.
దారి చూపని దేవతా! ఈ టోల్ గేటు ఎన్నడు వీడక… ఫాస్ట్ ట్యాగ్ దారి దోపిడీ
పొద్దున్నే వార్తలు చదవకపోతే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి. చదివితే-
“నిండా మునిగినవాడికి చలేమిటి? గిలేమిటి?”
“ఒకేసారి అటు గోడ దెబ్బ- ఇటు చెంప దెబ్బ”- లాంటి ఏవేవో సామెతలను గుర్తు చేసుకుని మనల్ను మనమే ఓదార్చుకోవాల్సివస్తుంది. అలాంటి ఒకానొక వార్త ఇది.
Ads
జాతీయ రహదారుల్లో టోల్ బూత్‌ల దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోయినా, ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్ లిస్ట్ లో ఉన్నా పెనాల్టీగా డబుల్ ఛార్జ్ వసూలు చేసేలా రాత్రికి రాత్రే నిబంధనలను మార్చి… ఆలస్యం కాకుండా సూర్యుడు ఉదయించగానే సోమవారం నుండి అమల్లో పెట్టారు.
చందమామ కథల్లో దారికాచి దోచుకునే దొంగల కథలు; గుర్రాలమీద గుంపులుగా వచ్చి సర్వం దోచుకునే బందిపోటు దొంగల ముఠాల కథలు; దారికి రాళ్ళు అడ్డం పెట్టి పెళ్ళిళ్ళకు వెళ్ళేవారి నుండి నగలను మాత్రమే దోచుకునే సీజనల్ దొంగల కథలు… ఇలా ఎన్నెన్నో విన్నాం. కన్నాం. ఆధునిక సైబర్ దోపిడీలు అనుభవిస్తున్నాం.
పై కథలన్నిటికి ఈ ఫాస్ట్ ట్యాగ్ దోపిడీ తాతలాంటిది. ఇంకా చెప్పాలంటే ముత్తాతలాంటిది. సాధారణంగా పంటకు రక్షణ కంచె. అలాంటి కంచే చేను మేస్తే దేవుడే దిక్కు.
వెనకటికి జంధ్యాల నాటకంలో ఒక పదవీ విరమణ పొందిన బడుగు జీవి ప్రభుత్వ కార్యాలయానికి వెళతాడు. తనకు రావాల్సిన పెన్షన్ తాలూకూ ఎరియర్స్ ఎప్పుడొస్తాయని అడుగుతాడు. “ఇన్నేళ్లుగా తిరుగుతూనే ఉన్నావు నువ్వు. అడిగిన అన్ని కాగితాలు ఇచ్చావు! నువ్ బతికి ఉన్నట్లు ఇంకొక్క కాగితమిస్తే…” అంటాడు ఉద్యోగి. మనవైపు తిరిగి ఆ బడుగు జీవి- “అయ్యో నేనింకా బతికే ఉన్నానా? చావలేదా?” అంటాడు. ప్రేక్షకుల కరతాళధ్వనులతో హాలు హాలంతా మారుమోగిపోయేది.
వెనకటికి సామాజిక సమస్యలమీద ఇలా పదునైన ప్రదర్శనలైనా కర్తవ్యాన్ని గుర్తు చేసేవి. ఇప్పుడు జగన్నాటకంలో ఎవరి నాటకం వారిది కావడంతో సమాజాన్ని పట్టి పీడించే సమస్యలు తెరమరుగై మన మొహాలే ముఖపుస్తకంలో, ఇంస్టాలో రీళ్ళు రీళ్ళుగా తిరుగుతున్నాయి.
మన తోలు ఒలిచే టోలు గేట్ల గురించి గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. “అదే నువ్వు- అదే నేను- అదే గీతం పాడగా…” అన్నాడు ఆత్రేయ బాధగా. “అదే టోల్ గేట్- అదే మనం- అదే దోపిడీ…” అని మనం కూడా అదే గీతం పాడుకోవాలి బాధగా.
