సినిమాలు అంటే… ఉన్నాయి…

Ads

పోనీ, ఆ దొంగ బయోపిక్కయినా సరిగ్గా తీశారా, అదీ లేదు… పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా మలిచినప్పుడు కథలో టెంపో ఉండాలి… బిగి కనిపించాలి… ప్చ్, పూర్ ప్రజెంటేషన్… చివరకు వీఎఫ్‌ఎక్స్ కూడా నాసిరకమే… సినిమా మొదట్లో ట్రెయిన్ రాబరీ తప్ప ఈ సూపర్ దొంగ చోరకళను ఉద్దరించిన ఘన కార్యాలేమీ ఉండవు… విపరీతమైన హింస… తలలు తెగి, భుజాలు నరకబడి, చేతులు తెగిపోయి, నెత్తురు ట్యాంకర్ల కొద్దీ కారిపోతూ తెరను బీభత్సమైన హింసతో నింపేశాడు దర్శక మహాశయుడు ఎవరో గానీ…

సదరు దొంగ గారు ప్రధాని ఆఫీసులో దొంగతనం చేస్తానని సవాల్ వేస్తాడట, వెంటనే ప్రధాని ఉలిక్కిపడి, భయపడి, వణికిపోయి అక్కడి ఎస్పీని ఢిల్లీకి అర్జెంటుగా రప్పిస్తాడు… అసలు నాగేశ్వరరావు మామూలు దొంగ కాదండీ అని ప్రధాని కార్యాలయానికి పరిచయం చేస్తాడు ఓ ఇంటలిజెన్స్ అధికారి… అసలు ఈ దొంగ గారు ఏకంగా ప్రధాని ఆఫీసునే ఎందుకు టార్గెట్ చేస్తాడనేది సినిమా కథ… అనేకచోట్ల సీన్లు బోరింగ్… ఏమాత్రం కన్విన్సింగ్‌గా లేక, కథ దారితప్పిపోతూ ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెడుతుంది… పైగా సినిమా నిడివి ఎక్కువ… ప్రేక్షకుల మీద మరీ అంత కసి ఏల దర్శక మహానుభావా..?

నటన అనే కోణంలో రవితేజకు ఎవరూ వంకపెట్టలేరు… కానీ వయస్సు మీదపడుతున్న దాఖలాలు కనిపిస్తూనే ఉన్నాయి… పైగా సినిమాలో పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు… రన్ టైమ్ పెంచడానికి మాత్రమే ఉపయోగపడ్డయ్… బీజీఎం ఇలాంటి సినిమాలకు ప్రాణంలా ఉండాలి… అదీ లేదు… అనుపమ్ ఖేర్, రేణుదేశాయ్, నాజర్ వంటి నటులు ఉన్నప్పుడు వారి పాత్రలకు కాస్త ప్రయారిటీ ఇచ్చి, మంచిగా వాడుకోవాలి… అదీ కనిపించలేదు… ప్రత్యేకించి రేణుదేశాయ్ చాలా ఏళ్ల తరువాత తెర మీదకు వచ్చింది… ఆ పాత్రకు ప్రయారిటీ లేదు, ఆమె ఈ దండుగమారి పాత్రను ఎందుకు అంగీకరించిందో అర్థం కాదు… రీఎంట్రీ ఎంత ఘనంగా ఉండాలో చూసుకోవాలి కదా… ఫాఫం…

హీరోయిన్లు కూడా ఆకట్టుకోరు… వాళ్లకు కథ రీత్యా పరిమితులున్నయ్… రొమాంటిక్ ట్రాక్ నాసిరకం… ఈ చప్పచప్పటి కిచిడీలో అక్కడక్కడా హీరోయిజం ఎలివేషన్లు కూడా… మరి తెలుగు హీరో అన్నాక ఈ ఎలివేషన్లు లేకపోతే ఎలా..? కానీ అవీ పేలవంగా ఉన్నాయి… రవితేజ ఇకనైనా తన పాత్రల ఎంపిక పట్ల జాగ్రత్త వహించాలి… చివరగా… రవితేజ ఒక సినిమాలో చాలా పవర్‌ఫుల్ సీరియస్ పోలీస్ పాత్ర (విక్రమ్ సింగ్ రాథోడ్) చేస్తుంటాడు… మరోవైపు రవితేజకు బలంగా ఉండే కామెడీ షేడ్‌తో అత్తిలి సత్తిబాబు పాత్ర చేస్తుంటాడు… సూపర్ కామెడీ టైమింగ్, డైలాగ్ డిఫరెంట్ డిక్షన్ రవితేజ బలాలు… అవి లేకపోతే అది రవితేజ సినిమా అనిపించుకోదు… అవునూ, ఇది పాన్ ఇండియా సినిమాయా..? అనుపమ్ ఖేర్‌ను ఆ లుక్ కోసమే తీసుకున్నారా..? అబ్బో…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రక్తి – భక్తి … కన్నప్ప సరే, ఆ మూడు సినిమాలనూ ఓసారి పరిశీలిద్దాం…
  • తండ్రి బతుకంతా ఆకలి పోరాటమే… కొడుకు ఇప్పుడు ఫేమస్ స్టార్…
  • హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ కచేరీ… కానీ కళ్లు తిరిగే రేట్లు అట..!!
  • బ్లాక్‌మెయిల్ టాక్టిస్‌తో రష్యా, చైనా వైపు అమెరికాయే ఇండియాను నెట్టేస్తోందా..?
  • ఇంగ్లిషు సబ్జెక్టులే అయినా… అడాప్షన్‌లో మెళకువ ఉంటేనే సక్సెస్సు…
  • వజ్రభూమి… Land Of Diamonds… చివరకు మిగిలేది దుమ్మూధూళే…
  • ADHD … స్టార్ ఫహాద్ ఫాజిల్‌కు ఓ అరుదైన ఆరోగ్య సమస్య…
  • ఇది 1 + 2 కాదు… 1 + 3 కూడా కాదు… ఏకంగా 1 + 6 ఫార్ములా…
  • నేత ప్రాణాలే ముఖ్యం… విధిలేక సొంత భర్త ప్రాణాలే తీసేసింది…
  • ‘వానెక్క’ విజయ్ మస్తు చేసిండు… సత్యదేవ్‌తో కలిసి సైన్మా నిలబెట్టిండు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions