Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొత్త జాతీయ పార్టీ ఆప్… బీఆర్ఎస్ కాదు… అప్పుడే అంత సీన్ లేదు…

December 9, 2022 by M S R

మళ్లీ మళ్లీ అదే పిచ్చిమోత… పార్టీ పేరు మారితే జాతీయ పార్టీ అయిపోయినట్టు బబ్రాజమానం భజగోవిందం తరహా పిచ్చి ప్రచారం… టీఆర్ఎస్ పార్టీ విధేయ మీడియాలోనూ అదే ధోరణి… పాత్రికేయాన్ని పాతరేసి, కరపాత్రికేయాన్ని మోస్తున్న వైఖరి… ఎస్, టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుంది… దాని ఓనర్‌కు ప్రధాని కుర్చీ కావాలట… అదెలాగూ ఆయన సొంత పార్టీ… తన ఇష్టం… తను చెప్పిందే వేదం… తను చేసిందే శాసనం… మేల్ శివగామి స్టయిల్… మళ్లీ నాలుగు రోజులకు నో, నో, నా తెలంగాణ, జై తెలంగాణ అంటూ మళ్లీ పేరు మార్చుకున్నా సరే, ఆహాశ్చర్యమే అవసరం లేదు…

ఈరోజు కూడా సారు గారి సొంత పత్రిక ఓవరాక్షన్… అదేదో గొప్ప రాజకీయ పరిణామం అయినట్టుగా… నిజంగానే టీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోయినట్టుగా… దేశ రాజకీయ యవనికపై మన జయపతాక అట… ఎన్నికల సంఘం రాజముద్ర వేయడం జయపతాక ఎగరేసినట్టా..? జాతీయ స్థాయికి కొత్త ధ్రువతార కేసీయార్ అంటూ మరో డెక్కు… మామూలుగా ధ్రువతార అని ఏ సందర్భాల్లో వాడతామో తెలుసా వీళ్లకు అసలు..?

brs

ఒక్క నమస్తే తెలంగాణ మాత్రమే కాదు, దాదాపు కేసీయార్ అదుపాజ్ఞల్లో ఉన్న ప్రతి పత్రిక, ప్రతి టీవీ అంతే… హబ్బా, జస్ట్, పేరు మారిందే తప్ప, నీకు నువ్వు జాతీయ పార్టీ అని చెప్పుకోవడం తప్ప… కేంద్ర ఎన్నికల సంఘం నిన్ను జాతీయ పార్టీ అనడం లేదు బాబూ.., పేరు మార్పుకు అంగీకరించాం అని లేఖ పంపించింది… అంతే…

పేరులో తెలంగాణ ఉంది కాబట్టి… అది మరీ ప్రాంతీయతను సూచిస్తున్నది కాబట్టి, తనకు జాతీయ స్థాయి కావాలి కాబట్టి… దానికంటూ ఓ కొత్త పార్టీ పెడితే కొన్ని కొత్త చిక్కులు వస్తాయి కాబట్టి….. తెలంగాణతనాన్ని వదిలేసింది… భారత రాష్ట్ర సమితి అని స్వీయ నామకరణం చేసుకుంది… అంతకుమించి ఇప్పటికిప్పుడు జరిగింది లేదు, ఒరిగిందీ లేదు… మరెందుకీ గోబెల్స్ ప్రచారం…?

నిజానికి వార్త అంటే ఆప్ జాతీయ పార్టీగా అవతరించడం… హఠాత్తుగా రాత్రికిరాత్రి అబ్రకదబ్ర అని గాలిలో మంత్రదండం ఊపి, జాతీయ పార్టీ అయిపోలేదు అది… పార్టీ పేరు సేమ్… మెల్లిమెల్లిగా ఒక్కో రాష్ట్రానికి అక్టోపస్‌లా చేతులు విస్తరిస్తూ… ఓట్లు సాధిస్తూ… నిజంగానే జాతీయ పార్టీ అయ్యింది… ఒక్కసారి ఈ వార్త చూడండి…

ఆప్

ఇదీ వార్త… కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొంది ఉండాలి… నాలుగు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు సాధించి ఉండాలి… లాస్ట్ ఎన్నికల్లో కనీసం 2 శాతం సీట్లను కనీసం మూడు రాష్ట్రాల నుంచి గెలిచి ఉండాలి… ఆప్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది… అప్పట్లో గోవాలో 6.77 శాతం ఓట్లు తెచ్చుకుంది… ఇప్పుడు గుజరాత్‌లో పది శాతం దాటి ఓట్లు తెచ్చుకుంది… హిమాచల్‌లో పెద్ద రిజల్ట్ లేకపోయినా ఓట్ల శాతం బాగానే పెంచుకుంది…

