దిల్‌రాజు బాగా ఆశపోతు… ఈమధ్య కొన్ని సినిమాలతో దవడలు వాచిపోయాయి కదా, ఇప్పుడిక పొన్నియిన్ సెల్వన్ సినిమాతో ఇంతకింతా తీసుకోవాలని అనుకుంటున్నాడు… అందుకే హైదరాబాద్‌లో ఈ సినిమా టికెట్ రేట్లను అడ్డగోలుగా పెంచిపారేశాడు… మొన్నమొన్నటిదాకా పలు సినిమాల నిర్మాతలు ‘‘మేం టికెట్ల ధరలు తగ్గించాం, వచ్చి చూడండి, థియేటర్లకు రండి ప్లీజ్’’ అని ప్రచారాలు చేసుకున్నారు కదా… జనం థియేటర్లకు రాకపోవడానికి టికెట్ల ధరలే ప్రధాన కారణమని విశ్లేషణలు చేశారుగా… పూర్తి కంట్రాస్టుగా ఇదీ దిల్‌రాజు యవ్వారం… చెప్పేది ఒకటి, చేసేది మరొకటి…

నిజానికి పాత రోజులు వచ్చాయని, ఎంతగా పర్సులు కత్తిరించినా సరే, ప్రేక్షకులు ఆనందంగా భరిస్తూ థియేటర్లకు వచ్చి, కేకలు వేస్తూ, ఆకాశం స్థాయి రేట్లతో పాప్ కార్న్ నములుతూ, కూల్‌డ్రింకులు చప్పరిస్తారని నిర్మాతలు, ప్రత్యేకించి దిల్‌రాజు భ్రమిస్తున్నట్టుంది… మేజర్ మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర 295 అట… ఎవరిష్టం వాళ్లు, సినిమాలకు సంబంధించి తెలంగాణలో ఓ ప్రజా ప్రభుత్వం అంటూ లేదు కదా… థియేటర్లలో ప్రతిదీ దోపిడే… సినిమా పిచ్చోళ్లను దోచుకోవడమే టార్గెట్…

వాస్తవానికి జనం థియేటర్లకు ఏమీ ఎగబడటం లేదు… ఏది థియేటర్‌లో చూడాలో, ఏది ఓటీటీలో చూడాలో తెలివిగా నిర్ణయం తీసుకుంటున్నారు… సో, దిల్ రాజు, చక్రవర్తి అనుకున్నట్టుగా మణిరత్నం సినిమాకు జనం ఎగబడే సీన్ పెద్దగా కనిపించడం లేదు… కారణం, థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ కోసం సౌండ్, మంచి టేకింగ్, మంచి లోకేషన్లు, గుడ్ సినిమాటోగ్రఫీ ఉండవని కాదు… మణిరత్నం బాగానే తీస్తాడు… కానీ బేసిక్‌గా అది తమిళ డబ్బింగ్… తమిళ కథ… తమిళ తారాగణం… అది తెలుగువాళ్లకు కనెక్ట్ కావడం కష్టం… ప్లస్ పాటలు, సంగీతం పెద్దగా క్లిక్ కాలేదు కూడా… మరి ఈ ధర ఎందుకు పెట్టినట్టు..?

దీన్ని ఎస్టాబ్లిష్ చేసే అంకెలు చెప్పాలా..? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు… మొదటిరోజుకు తమిళనాడు థియేటర్లలో అడ్వాన్స్ బుకింగులు ఈ సినిమాకు 2.03 లక్షలు… అంటే 3.6 కోట్లు… కానీ తెలుగు రాష్ట్రాల థియేటర్లలో అడ్వాన్స్ బుకింగుల సంఖ్య 6600 మాత్రమే… అంటే 15 లక్షలు… తెలుగువాళ్లకు పెద్దగా ఇంట్రస్టు లేదని చెప్పడానికి ఇది చాలదా..? రిలీజు నాటికి ఇంకేమైనా కొంతమేరకు పెరుగుతాయి కావచ్చుగాక… కానీ తమిళ ప్రేక్షకుల మీదే నిర్మాతలకు భారీగా ఆశలున్నయ్…

హైదరాబాద్ విషయానికే వస్తే… ఇక్కడ హిందీ సినిమాలు కూడా బాగానే నడుస్తయ్… ఈ పొన్నియిన్ సెల్వన్‌కు ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా ఉంది… అది హృతిక్, సైఫ్‌ల విక్రమ్ వేద… సినిమా బాగానే వచ్చిందని అంటున్నారు… దిల్‌రాజు పోకడలపైన ఇప్పటికే సోషల్ మీడియాలో నెగెటివ్ రియాక్షన్స్ కనిపిస్తున్నయ్… తొలిరోజు, రెండోరోజు థియేటర్ వైపు ఎవడూ వెళ్లకపోతే, వెంటనే టికెట్ ధరలు తగ్గిస్తారులే, ఇలాంటి నిర్మాతలకు అలాంటి ధోరణిని ప్రేక్షకులు చూపించడమే కరెక్టు పద్ధతనే అభిప్రాయాలూ వినిపిస్తున్నయ్… పైగా తొలిరోజే సినిమా చూసేయాలనేంత పిచ్చి, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న నటీనటులెవరూ లేరు ఈ సినిమాలో…!!