.
Director Devi Prasad.C…. ఓ రోజెప్పుడో ఓ అప్‌కమింగ్ సంగీత దర్శకుడొకాయన వాద్యపరికరాలేమీ లేకుండా ముందున్న టేబుల్‌పైన దరువేస్తూ తను చేసిన కొత్త ట్యూన్స్ వినిపిస్తే భలే వున్నాయనుకున్నాను.
ఆయన పేరు “భీమ్స్ సిసిరోలియో”.
మరోసారి మరో అప్‌కమింగ్ సంగీత దర్శకుడు నేను”మిస్టర్ పెళ్ళికొడుకు” సినిమాకు దర్శకత్వం చేస్తున్నప్పుడు సూపర్‌గుడ్ ఫిలింస్ ఆఫీస్‌కొచ్చి కేవలం తన గొంతుతో పాడుతూనే తను చేసిన కొత్త ట్యూన్స్ వినిపిస్తే బాగున్నాయే అనుకున్నాను.
అతని పేరు “చిన్ని చరణ్” (ఇప్పటి పేరు చరణ్ అర్జున్).
Ads
మల్లెపూల గుత్తిని బంగారు పళ్ళెంలో తెచ్చి ముందుపెట్టినా అరిటాకులో ఉంచి ముందు పెట్టినా ఎలా సువాసనలే వెదజల్లుతుందో ఏ పటాటోపం లేకపోయినా కళాకారుల ప్రతిభ గుబాళిస్తుంది.
వారిద్దరూ గీత రచయితలు కూడా. అంతకుముందు నాకు వారితో ఏ పరిచయమూ లేదు.
నా దర్శకత్వంలో “కెవ్వుకేక” సినిమా ప్రారంభిస్తున్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది.
సినిమా పాటలు ఇద్దరు కొత్త సంగీత దర్శకులకు, రీరికార్డింగ్ మరో కొత్త సంగీత దర్శకుడికి ఇవ్వాలని.
మా నిర్మాత “చందు”గారు, హీరో అల్లరి నరేష్ గారు మద్దతు పలికారు.
మరీ కొత్తవాళ్ళు కాకపోయినా భీమ్స్, చిన్నిచరణ్‌ల ప్రతిభ గుర్తుకొచ్చింది.
అప్పటికి వాళ్ళు కొన్ని సినిమాలు చేసివున్నప్పటికీ అడుగుదామనిపించి చెరొక రెండుపాటలు చేస్తారా అని అడిగితే వాళ్ళు ఓకే చెప్పి బ్రహ్మాండంగా చేసిచ్చారు.
రీరికార్డింగ్ “ఎస్.ఏ.రాజ్‌కుమార్”గారి వద్ద సంగీత సహాయకులుగా చేసే “మూర్తి” గారితో చేయించాము. బాలు గారి వద్ద కూడా సంగీత సహాయకులుగా చేసిన అనుభవం ఆయనది. ఆయన గీత రచయిత కూడా.
“నువ్వొస్తావని” సినిమాలోని “కొమ్మాకొమ్మా విన్నావమ్మా కోయిల వొస్తోంది” వంటి మంచి పాటలెన్నో రాశారు.
“కెవ్వుకేక”లో భీమ్స్ చేసిన “బాబూ ఓ రాంబాబూ” అనే పాట పెద్ద హిట్టయ్యింది.
మొన్నమొన్న “గోదారి గట్టు మీద సందమామవే” లాంటి పాటలతో ఉర్రూతలూగించి ఇప్పుడు మెగాస్టార్ సినిమాకి సంగీతం అందించే స్థాయికి ఆయన ఎదగటం ఆనందం.
“చరణ్ అర్జున్” ఎన్నెన్నో మంచి పాటలనందిస్తున్నారు.
మొన్నీమధ్య “హే చికీతా” అనే సినిమాలో నాపైనే చిత్రీకరించిన” ఎల్లెల్లి పోతున్నవా మా అయ్యా ” అనే పాటను తనే రాసి కంపోజ్ చేస్తే విన్నవాళ్ళ గుండెలు ఆర్ధ్రమయ్యాయి. ఆయన ప్రతిభని పరిశ్రమ మరింత హెచ్చు స్థాయిలో వాడుకోవలసివుంది.
చేసే వృత్తిని “పని”లా కాకుండా “సంబరం”లా చేసేవాడే సినిమావాడు.
సినిమా రంగంలోనేకాదు ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించి తీరాలనుకునేవాడు ఈదురు గాలి కొడితే కొమ్మపై నుండి ఎగిరిపోయే “పిట్ట”లా ఉండడు.
తుఫానులొచ్చినా మట్టినే అంటిపెట్టుకొనివుండే “చెట్టు” లా ఉంటాడు…
Share this Article