నిజంగా ఆశ్చర్యమే…. టీఎన్ఆర్… పూర్తి పేరు కూడా అనవసరం… టీఎన్ఆర్ అంటేనే తెలుసు అందరికీ…. కోట్ల మంది తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు తెలుసు… దురదృష్టవశాత్తూ కరోనా వల్ల తనను కోల్పోయాం… చాలామందిని కోల్పోతున్నాం రోజూ… కానీ ఒక టీఎన్ఆర్ మరణం గురించి తెలుగు నెటిజనమంతా బాధపడుతోంది… కేవలం ఫేస్బుక్ పోస్టుల కోసమో, సోషల్ మీడియాలో సంతాపం కోసమో కాదు… గుండె లోతుల్లోంచి ఓ పెయిన్ ఫీలవుతున్నది తెలుగు నెట్ సమాజం… నిజం… ఒక సినిమా జర్నలిస్టు, అదీ ఒక ఇంటర్వ్యూయర్, యూట్యూబ్ ఇంటర్వ్యూయర్… మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో, టీవీల్లో వచ్చే సోది ఇంటర్వ్యులు చేసేవాడు కాదు… కానీ ఓ పాపులర్ హీరోకు, ఓ ఫేమస్ లీడర్‌కు కూడా దక్కనంత జనం ప్రేమను ఎలా సంపాదించాడు..? అబ్బురమే… టీఎన్ఆర్ ఇంతగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తిష్ఠవేశాడని ఇన్నాళ్లూ మనమే సరిగ్గా అంచనా వేయలేదేమో…
ఇంటర్వ్యూలు అంటే ఎలా ఉండాలి..? టీఎన్ఆర్ ఇంటర్వ్యూలు ఒక ఉదాహరణ… అంతే, ఇంకేమీ లేదు… మోస్ట్ ఇగోయిస్టిక్, హిపోక్రటిక్ సినిమా పర్సనాలిటీల్ని కూల్‌గా, స్ట్రెయిట్‌గా, మొహంలో నవ్వు చెరిగిపోకుండా ప్రశ్నలడిగే తీరు… ఇక ఎవరికీ చేతకాదేమో… నెవ్వర్… ఊరికే అల్లాటప్పాగా నాలుగు ప్రశ్నలడిగేసి, దులిపేసుకునే టైపు కాదు… ముందుగా ఎక్సర్సైజ్ చేస్తాడు, ఏ ప్రశ్నలడగాలో ప్రిపేరవుతాడు… టెంపర్ కోల్పోడు, ఇంటర్వ్యూ చేయబడే సెలబ్రిటీ ఎదుట సాగిలబడడు… మెల్లిమెల్లిగా తన లోతుల్లోకి వెళ్తూ, అనేక విషయాన్ని రాబట్టేస్తాడు… గంటల వ్యవధి ఇంటర్వ్యూలు… ఎవరు చూస్తారనేది పిచ్చి ప్రశ్న… జనం పిచ్చిపిచ్చిగా చూశారు గనుక…
Ads
ఈమధ్య కొన్ని సినిమాల్లోనూ నటించాడు… దర్శకులు ఈయన్ని ఇంకాస్త బాగా ఎక్స్పోజ్ చేసుకుని ఉండాల్సింది, వాడుకోవాల్సింది అనిపించింది… అసలు తను ఇంతగా నెటిజనం ప్రేమ పొందడానికి కారణం కేవలం తన ఇంటర్వ్యులు మాత్రమే కాదు… తన పర్సనాలిటీ… వివాదాల్లోకి వెళ్లడు… స్నేహశీలి… అందరితోనూ బాగుంటాడు… తన ఇంటర్వ్యులు చూస్తుంటే… టీఎన్ఆర్ మనల్ని ఆవహిస్తాడు, మనమే సదరు సెలబ్రిటీల్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ఫీలవుతాం… అదీ తను జనం ప్రేమను పొందడానికి కారణం… అసలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు అంటేనే ఓ దరిద్రం అనే భావన ప్రేక్షకుల్లో ఉంది… వాటి థంబ్ నెయిల్స్, వాటి కంటెంట్, వెకిలి ప్రశ్నలు ఎట్సెట్రా… మరీ వర్మ వంటి కేరక్టర్ల ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలనే పాతాళం స్థాయికి తీసుకుపోయినయ్… అవి చూసేకొద్దీ టీఎన్ఆర్ ఇంటర్వ్యూల గొప్పతనం అందరికీ అర్థమైంది… మరింత అధికంగా… సెలబ్రిటీని ఏమాత్రం కించపరచకుండా, తను సాగిలబడకుండా… సదరు సెలబ్రిటీ తనంతట తానే వ్యక్తిగత విషయాల్ని పంచుకునేలా ఇంటర్వ్యూ చేయడం చిన్న విషయమేమీ కాదు… వెరసి తనతో ఇంటర్వ్యూ చేయబడటం కూడా ఓ గర్వకారణం అనుకునే స్థితి వచ్చేసింది… మరి వేలాది మంది తెలుగుజనం తమ ఇంటి మనిషిని కోల్పోెయినట్టు ఎందుకు చింతిస్తున్నారు..? ఆ చిరునవ్వు మొహాన్ని చూసి అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి…! ఏదో తెలియని ఆత్మీయబంధం కనెక్ట్ అయిపోయింది కాబట్టి…!!
Share this Article