Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డెమోక్రసీ అనేదొక డేంజరస్ నిషా… ఓటు పవిత్రమైంది సుమా, జాగ్రత్త..!

May 12, 2024 by M S R

Taadi Prakash…….     ఎవరు డబ్బిచ్చినా తీసుకో…. ఎవరు మందు పోయించినా తాగు… TO VOTE IS OUR SACRED DUTY…

—————————————————-

గంగా, గోదావరి లాంటి జీవనదులూ….

Ads

కన్నతల్లీ, కాశీపుణ్యక్షేత్రమూ మనకి ఎంతో పవిత్రమైనవి.

గుళ్ళో హారతి, మెళ్ళో మంగళసూత్రం పవిత్రం!

ఓటు మరింత పవిత్రమైనది!

ఇలా పవిత్రతను మనం విచ్చలవిడిగా వాడుతుంటాం.

డబ్బు పవిత్రమైనది అని మాత్రం అనం.

డబ్బు విలువైంది. అవసరాలు తీర్చేది.

అడ్డమైన సుఖాలూ తెచ్చి యిచ్చేది.

పవిత్రమైన ఓటుని కొనగలిగే శక్తి కలది.

కనుక డబ్బు పవిత్రమైనది. ఓటు వేశ్య లాంటిది.

మీ పవిత్రమైన ఓటుని మందుకీ, బిర్యానీకీ, డబ్బుకీ అమ్ముకోకండి. ఓటు అమ్ముకున్న వాళ్ళు బతికి వున్న శవాలతో సమానం అని చాలామంది ప్రచారం చేస్తున్నారు. మీ ఒక్క వోటు పైనే ఈ ప్రజాస్వామ్యసౌధం నిలబడి వుంటుంది తెలుసా అని బెదిరిస్తున్నారు.

ఇది ‘పేదభూమి’ అని బాగా తెలిసినవాళ్ళే మనది వేదభూమి అని బ్లాక్ మెయిల్ చేస్తుంటారు.

మే 13 దుర్దినం అనీ, అది ప్రజాస్వామ్యానికి తద్దినం అని ఎవరూ చెప్పరు. వరదలూ భూకంపాలూ వచ్చినట్టుగా మనకి ఎన్నికలు ముంచుకొస్తూ వుంటాయి. పంచాయితీ, జెడ్పి, మేయర్, మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూనే వుంటాయి. ఎన్నికలు అయిపోయింతర్వాత ఏం జరుగుతుంది?

ఒకడు చనిపోయాడనో, మరొకడు రాజీనామా చేశారనో-మళ్ళీ ఉపఎన్నికలు జరుగుతాయి. ఇదొక నిరంతర న్యూసెన్సు.

ప్రతీ ఎన్నికలో భూమి దద్దరిల్లిపోయేలా, చెవులు చిల్లులు పడేలా ప్రచారం. పోలింగ్ కి రెండు మూడు రోజుల ముందు నల్ల డబ్బు జీవనదిలా ప్రవహిస్తుంది. ఉచితంగా ఉదారంగా బీరూ సారా, ఆల్కహాలూ ఏరులై పారుతుంది. ఆ తూగులోనే, ఆ మత్తులోనే పోలింగ్ అనే ఆర్గనైజ్డ్ నాటకం ప్రశాంతంగానో, గొడవల్తోనో ముగిసిపోతుంది.

వేలాది వోట్లను కోట్లాది రూపాయలతో కొన్నవాడు ప్రజాస్వామ్యమే గెలిచిందని ప్రకటిస్తాడు.

ఏం చెప్పావ్ గురూ అని మనం కింద పడతాం. చప్పట్లు కొడతాం….

and the show must go on

* * *

మన దేశంలో ఎన్నికలు అనేవి కొందరు తెగబలిసిన కోటీశ్వరుల రాజకీయగేమ్ గా మారి చాలా ఏళ్ళయింది. ఇప్పుడు గుంటూరు నుంచి తెలుగు దేశం వీరునిగా పోటీలో వున్న పెమ్మసాని చంద్రశేఖర్ అనే బిలియనీరు “నా ఆస్తి అయిదువేల కోట్లు”అని ప్రకటించారు. అమెరికాలో వుండే ఆ వ్యాపారస్తుడికి అర్జంటుగా ప్రజాసేవ చేయాలని ఒక రోజు పొద్దున్నే అనిపించింది. ఇలా వేల కోట్లు వెనకేసి, బోరు కొట్టిన వాళ్ళు, చంద్రబాబుకో, జగన్మోహన్ రెడ్డికో, పోనీ రేవంత్ రెడ్డీ, కేసీయార్ కో వందా నూట యాభై కోట్లు యిచ్చి లోక్ సభకి బీఫాం కొనుక్కోవచ్చు.

ఎంపీ సీటంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు.

