Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హేమిటీ… వాళ్లింట్లో టమాట పప్పు, టమాట రసం, టమాట పచ్చడి, టమాట రైస్..?!

July 10, 2023 by M S R

‘IT-Tamota’: అది బ్రాహ్మీ ముహూర్తం. ఆ ఇంట్లో ఎవరూ నిద్ర లేవలేదు. దిగువ మధ్య తరగతి ఇళ్లున్న కాలనీ కాబట్టి బైకులు, ఆటోలు తప్ప కార్లు కూడా లోపలికి రాలేవు. ఒకవేళ వచ్చినా ఒక కారుకు ఎదురుగా ఇంకో కారు వస్తే…ఎవరో ఒకరు వెనక్కు వెళ్లాల్సిందే. అలాంటి ఏరియాలో సాయుధ పోలీసులతో అధికార నిఘా విభాగం బృందాలు మెరుపు దాడి చేశాయి. ఆ ఇంటి తలుపు తట్టాయి. తెల్లవారక ముందే ఏ పాల బిల్లు కోసమో ఎవరో తలుపు తడుతున్నారనుకుని మొదట ఇంట్లోవాళ్లు పలకలేదు. దబదబా తలుపులు తడుతూనే ఉండడంతో లేచి తలుపులు తెరవక తప్పలేదు. ఎదురుగా పదుల సంఖ్యలో అధికారులు, కెమెరాలు, సాయుధులు. ఒక్కసారిగా ఇంట్లో వాళ్లకు ఫీజులు ఎగిరిపోయాయి.

వచ్చినవారు ఆదాయప్పన్ను వారు అని ఇంటివారికి అర్థమయింది. వారి వెంట ఇతర నిఘా విభాగాల వారు కూడా ఉన్నట్లున్నారు. నాలుగు నెలలుగా ఇంటి అద్దె, కరెంటు బిల్లే సమయానికి కట్టలేకపోతున్న తమ దగ్గర ఏముంది బూడిద? అనుకుని ధైర్యంగా, సాదరంగా లోపలికి ఆహ్వానించారు. వారు అడగకుండానే చిన్నా పెద్ద రేకు ట్రంకులను వారి ముందు పెట్టబోయారు. వారు వద్దన్నారు. నేరుగా ఫ్రిడ్జ్ తలుపు తీశారు. ఫ్రిడ్జ్ లో బ్లాక్ మనీ పెట్టేంత దౌర్భాగ్యులం కాదని వీరు వివరణ ఇవ్వబోయారు… ఇంతలో వజ్రాలు దొరికినట్లు ఫ్రిడ్జ్ లోపలి నుండి ఒక్కొక్కటి బయటికి తీశారు.

Ads

తూనికలు కొలతల వారు ఒక్కోదాన్ని మిల్లీ గ్రాములతో పాటు లెక్కగడుతున్నారు. నెల రోజులుగా వాటి వాడకం, సగటున రోజుకు కొన్న మోతాదు, కుటుంబంలో ఒక్కొక్కరు ఏ పరిమాణంలో తీసుకుని ఉంటారో రిట్రాస్పిక్టివ్ లెక్కలు, వారి నెల ఆదాయం…ఇలా ఏ చిన్న అంశాన్ని వదలకుండా అత్యంత శాస్త్రీయంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా విచారణ మెదలుపెట్టారు.

అర్ధరాత్రి నిద్ర లేచి వచ్చినట్లున్నారు… చాయ్ తాగుతారా? అని ఇంటావిడ అడిగేసరికి అధికారులు స్పృహదప్పి పడిపోయారు. ఇన్నేళ్ల తమ సర్వీసులో వెళ్ళగానే చాయ్ తాగుతారా అని అతిథి మర్యాద చేసిన మొదటి ఇల్లు ఇదే అని తేరుకున్నాక…వేనోళ్ల పొగిడారు.

