మొదటిరోజు కళ్లు మూసుకుపోయిన ఈనాడుకు హఠాత్తుగా రెండోరోజు కళ్లు తెరుచుకున్నాయి… అయ్యో, ఈ లడ్డూ గొడవ మన చంద్రబాబుకు ఎక్కడ నష్టం తీసుకొస్తుందో అన్నట్టుగా… చివరకు చంద్రబాబే స్వయంగా చెప్పినా సరే… నో, నో, అనుకుని లడ్డూ అపచారం వార్తను పూర్తిగా అండర్ ప్లే చేసింది… హైదరాబాద్ ఎడిషన్‌లో అయితే ఎక్కడో స్పేస్ ఫిల్లింగ్ తరహాలో వేసింది…
నిజానికి లడ్డూ వ్యవహారం కేవలం ఏపీకే సంబంధమా..? కోట్ల మంది శ్రీవారి భక్తులకు సంబంధించిన వార్త మీద ఇంత తేలికభావన ఏమిటి..? ఏమైందో ఏమిటో, చంద్రబాబు కూడా ఇదేమిటి అనడిగాడేమో… ఈరోజు ఇక రెచ్చిపోయింది… అనేక కథనాల్ని పేర్చింది… ఇదేదో కొత్త వార్త, మాకూ ఇప్పుడే తెలిసింది అన్నట్టుగా… ఫాఫం ఈనాడు…
ఆంధ్రజ్యోతికి ఇలాంటి వార్తలు దొరికితే ఊరుకుంటుందా..? అసలే చంద్రబాబు కోరుకున్న ప్రచారం… ఇంకేం..? నిన్నా ఈరోజు రెచ్చిపోయింది… మొదటిరోజు మాత్రం ఈ వార్తను పట్టుకోలేకపోయింది… వైఫల్యమే… ఫాఫం, చంద్రబాబు ఏదో ఫ్లోలో చెప్పి ఉంటాడులే అనుకుందేమో… ఇక సాక్షి… తప్పదు, జగన్ మీద జరుగుతున్న దాడిని ప్రతిఘటించాలి, ఎదురుదాడి చేయాలి… తిప్పలు పడుతోంది… ఇదంతా చంద్రబాబు కుట్రే అని చెప్పడానికి… (వరదలు, కాదంబరి, లడ్డూ… బిడ్డొచ్చినా, గడ్డొచ్చినా ఇప్పుడు మంత్రసానితనం సాక్షిదే పాపం, మరో పెద్ద వాయిస్ లేకుండా పోయింది వైసీపీలో…)
Ads
ఆ దేవుడికన్నా మా జగన్ దేవుడే మాకు ముఖ్యం అన్నట్టుగా వేల సోషల్ మీడియా భక్తులు పెడుతున్న పోస్టులు మరో విస్మయకర అంశం… మొదటి రోజు టీవీలకు పట్టలేదు… నిజానికి సెన్సేషన్ కోసం ఏ గడ్డయినా తింటాయి కదా చానెళ్లు… కానీ చంద్రబాబు తనే ‘యానిమల్ ఫ్యాట్’ అని వెల్లడించడాన్ని, అందులో సివియారిటీని పసిగట్టలేక మైకులెత్తేశాయి… రెండోరోజుకు గానీ బుర్రలు పనిచేయలేదు… ఎప్పుడైతే నేషనల్ మీడియా తిరుమల మీద ఫోకస్ చేసిందో, అప్పుడు గానీ తెలుగు చానెళ్లకు చురుకు పుట్టలేదు…
తమిళ ఏఆర్ మిల్క్ కంపెనీ నెయ్యి మీదే ఎందుకు టీటీడీ ఈవో ఆరోపణలు చేశాడు..? ఉత్తరప్రదేశ్ హలాల్ కంపెనీ మంచి నెయ్యే సరఫరా చేసిందా..? ఏఆర్ ఏదో ల్యాబులో పరీక్ష చేయించి, ప్రెస్‌మీట్ పెట్టగానే పాపవిముక్తి జరిగిపోయిందా..? నివేదనకు 1300 ధర నెయ్యి అట, లడ్డూకు మాత్రం 300 ధర నెయ్యి అట… పైగా వేల కోట్ల ధనిక దేవుడు కనీసం కోటి రూపాయలతో సొంత ల్యాబ్ కట్టుకోలేకపోవడం ఏమిటి ఇన్నేళ్లూ…
జగన్ చెబుతున్నాడు, మనం మూడు దశల్లో పరీక్షలు చేయిస్తాం, గొప్ప వ్యవస్థ అని… చంద్రబాబు పీరియడ్‌లో, మా పీరియడ్‌లో ట్యాంకర్లు వాపస్ పంపించేసిన సందర్భాలు బోలెడున్నయ్ అంటున్నాడు… మరి అంత గొప్ప వ్యవస్థ ఉండీ తప్పుడు నెయ్యి ఎలా వచ్చింది..? చంద్రబాబుకు అక్షింతలు వేయడానికి విచారణ జరిపించాలని ప్రధానికి, సుప్రీంకోర్టుకు లేఖలు రాస్తాడట… అంటే తప్పు చంద్రబాబుదే, మాదేమీ లేదు అంటున్నాడు… సహజమే…
కానీ నిజంగానే జంతువుల కొవ్వు అనేది నిజమని తేలితే బాధ్యులను ఎలా శిక్షించినా సరే అని ఉండాల్సింది… ఎవరో ఉన్నతాధికారో, ఏ ట్రస్టు బోర్డు బాధ్యుడో అదే కొవ్వు తినిఉంటాడు, పోతేపోనీ, అనుభవించనీ… ఎలాగూ జగన్ ఇలాంటి విషయాల్లో తను అపచారం చేయడు, చేసి ఉండడు… గుడ్డిగా నమ్మి ఉంటాడు కొందరిని..!! ఇవన్నీ సరే, చంద్రబాబు డైవర్షన్ స్ట్రాటజీ కింద ఈ తీవ్ర అపరాధానికి తలబడిఉంటే, జగన్ చెప్పినట్టు అదే తేలితే… శ్రీమాన్ మోడీ గారూ, చంద్రబాబును ఏం చేద్దామంటారు..?
Share this Article