అన్ని చోట్లా అహోరాత్రాలు ప్రచారానికీ, డీజిల్ కి పెట్రోల్ కి, సారా విస్కీలకి, భోజనాలకీ, చిల్లర ఖర్చులకీ కోట్లు ఖర్చు చేయక తప్పదు. అంతటితో అయిపోదు. ఓటుకింత అని పంచాలి. పంచి తీరాలి, గెలవాలంటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం వాళ్ళు వోటుకి 1500 రూపాయలు, జగన్ పార్టీ వాళ్ళు రెండు వేల రూపాయలు పంచుతున్నారని నా మిత్రులు చెప్పారు. అది మూడు నుంచి ఐదు వేలకు ఈ రాత్రికే పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాలకు పోటీ చేస్తున్న అన్ని పార్టీల వారిలో 604 మంది కోటీశ్వరులే! అందులో 307 మంది బాగా పులిసిన అరివీర ధనాంధులు!

పేద ప్రజలకు జీవితాన్ని అంకితం చేసిన చంద్రగిరి వ్యాపారస్తుడు చంద్రబాబు ఆస్తులు 931 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది లీగల్, అనగా వైట్ మనీ. నల్ల డబ్బు డిక్లేర్ చేయకూడదని మనందరికీ తెలుసు.నెల్లూరు సిటీ నుంచి టిడిపి గుర్రంగా బరిలో దిగిన పొంగూరు నారాయణ అనే విద్యాదొంగ ఆస్తులు 824 కోట్లు మాత్రమే.

పేద జనం గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న పులివెందుల తండ్రి చాటు ‘బిడ్డ’ కేవలం 757 కోట్ల ఆస్తితో పాపం మూడో స్థానంలో వున్నాడు.

జగన్ కుటుంబ ఆదాయం ఏడాదికి 73 కోట్లు.

టిడిపి అభ్యర్ధి జనార్ధనరెడ్డి కుటుంబ ఆదాయం సంవత్సరానికి 37 కోట్లు. వైసీపీ కాండిడేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి కుటుంబ ఆదాయం ఏడాదికి 34 కోట్లు మాత్రమే. వీళ్ళంతా పేద జనం, ముస్లింలు, దళితుల కోసం ప్రతిక్షణం ఆలోచిస్తూ, నిద్ర పట్టక… అహోరాత్రాలు వోట్ల కోసం వేల కోట్లు పంచుతూనే వున్నారు. కార్లూ, లారీలూ, బస్సుల్లో ఎక్కడబడితే అక్కడ దొరుకుతున్న వందల కోట్ల నోట్ల కట్టలే ఈ దయాళువుల ఔదార్యానికి రుజువులు, సాక్ష్యాలు! మినహాయింపు లేకుండా అన్ని పార్టీల్లోనూ ఈ ధనకొండచిలువలున్నాయి.

ఈ ప్రజాసేవల్లో అనేకమంది క్రిమినల్స్ వున్నారు. హత్యలూ, అత్యాచారాలు, దౌర్జన్యాలూ, దొంగ డబ్బు సామ్రాజ్యాలూ….వీళ్ళ పై కేసులు వున్నాయి. వీళ్ళు పాలు,పెరుగు , గుట్కా, డ్రగ్స్, లిక్కర్ , పచ్చళ్లు, కూల్ డ్రింక్స్ అమ్ముతారు. భూములు, ఫ్లాట్లు, ఇసుక, ఐరన్ వోర్, విల్లాలు, కార్లు , ట్రాక్టర్లు అమ్ముతుంటారు.

రుచికరమైన పాన్ మసాలా నుంచి ఉత్తేజకరమైన కత్తులూ, తుపాకులూ, గంజాయి… వీళ్ళు నిరంతరం అమ్ముతూనే వుంటారు.

నువ్వు మాత్రం వోటు అమ్ముకోకూడదు.

అది పవిత్రమైందిరా ఇడియట్.

వాళ్ళు భక్తినీ, భగవంతుణ్నీ, దేశ భక్తినీ ఒక పవర్ఫుల్ ప్యాకేజీగా అమ్ముతుంటారు.వీళ్ళే -వెయ్యికో రెండు వేలకో, మందు సీసాకో, మటన్ బిర్యానీకో వోటు అమ్ముకోవడం ఎంత నీచత్వం! అంటుంటారు.

మన రాజకీయ ముసుగు దొంగలది చాలా సింపుల్ లాజిక్.పేదవాడు నూరు శాతం నీతిగా వుండాలి. డబ్బున్నవాడు మాత్రమే అక్రమాలు చేయడానికి అర్హుడు!

“కామన్ మేన్ కంటే కరప్ట్ అయినవాడు ఈ దేశంలో ఎవడూ లేడు”అని ఒక చిల్లర సినీ హీరో ఆవేశంతో అతిగా వాగుతుంటాడు.

“తాగి వోటేస్తావా?”అని ఎల్బీశ్రీరాం అనే హాస్యనటుడు సిగ్గులేకుండా పేదవాడికి నీతి బోధ చేస్తుంటాడు. ఓటుని అమ్ముకోవడం అంటే ఆత్మని చంపుకోవడమే అని మరొక పోలిటికల్ స్కౌండ్రల్ హితవు చెప్తుంటాడు. ఇలాంటి సెంట్రల్లీ ఎయిర్ కండిషన్‌డ్ సుఖలాలసలకు పేదరికం అంటే హేళన! పేదవాడంటే చులకన!

