చాలామందికి తమకు వోటు ఉందా లేదానేదీ తెలియదు… ప్రత్యేకించి నగరాల్లో ఉండేవారిలో ఇలాంటోళ్లు అధికం… అఫ్‌కోర్స్, వోటు హక్కు ఉన్నా సరే, పోలింగ్ రోజున బయటికి రారు… వోటు వేయరు… అందుకే నగరాల్లో పోలింగ్ శాతం చాలా తక్కువ ఉంటుంది… ‘‘ఈ నాయకులందరూ ఒకే తీరు, ఎవడికి వోటేసినా వేస్ట్’’ అనే భావన బలంగా ఉండటం కూడా ఓ కారణం…
నిజానికి వోటు ఉండటం, వోటు వేయడం మన ప్రజాస్వామిక విధుల్లో ఒకటి… పైగా వోటర్ కార్డు మనకు గుర్తింపు… చాలా విషయాల్లో ఇదే బలమైన గుర్తింపు కార్డు… అడ్రెస్ ప్రూఫ్… దొంగ కార్డులు, వేర్వేరు ప్రాంతాల్లో వోటు హక్కు, ఒకే ఇంటి నంబర్‌తో అనేక కార్డులు వంటి బోలెడు రోగాలున్నా సరే వోటర్ కార్డును తేలికగా తీసిపడేయడానికి వీల్లేదు…
అసలు వోటు హక్కు ఉందా లేదా తెలియాలంటే ఓసారి మీ దగ్గరున్న కార్డు చెక్ చేసుకొండి… మరీ పాత కార్డులైతే ఏ రివిజన్‌లోనో కొట్టుకుపోయి ఉండవచ్చు… ఆ కార్డు మీదున్న నంబర్‌తో ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైటులో చెక్ చేసుకోవడం బెటర్… మీ పేరుతోనో, ఇంటి పేరుతోనో, ఇంటి నంబర్‌తోనో చెక్ చేసుకోవడం కష్టం… మీకు తెలుసు కదా, వోటర్ల జాబితాలు తప్పులతడకలు… వివరాలు సరిపోలవు, చెక్ చేసినా రిజల్ట్ రాదు… అసలు కార్డే లేకపోతే కొత్తగా అప్లయ్ చేసుకోవడం బెటర్… ప్రస్తుతం వోటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు కూడా చాన్స్ ఇచ్చింది ఎన్నికల సంఘం… ఆధార్ కార్డు ఉందా, ఇకపై వాటితో లింక్ చేసి కొత్త కార్డులు ఇస్తారు…
Ads
ఇల్లు మారితే కొత్త ప్రాంతానికి వెళ్తే అడ్రెస్ మార్చుకోవాలి… పేరులో తప్పుంటే మార్పు అవసరం… ఇలాంటి మార్పులకు, కొత్త దరఖాస్తుల పరిశీలనకు మునిసిపల్ ఆఫీసుల్లో ప్రత్యేక విభాగాల్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు… అడ్రెస్ మార్పుకు కొత్త ఇంటి కరెంటు బిల్లు గానీ, గ్యాస్ బిల్లు గానీ జిరాక్స్ ప్రతులు జతచేస్తే చాలు.., కొన్నిసార్లు పొరపాటున రివిజన్‌లో మన వోటు హక్కు ఎగిరిపోయి ఉండవచ్చు కూడా… ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే… ఎన్నికల సంఘం ఈసారి ఇంటి నుంచి వోటు వేసే సౌకర్యం కూడా కల్పించబోతోంది…
గతంలో రెండుమూడు ఉపఎన్నికల్లో, మొన్నటి కర్నాటక ఎన్నికల్లోనూ ప్రయోగించి చూశారు… ఆల్‌రెడీ కేంద్ర బలగాలు, పోలింగ్ సిబ్బంది, రాష్ట్ర పోలీసులు తదితరులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంది కదా… దాన్ని ఇంకాస్త విస్తరిస్తున్నారు… 80 ఏళ్లు పైనబడినవారు, దివ్యాంగులకు కూడా ‘‘అడిగితే’’ ఇంటి నుంచే వోటు వేసే సౌకర్యం కల్పిస్తారు… వేరే రంగులో ఉంటుంది బ్యాలెట్ పేపర్… కాకపోతే ముందస్తుగా వాళ్లు ‘వోట్ ఫ్రమ్ హోమ్’ కోసం దరఖాస్తు చేసుకోవాలి…
అఫ్‌కోర్స్, పోస్టల్ బ్యాలెట్లను కొంటున్నట్టే పార్టీలు వీటినీ ముందస్తుగా కొనుగోలు చేసే అవాంఛనీయ ప్రమాదాలు ఉన్నా సరే… ముసలోళ్లు కష్టపడి పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సిన ప్రయాస లేకుండా ఇది ఉపయుక్త సౌకర్యమే… 80 ఏళ్లు దాటినవాళ్లు తెలంగాణలో దాదాపు 5 లక్షల వరకూ ఉంటారని ఓ అంచనా… వచ్చే నెల మొదటి వారంలోనే షెడ్యూల్ రావచ్చు… అప్పుడిక వోటర్ల జాబితాలో మార్పులు ఉండవు… ప్రస్తుతం జరిగే ప్రక్రియ ఈ ఎన్నికలకు సంబంధించి ఫైనల్… సో, ఓసారి వోటర్ కార్డు వివరాలను చెక్ చేసుకొండి… అన్నట్టు… మునిసిపల్ ఆఫీసు దాకా పోవాల్సిన పనేమీ లేదు… దగ్గరలో మీ-సేవ సెంటర్ ఉన్నా వెళ్లొచ్చు… యాభయ్యో, వందో తీసుకుంటారు..!!
Share this Article