ఫాస్ట్ ట్యాగ్ లో ముందుగా చెల్లించే సొమ్ము దేశవ్యాప్తంగా ఎన్ని వందల, వేల కోట్లు జమ అయి ప్రభుత్వ ఖజానాలో మూలుగుతూ ఉంటుందో! ఏటా దగ్గర దగ్గర అక్షరాలా లక్ష కోట్ల రూపాయలు వాహనదారులు దారుల్లో టోల్ గేట్లకు కట్టినా ప్రభుత్వం ఇంకా వసూళ్ళు పెంచడానికి కొత్తదారులు ఎందుకు వెతుకుతోందో! తెలిస్తే ఎర్రగడ్డ మన గుమ్మం ముందుకు నడిచి వస్తుంది.
ఒక అరవై కిలోమీటర్ల నాలుగు వరుసల జాతీయ రహదారి. కిలోమీటర్ నిర్మాణానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ లెక్కప్రకారం తక్కువలో 8 నుండి అత్యధికంగా 14 కోట్ల ఖర్చు. అంటే అరవై కిలోమీటర్లకు 840 కోట్ల ఖర్చు. దీనికి వడ్డీ, భూ చక్ర విష్ణు చక్ర వడ్డీ లెక్కలు కలుపుకుని పదేళ్ళకు 1500 కోట్లు అవుతుందనుకుందాం. మనం ఎన్ని లక్షల కోట్లు పన్నులు కట్టినా… ఉచితాలకు ఉచితానుచితాలు మరచి బాధ్యతగల మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు పోటీలుపడి పంచి పెట్టాలి కాబట్టి… దయగల ప్రభుత్వాల దగ్గర రోడ్లు వేయడానికి, ఆసుపత్రులు, బడులు కట్టడానికి డబ్బులు ఉండి చావవు.
దాంతో ప్రయివేటువారితోనే వేలకు వేల కిలోమీటర్ల రోడ్లు వేయించాలి. వారు ముందు డబ్బు పెట్టి… తరువాత బాధ్యతగల భారతీయ పౌరుల నుండి వసూలు చేసుకోవాలి. ఇంతవరకు బాగానే ఉంది. కలిలో ధర్మం ఒంటి కాలిమీదే నడుస్తుందని ముందే చెప్పేశారు కాబట్టి ఇంతదాకా దోపిడీ ధర్మబద్ధమే అనుకుందాం.
ఆ అరవై కిలోమీటర్ల దారిలో మనం 1500 కోట్లు చెల్లించిన తరువాత… పదిహేను, పాతికేళ్ళయినా ఆ టోల్ గేట్ ఎందుకు మాయం కాదో! మనం పట్టించుకోము. అసలు, వడ్డీ, లాభాలు కట్టాక ఒకటి, రెండు తరాలుగా మనం కడుతున్నది ఎవరి జేబుల్లోకి వెళుతోందో! మనమెప్పుడూ ఆరా తీయము.
నాగరిక సమాజంలో మనం కట్టే పన్నులు ఎటు వెళుతున్నాయో? ఏ రూపంలోకి మారుతున్నాయో? తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. అడిగేవాడు లేకపోతే ఇలాగే ఉంటుంది. టోల్ గేటే పెద్ద తలతిక్క లెక్క అయితే… దానికి మినిమమ్ బ్యాలెన్స్, బ్లాక్ లిస్ట్, డబుల్, త్రిబుల్ పెనాల్టీ వసూళ్ల లెక్కలేమిటో? ఖర్మ కాకపొతే!
రావాల్సిన పెన్షన్ ఎరియర్స్ రానందుకే జంధ్యాల బతికి ఉన్నానా? ఇంకా పోలేదా? అనిపించాడు పాత్రచేత. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్ పి సి ఐ) తాజా ఫాస్ట్ ట్యాగ్ కొరడా దెబ్బలు, పట్టపగటి దోపిడీలను చూస్తే ఏమనిపించేవాడో!
పోయాడు కాబట్టి…బతికిపోయాడు!
మనం టోల్ గేట్ల దగ్గర పోలేక…చచ్చే చావు చస్తున్నాం!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article