బిలో ది పావర్టీ లైన్ గాళ్ళంటే లోకువ!

అదానీ అంబానీలు వీళ్ళకి ఆదర్శపురుషులు! అమిత్ షా, మోడీ వీళ్ళ ఆధ్యాత్మిక రుషులు! రెపరెపలాడే అమెరికన్ డాలర్ వీళ్ళ జాతీయ జెండా!

PRESS THE LOTUS BUTTON. TO VOTE IS OUR SACRED DUTY అంటుంది BJP.

ఈ దేశంలో పేదజనం ఎప్పుడూ, మాకు డబ్బివ్వండి, బిర్యానీ పెట్టించండి, బాబ్బాబు మందు పోయించండి అని ఎవర్ని అడగలేదు. నరనరానా స్వార్థం నిండిన రాజకీయ నాయకులే, మీకు డబ్బిస్తాం మమ్మల్ని గెలిపించండి . మీకు సారా పోయిస్తాం, మాకు వోటెయండి అని ప్రాధేయపడ్డారు. కాళ్ళబేరానికొచ్చారు. ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధపడ్డారు.

వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బిజెపి … ఏ పార్టీ అయినా, వీళ్ళు జర్నలిస్టుల్ని కొన్నారు.

లాయర్లకి లంచాలు యిచ్చారు. సామాన్య జనాన్ని ప్రలోభపెట్టారు. అందమైన ఆడవాళ్ళని ఎరగా వేసి పనులు జరిపించుకున్నారు. విలువైన భూముల్ని కారు చవగ్గా కొట్టేశారు. అప్పులంటూ బాంకుల్ని కొల్లగొట్టారు. నోట్లకట్టలు విసిరి పోలీసుల నోళ్ళు మూయించారు. అడుగులకు మడుగులొత్తే బానిసల్ని తయారుచేసుకున్నారు. గూండాల్ని, హంతకుల్నీ పెంచి పోషించారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని, వోటు పవిత్రమైనదనీ, రైతే ఈ దేశానికి వెన్నెముక అనీ,పేదవాడి కోసం మేం ప్రాణత్యాగం చేస్తామని ‘ప్లాసిబో’ అనే పంచదార గుళికల్ని మన చేత బలవంతంగా మింగిస్తున్నారు.

సో… నిరుద్యోగికీ, నిరక్షరాస్యుడికీ, హైదారాబాద్ లో ఆటో వాడికీ , శ్రీకాకుళంలో వ్యవసాయ కూలికీ, బరోడాలో కేబ్ డ్రైవర్ కీ, ఢిల్లీలో పానిపురీ అమ్మేవాడికీ, ఇండోర్ ఇళ్ళల్లో అంట్లు తోమే ఆడవాళ్ళకీ, హర్యానాలో తిరగబడుతున్న రైతులకీ, ఉత్తర ప్రదేశ్ లో అత్యాచార బాధితులకీ, ఆదిలాబాద్ ఆదివాసులకీ ఆల్టర్ నేటివ్ అంటూ ఏదీ లేదు.

‘లెస్సర్ ఈవిల్’ అని సరిపెట్టుకుని మరో చిన్నదొంగకి వోటు వేయడమే.”It’s a hit and run operation and there is no place to run”అనేది ఒక పాత ఇంగ్లీష్ సినిమా ప్రోమో!

తలకాయలు తమ తమ జేబుల లోపల దాచుకొనుచు పోలింగుకు పోవలసిన రోజులు వస్తే… సెలవిక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా! అని శ్రీశ్రీ రాసి అరవై ఏళ్ళు దాటింది.

వేప విత్తనమ్ము వేసిన మట్టిలో మామిడి తరువెట్లు మనకు దక్కు ? అంటున్నాడు సుకవి కోయి కోటేశ్వరరావు.

* * *

ఎవరు డబ్బు యిచ్చినా తీసుకోండి అని అన్ని పార్టీల వాళ్ళు వోపెన్ గా చెబుతున్నారు. మాకు మాత్రమే వోటెయండి అని కాళ్ళావేళ్ళా పడుతున్నారు.

అంచేత, నా నిరుపేద దౌర్భాగ్య వోటరూ, పంచుతున్నది నీ డబ్బు అని తెలుసుకో. డబ్బు తీసుకోవడం నీ హక్కు అని గుర్తించు. విషాదాన్ని విస్కీగా మార్చి విచ్చలవిడిగా తాగే స్వేచ్చని ప్రజాస్వామ్యం నీకు ప్రసాదిస్తోంది.

డెమోక్రసీ అనేదొక డేంజరస్ నిషా.

ఓటు పవిత్రమైంది సుమా, జాగ్రత్త!

* * * -తాడి ప్రకాష్ 9704541559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions