అప్పటి సినారె దగ్గర నుంచి సుద్దాల మీదుగా గోరేటి దాకా… తెలంగాణ ఆకాంక్షల దిశలో చేసిందేమీ లేదనే భావన చాలామందిలో ఉన్నదే..! పుట్టిన మట్టిని ప్రేమించని ఘనతలెంత గొప్పవైతేనేం, వాటికున్న సార్థకత ఎంత..? ఇదే సినారె అప్పట్లో… అంటే తను రెండు చేతులతో ఎడాపెడా సినిమా పాటలు రాసేస్తున్న వేళ… 1971లో జీవితచక్రం అనే సినిమా వచ్చింది… అందులో ఎన్టీయార్, వాణిశ్రీ, శారద… అప్పటికింకా హీరోయిజాల పెడపోకడలు స్టార్ట్ కాలేదు, కథే సినిమాను ఏలుతున్న కాలం అది… దర్శకుడేమో సీఎస్‌రావు… సంగీతం శంకర్ జైకిషన్… కొన్ని బాగా పాపులరైన పాటలున్నయ్… ఆ నాలుగు పాటల్ని ఆరుద్ర రాశాడు… ఇవన్నీ ఘంటసాల పాడాడు… అవి ఇవీ…
1.కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు – గుండెల్లో గుండె కలిపి చూడు | |||
2.కంటిచూపు చెబుతోంది, కొంటె నవ్వు చెబుతోంది, మూగమనసులో మాట ఓ పిల్లా | |||
3.మధురాతి మధురం, మన ప్రేమ మధువు, మదీ నిండలేదూ – తమీ తీరలేదు | |||
4.సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా, లోకాన పన్నీరు జల్లేవులే, నీకేమో కన్నీరు మిగిలిందిలే |
ఇదే సినిమాలో ఒక బతుకమ్మ పాట ఉంది… అది రాసింది సినారె… ఒక్కసారి అది వింటుంటే సినారె మీద ఎక్కడో ఏమూలో ఉన్న కాస్త అభిమానం కూడా కొడిగట్టిపోతుంది… అంత వెగటు… రాసిందీ అలాగే, తీసిందీ అలాగే… ఎత్తుకోవడమే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాట ఎత్తుకుంటుంది సుశీల, వసంత బృందం… పూల బతుకమ్మల్లాగా కనిపించే అట్టముక్కల్ని పట్టుకుని గ్రూప్ డాన్సర్లు గంతులెస్తే వస్తారు… ఆ డాన్స్ డైరెక్టర్‌కు, ఆ డైరెక్టర్‌కు, ఆ ప్రొడ్యూసర్‌కు… ఎవరికీ బతుకమ్మ అంటే తెలియదు… పోనీ, సినారె ఏమైనా ఉద్దరించాడా అంటే అదీ ఉండదు… అకస్మాత్తుగా బతుకమ్మ పాట కాస్తా ఓ బావ కోసం తల్లడిల్లిపోయే, వేగిపోయే ఓ మరదలి పాటగా మారిపోతుంది… ‘బావా, నా బావ, వస్తాడు ఆగవే భామా’ అంటూ పాట ఎటెటో పరుగు తీస్తుంది… మళ్లీ చివరలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనే పల్లవితోనే పాట ముగుస్తుంది… మధ్యలో ఇక ఆ డాన్సర్లు వేసే గెంతులు కొన్ని అసహ్యకరంగా కనిపిస్తయ్… ఇప్పుడిదంతా ఎందుకు చెప్పుకోవడం అంటారా..? ఇది బతుకమ్మ సీజన్ కాబట్టి… ఏఆర్ రెహమాన్ పాట విని వైరాగ్యంతో ఓ మిత్రుడు ఈ సినారె పాటను గుర్తుచేశాడు కాబట్టి…. తెలుగు సినిమా ఇండస్ట్రీకి 1971 నుంచి 2021 వరకూ బతుకమ్మ అంటే ఏమీ తెలియదని మనకు తెలిసిపోతోంది కాబట్టి… చెప్పుకోవాలి కాబట్టి…!!
Ads
Share this Article