విచారణ మొదలయ్యింది. ఒకరు రాసుకుంటున్నారు. మరొకరు వీడియో రికార్డ్ చేస్తున్నారు.

చెప్పండి…ఫ్రిడ్జ్ లో ఇవి రెండు కేజీల ఏడు వందల గ్రాముల ఏడు మిల్లీ గ్రాముల దాకా ఉన్నాయి. మొత్తం ఎన్ని కేజీలు కొన్నారు? అంత డబ్బు ఎక్కడిది? ఇందులో బ్లాక్ ఎంత? వైట్ ఎంత? మీ కడుపులో ఉన్నవాటిని కూడా స్కాన్ చేయించి లెక్క తేలుస్తాం.

హమ్మయ్య! అందరికీ స్కాన్ చేయిస్తారా సార్? పుట్టి బుద్ధెరిగినప్పటినుండి ఒక్కసారయినా స్కాన్ చేయించుకోలేకపోయామే! అని బాధపడేవాళ్లం. దేవుడు మా మొర ఆలకించి…మిమ్మల్ను పంపినట్లు ఉన్నాడు…

మీ బ్యాంక్ అకౌంట్ ఆరు నెలల స్టేట్ మెంట్ ఇది. అన్ని ఖర్చులు పోను ప్రతి నెలా పది వేలు అప్పు కూడా చేస్తున్నారు…అలాంటప్పుడు ఫ్రిడ్జ్ లో దాదాపు మూడు కేజీలు నిల్వ చేశారంటే… మీ ఆదాయ వనరులను నిరూపించుకోవాల్సి ఉంటుంది…

అలాగే కానీ…ఇదుగో ముందు చాయ్ తాగండి…

తల్లీ! నువ్ మనిషి కాదు. దేవతవు. దాడి చేసిన ఆదాయప్పన్ను పన్ను పీకి…ఆ పంటికి చాయ్ కప్పు అందిస్తున్నావంటే…నీ ధైర్యం ధైర్యానికే ధైర్యం తల్లీ! తెల్లవారిన తరువాత మీ ఫ్యామిలీ మొత్తం మా ఆఫీసుకు వచ్చి ఇంకో స్టేట్ మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతదాకా మా నిఘా బృందాలు మీ ఇంటి ముందే ఉంటాయి

అలాగే…వారిక్కూడా ఎనిమిది గంటలకు మేము తినే టమోటా బాత్ ఇంత పెడతాము లెండి…పాపం… ఎప్పుడు తిన్నారో? ఏమో!

ఆదాయప్పన్ను అధికారులు మళ్లీ స్పృహ దప్పి పడిపోయారు!

(వారు ఫ్రిడ్జ్ లో పట్టుకున్నది టమోటాలు! నిఘా, దాడి, ఆదాయానికి మించిన ఆస్తుల విచారణ మొత్తం టమోటాలకు సంబంధించినదే!)

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com (ఇదొక సరదా కథనం… నిజానికి రవాణా ఖర్చులు కూడా రాక క్వింటాళ్ల కొద్దీ టమాటలు రోడ్ల పక్కన పారబోెసిన గడ్డు రోజులు ఎన్నెన్నో… నాలుగు రోజులు ఇలా అధికధరలు రైతన్నలకు వస్తే మాకూ ఆనందమే…) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భార్యా రూపవతీ శత్రుః….. కాదు, కాదు… భర్తా రూపవాన్ శత్రుః…
  • అయ్యో, తమ్ముడూ… ఎమోషన్, యాక్షన్ రెండూ ‘లయ’తప్పాయి..!!
  • Walk Of Fame Star… ఈ అంతర్జాతీయ గౌరవాన్ని దీపిక ‘కొనుక్కుందా..?!
  • ఓహో, నువ్వు సినిమా హీరోయిన్‌వా..? నేనెప్పుడూ నిన్ను చూడలేదమ్మా..!!
  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions