.
మన పద్యం గంట కొట్టదా?
“అనగ అనగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!”
Ads
పాడగా, పాడగా రాగం శ్రుతిలో పడి వీనులవిందు అవుతుంది. తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది. అలాగే పట్టుదలతో చేపట్టిన పని చేస్తూపోతే తప్పకుండా విజయం లభిస్తుంది.
మాతృ భాషకు సంబంధించి తమిళుల తాదాత్మ్యం ముందు మనం నిలువలేము. మన రక్తంలో మాతృభాష పరిరక్షణ కణాలు ఏనాడో మాయమయ్యాయి. ఎందుకు, ఎలా మాయమయ్యాయి? దానికి ఎవరు బాధ్యులు? అని తేల్చడానికి ఎన్నో రక్తపరీక్షలు జరిగాయి. కానీ ఏమీ తేలలేదు. రాజుగారి కొలువులో మనమొక్కరం పాలు పోయకపోతే ఏమవుతుంది అనుకుంటూ అందరూ నీళ్ళే పోసినట్లు…దీనికి తెలుగువారందరూ బాధ్యులే. కానీ మనం ఒప్పుకోము. బాధ్యత తీసుకోము.
వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు సాహిత్యంలో కళ్ళముందు కదిలే దృశ్యాన్ని ఆవిష్కరించిన తిక్కన;
తెలుగు మాటలకు సంస్కృత మంత్రాలకంటే గొప్పతనాన్ని ఆవాహన చేసి…మందార మకరంద మాధుర్యాలను పోతపోసిన పోతన;
అచ్చ తెలుగు జానపదాన్ని జ్ఞానపథంగా ఎంచుకుని…జనం భాషను వెంకన్నకు పదకవితల మహా నైవేద్యంగా సమర్పించిన అన్నమయ్య;
అయోధ్య రాముడిని భద్రాద్రిలో కూర్చోబెట్టి తెలుగు కండ చక్కెర, అరటిపళ్ళు, తీయతేనియల కీర్తనలతో అభిషేకించిన రామదాసు;
తమిళగడ్డమీద కావేరీతీరంలో సాకేత రాముడిని తిప్పుతూ తెలుగు నగుమోమును రాముడికే అద్దంలో చూపించిన త్యాగయ్య;
జనం మూర్ఖత్వం మీద జనం భాషలోనే ఈటెల్లాంటి ఆటవెలదుల పద్యాలతో జనం కోసం యుద్ధం చేసిన వేమన… ఇలా నన్నయ్య నుండి నిన్నటి వేటూరి, సిరివెన్నెల దాకా తెలుగును సుసంపన్నం చేసినవారు ఒకరా! ఇద్దరా! లెక్కలేనంతమంది. కానీ మన లెక్కలేనితనంతో మన తెలుగు పూర్వ వైభవమేమిటో మనకు తెలియదు. తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండదు.
అదే పొరుగున తమిళనాడులో సమున్నత వారసత్వంగా భావించే శతాబ్దాల, సహస్రాబ్దాల కిందటి తమిళ సాహిత్యాన్ని ఏదో ఒకరూపంలో బతికించుకుంటూ ఉంటారు. మననం చేసుకుంటూ ఉంటారు. వాటిలో దాగిన అమూల్యమైన మణిమాణిక్యాలను వెలికి తీసి కొత్తతరానికి అందిస్తూ ఉంటారు. వాటి ప్రాసంగికత (రెలవెన్స్) కోసం వారు చేసే ప్రయత్నాలకు చేతులెత్తి మొక్కాలి.
దాదాపు రెండువేల ఏళ్ళ కిందట తిరువళ్ళువర్ రచించిన “తిరుక్కురళ్” తమిళవేదం. రాజకీయ, ఆర్థిక, మానవ, సామాజిక సంబంధ విషయాలకు గొప్ప మార్గదర్శి. రెండు పంక్తుల్లో రచించే “కురల్”లో తమిళ అందం పోతపోసినట్లు ఉంటుంది.
తిరుక్కురళ్ కవితల ప్రస్తావనలేని తమిళ సామాజిక రచనలు ఉండవు. అలాంటి తిరుక్కురళ్ కవితలను గంట గంటకు వినిపించడానికి వీలుగా చెన్నయ్ మహానగరపాలక సంస్థ ఒక క్లాక్ టవర్లో ఆటోమేటిక్ ఆడియో ఏర్పాట్లు చేసింది. దీనికి దాదాపు 8 లక్షలు ఖర్చయ్యింది. ప్రతిగంటకు వివిధ భాషల్లో సమయం ఎంతయ్యిందో చెప్పి చివర ఒక తిరుక్కురళ్ సూక్తిని వినిపిస్తుంది.
“…తెలుగు పద్యాల తియ్యందనాలు;
తెలంగాణ కోటి రతనాల వీణలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ పాటలే వింటాం…
జై తెలుగు తల్లీ! జై తెలంగాణ తల్లీ!”
అని మన దగ్గర కూడా క్లాసిక్ ఆడియో క్లాక్ టవర్లు ఏర్పాటు చేస్తే అన్నమయ్య అన్నట్లు చెవి బడలిక తొలంగ వినవచ్చు కానీ… మన భాషాభిరుచి దేవతావస్త్రం కథ కాబట్టి అది పగటి కలగా అయినా సాధ్యం కాదు!
అయినా… అమ్మనాబూతుల పాటలను నిత్యం పరవశంగా పాడుకునే మనకు ప్రాచీన తెలుగు పద్యం వినపడాలని, ఆ పద్యాల విలువ తెలియాలని, అది మన పూర్వవైభవంగా నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉండాలని, ఆ పలుకు తేనెల తెలుగు మనలో నరనరాన ఇంకిపోవాలని అనుకోవడం అత్యాశ అవుతుంది! లేదా దురాశ అవుతుంది!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article