సో, జాతీయ పార్టీగా గుర్తింపుకు అర్హత సాధించింది… నిజం చెప్పాలంటే బీఆర్ఎస్‌కన్నా తన తోక లేదా తను తోకగా ఉన్న మజ్లిస్‌ను జాతీయ పార్టీ అనాలి… యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఉనికి ఉంది, కొన్ని ఓట్లు ఉన్నయ్, కొన్ని సీట్లు ఉన్నయ్… ప్రస్తుతం అధికారికంగా కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, టీఎంసీ మాత్రమే జాతీయ పార్టీలు… ఆప్ ఎనిమిదో జాతీయ పార్టీ… ఏమో, సరిగ్గా లెక్కలు తీస్తే రాబోయే రోజుల్లో మజ్లిస్ దరఖాస్తు చేసుకోవచ్చునేమో… అదే రాబోయే రోజుల్లో సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ, టీఎంసీ తమ జాతీయ హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది… అంతే తప్ప, మేం జాతీయమహో అని డప్పు చాటుకుంటే జాతీయ పార్టీ కాలేదు ఏ పార్టీ…!!

అతిశయోక్తులు, అతిభజన నిజమైన నాయకుడిని ఆవిష్కరించలేవు… ఆచరణ, ఫలితాలే దేనికైనా గీటురాయి… గతంలో ఇదే నమస్తే తెలంగాణ అతిశయోక్తి అనే పదమే అతి అని అంగీకరించిన తరహాలో ఓ బొమ్మ, ఓ వార్త వడ్డించింది… జస్ట్, పార్టీ పేరు మార్పిడి పథకానికి గాంధీ క్విట్ ఇండియా మూమెంట్‌కు లంకె పెట్టినట్టుగా… అంత కలరింగ్ ఇచ్చింది పత్రిక… అప్పట్లో, యాభై ఏళ్ల కింద జయప్రకాశ్ నారాయణ ఇందిర ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చిన మహోజ్వల ఘట్టంతో పోల్చింది… ఇలా…

brs

 

జనసేన యుద్దవాహనం సిద్ధమైంది కదా… ఇక కొండగట్టులో పూజలు చేసి, ఆయుధం పట్టి, యుద్ధభేరి మోగించడమే… రెండు రాష్ట్రాలు… అదీ జాతీయ పార్టీయే… తెలుగుదేశం పార్టీని కూడా జాతీయీకరించేసి, భారతదేశం అని పేరు మార్చేసి, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, అండమాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని చాటడమే… కేఏపాల్‌ది ఎలాగూ అంతర్జాతీయ పార్టీ… దానికి ఏ ఫరక్ పడదు… నిఖార్సయిన తెలంగాణతనానికి నిలువెత్తు ముఖచిత్రం షర్మిలకు జాతీయ సంకల్పాలు, లక్ష్యాలు ఎటూ లేవు… ఇక మిగిలింది ఎవరబ్బా…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం… లోకేష్ కూడా అదే బ్లడ్డు, అదే బ్రీడు కదా… ఆ గూటి పక్షికి ఆ కూతలే కదా..?!
  • నువ్వు చాలా దిల్‌దార్… గ్రేటే కానీ, మరి తెలంగాణ నీటిప్రయోజనాల మాటేంటి..?
  • ఝలక్కులు కావు… ఇదుగో మజ్లిస్ జిల్లాల్లో పోటీకి తొలిదఫాలో గుర్తించిన సీట్లు…
  • ఆధునిక సినిమా ద్వేషి రంగనాయకమ్మకూ నచ్చిన శంకరాభరణం..!
  • ‘‘ఆర్టిస్టులను గౌరవిద్దాం సరే… ప్రజల మనోభావాలను వాళ్లూ గౌరవించాలి కదా…’’
  • సహస్ర శిరచ్ఛేద ‘అహిలావతి’ కథ… రాక్షసరాజును పెళ్లాడిన ప్రజ్ఞా యోధ…
  • స్టెప్ మోషన్‌లో… ఒక్కొక్కరినీ పరిశీలిస్తూ ‘కవర్’ చేయాల్సి వచ్చింది…
  • అది ఖచ్చితంగా గూఢచర్య పరికరమే… అన్ని దేశాలపైనా చైనా నిఘా కన్ను…
  • ముంబైలో వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • సుప్రీం చెప్పినా కదలని కేసీయార్ సర్కారు…! తొండి ఆట- మొండిచేయి…!!

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions